రహదారులపై పరిమితికి మించి వేగంతో వాహనం నడపడం చాలా ప్రమాదం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందుకే స్పీడ్‌గన్లను ఏర్పాటు చేస్తుంటారు. నిర్దేశిత వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే చలాన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వేగం గురించి అవగాహన లేని చోట్ల వాహనాలను వేగంగా పోనిస్తే జరిమానా తప్పదు. ఇలాంటి సమయాల్లో మనం ప్రయాణించే ప్రాంతాల్లో తాత్కాలిక వేగ పరిమితుల్ని గుర్తిస్తూ అలర్ట్ చేసే యాప్ ఉంటే ఎంత బాగుంటుందో కదా? దీని కోసమే రియల్ టైమ్ స్పీడ్ లిమిట్ ఇన్ఫర్మేషన్ డ్రైవర్‌కు తెలిపేలా గూగుల్ తన మ్యాప్స్‌లో కొత్త ఫీచర్‌ను(Google Maps) అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని సాయంతో పరిమితికి మించి వేగంతో ప్రయాణిస్తే వెంటనే అలర్ట్ పొందొచ్చు. స్ట్రీట్ వ్యూ ఫొటోలు, థర్డ్ పార్టీ ఫొటోల సాయంతో స్పీడ్ లిమిట్‌ను గూగుల్ గుర్తిస్తుంది.
ఎనేబుల్ ఇలా..
మీ మొబైల్‌లోని ‘గూగుల్ మ్యాప్స్’ యాప్‌ను ఓపెన్ చేయండి. పైన కుడివైపున ప్రొఫైల్ ఐకాన్‌ని ట్యాప్ చేసి ‘Settings’ని ఎంచుకోండి. తర్వాత స్క్రీన్‌ని కిందకు స్క్రోల్ చేసి Navigation settings ఆప్షన్ ఎంచుకోండి. అందులో Driving options సెక్షన్ కనిపిస్తుంది. అందులో డ్రైవింగ్‌కు సంబంధించిన వివిధ ఫీచర్లు ఉంటాయి. వాటిలో speedometer ఆప్షన్‌ను ఎనేబల్ చేసుకుంటే మీరెంత వేగంతో ప్రయాణిస్తున్నారో రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ పొందొచ్చు. అలానే పరిమితికి మించి వేగంగా వాహనాన్ని నడుపుతుంటే మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది.
👉 – Please join our whatsapp channel here –