సూర్యుడి (Sun)ని అధ్యయనం చేసేందుకు రోదసిలోకి దూసుకెళ్లిన ‘ఆదిత్య-ఎల్ 1 (Aditya-L1)’ తన ప్రయాణంలో మరో మైలురాయిని అందుకుంది. ఈ ఉపగ్రహంలోని ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పరిమెంట్ పేలోడ్ తన ఆపరేషన్స్‌ను ప్రారంభించిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) తాజాగా వెల్లడించింది. ఈ పేలోడ్‌లోని రెండు పరికరాలు పరిశోధనలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయని, ఇవి సౌర గాలుల (Solar Winds)ను అధ్యయనం చేస్తున్నాయని తెలిపింది.
ఈ ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పరిమెంట్ పేలోడ్‌లో రెండు పరికరాలు ఉన్నాయి. ఇందులోని సూపర్‌థర్మల్ అండ్ ఎనర్జిటిక్ పార్టికల్ స్పెక్ట్రోమీటర్ (STEPS)ను సెప్టెంబరు 10న, సోలార్ విండ్ అయాన్ స్పెక్ట్రోమీటర్ (SWIS)ను నవంబరు 2న యాక్టివేట్ చేశారు. ఈ రెండు తమ కార్యకలాపాలను సజావుగా సాగిస్తున్నాయని ఇస్రో తమ తాజా ప్రకటనలో వెల్లడించింది.
స్విస్‌లో ఉన్న రెండు సెన్సర్లు 360 డిగ్రీల్లో తిరుగుతూ పనిచేస్తున్నాయి. ఇవి నవంబరులోని రెండు తేదీల్లో సోలార్ విండ్ అయాన్లు, ప్రైమరీ ప్రోటాన్స్, ఆల్ఫా పార్టికల్స్‌ను విశ్లేషించినట్లు ఇస్రో తెలిపింది. ఈ సెన్సర్ సేకరించిన ఎనర్జీ హస్టోగ్రామ్‌ను పరిశీలించిన తర్వాత.. ప్రోటాన్, ఆల్ఫా పార్టికల్స్‌లో కొన్ని వైవిధ్యాలు ఉన్నట్లు గుర్తించామని ఇస్రో పేర్కొంది.
ఈ తాజా విశ్లేషణతో.. సౌర గాలుల లక్షణాలపై సుదీర్ఘంగా నెలకొన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశముందని ఇస్రో వివరించింది. అంతేగాక, సౌర గాలుల్లో అంతర్లీనంగా ఉండే ప్రక్రియలు, భూమిపై అవి ఎలాంటి ప్రభావం చూపుతాయనే విషయంపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని తెలిపింది. ఇక, లాగ్రాంజ్ పాయింట్ వద్ద చోటుచేసుకునే కరోనల్ మాస్ ఎజెక్షన్‌పై ఓ అవగాహనకు రావచ్చని వెల్లడించింది.
సూర్యుడిపై అధ్యయనం కోసం ఈ ఏడాది సెప్టెంబరు 2న నింగిలోకి దూసుకెళ్లిన ‘ఆదిత్య – ఎల్ 1’ తన ప్రయాణంలో దాదాపు చివరి దశను చేరుకుంది. ఈ ఉపగ్రహాన్ని ఎల్1 పాయింట్ (L1 Point)లో ప్రవేశపెట్టేందుకు నిర్వహించాల్సిన విన్యాసాలు వచ్చే ఏడాది జనవరి 7వ తేదీ నాటికి పూర్తవుతాయని ఇటీవల ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. భూమి నుంచి 15 లక్షల కి.మీ దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్-1 చేరాక.. దాని కక్ష్యలో పరిభ్రమిస్తూ ఆదిత్య – ఎల్ 1 సూర్యుడిని అధ్యయనం చేస్తుంది.
👉 – Please join our whatsapp channel here –