Business

విలోమానుపాతంలో ఉన్న అప్పులు రాబడులు

విలోమానుపాతంలో ఉన్న అప్పులు రాబడులు

రాష్ట్ర బడ్జెట్‌ లక్ష్యాల ప్రకారం రుణ సేకరణలో అత్యధిక మొత్తాన్ని సర్కారు ఇప్పటికే సేకరించిందని కాగ్‌ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24)లో రాష్ట్ర బడ్జెట్‌లో రుణ సేకరణ లక్ష్యం రూ.38,234.94 కోట్లకుగాను మొదటి ఏడు నెలల(గత ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు)లోనే రూ.33,378 కోట్లు (87.30%) తీసుకున్నట్టు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో (2022-23) బడ్జెట్‌ రుణ సేకరణ లక్ష్యంలో భాగంగా తొలి ఏడు నెలల్లో కేవలం 39.58 శాతమే(రూ.20,057 కోట్లు) తీసుకోగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతకు రెట్టింపునకుపైగా రుణాలను సేకరించడం గమనార్హం. అప్పులతో కలిపి ఈ ఏడాది మొత్తం రాబడులు రూ.2.59 లక్షల కోట్లకుపైగా ఉంటాయని అంచనా వేయగా, ఇప్పటివరకు రూ.1.33 లక్షల కోట్లే వచ్చాయని కాగ్‌ అక్టోబరు నివేదిక విశ్లేషించింది. ఈ ఏడాది ఎన్నికలు ఉన్నందున సంక్షేమ పథకాలకు నిధుల పంపిణీ చేసేందుకు రుణాలను ఎక్కువగా సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.33,378 కోట్లు తీసుకున్నందున..తదుపరి ఏర్పడే ప్రభుత్వం మిగిలిన నెలల్లో (మార్చి వరకు) బడ్జెట్‌ రుణ లక్ష్యంలో కేవలం రూ.4,856 కోట్లను మాత్రమే తీసుకోవడానికి అవకాశమున్నట్లు నివేదిక స్పష్టం చేస్తోంది.

రాబడుల లక్ష్యం రూ.2.16 లక్షల కోట్లు.. వచ్చింది రూ.99,775 కోట్లు

ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రెవెన్యూ రాబడులు రూ.2.16 లక్షల కోట్ల మేర సాధించాలనేది బడ్జెట్‌ లక్ష్యం. తొలి ఏడు నెలల్లో అందులో సుమారు 46 శాతం(రూ.99,775.12 కోట్లు) మాత్రమే సాధించారు.

రూ.2.16 లక్షల కోట్ల రెవెన్యూ రాబడుల్లో ప్రధానంగా పన్నుల ద్వారా రూ.1.52 లక్షల కోట్లకుపైగా సాధించాలనేది లక్ష్యం. వాస్తవంగా రూ.77,382 కోట్లు (50.74%) మాత్రమే వచ్చింది. గతేడాది ఇదే సమయానికి రెవెన్యూ రాబడి లక్ష్యంలో 55.39 శాతం సాధించడం గమనార్హం.

పన్నుల ద్వారా సమకూరే రాబడిలో జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు, అమ్మకపు పన్ను, ఎక్సైజ్‌ సుంకం కీలకం. వీటిలో ఎక్సైజ్‌ సుంకం ఒక్కటే గతేడాదికన్నా 9.9 శాతం అధికంగా సాధించారు. జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు, అమ్మకపు పన్నుల రాబడుల్లో ఈ స్థాయిలో పెరుగుదల నమోదుకాకపోగా.. గత ఏడాదికన్నా తగ్గుదల కనిపిస్తోంది
.
కేంద్రం పన్నుల్లో రాష్ట్ర వాటా కింద రూ.14,528 కోట్లు రావాలనే లక్ష్యానికిగాను, ఇప్పటికే 49.14 శాతం(గతేడాది 47.64%) వచ్చింది.

తగ్గిన రాయితీల వ్యయం

రాష్ట్ర ప్రభుత్వ వ్యయం అంచనాల్లో రాయితీ(సబ్సిడీ)లకు నిధుల విడుదల లక్ష్యం రూ.12,958 కోట్లకుగాను 34.19 శాతమే నమోదైంది. గతేడాది ఏడు నెలలకుగాను రాయితీలకు రూ.5,710 కోట్లు(47.39%) విడుదల చేయగా, ఈ ఏడాది రూ.4,431 కోట్లే(34.19) ఇవ్వడం గమనార్హం.

తొలి ఏడు నెలల్లో జీతభత్యాలకు రూ.23,391 కోట్లు, పింఛన్లకు రూ.9,933.52 కోట్లు, పాత బాకీలపై వడ్డీ చెల్లింపులకు రూ.12,956 కోట్లు ఖర్చుచేశారు.

రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఈ ఏడాది సుమారు రూ.56,062 కోట్లు ఉండవచ్చని బడ్జెట్‌లో అంచనా వేయగా, తొలి ఏడు నెలల్లోనే రూ.33,378 కోట్లు(59.54%) నమోదైంది. గతేడాది ఇదే సమయానికి ద్రవ్యలోటు 38.45 శాతంగా ఉంది.

రెవెన్యూ మిగులు ఈ ఏడాది రూ.4,881 కోట్లు ఉండవచ్చని బడ్జెట్‌లో అంచనా వేశారు. ఏడు నెలలు పూర్తయ్యేసరికి మైనస్‌ 52.92 శాతం(రూ.2,583 కోట్ల లోటు) ఉందని కాగ్‌ స్పష్టం చేసింది. గతేడాది రెవెన్యూ మిగులు అంచనాల ప్రకారం తొలి ఏడు నెలల్లో 12.33 శాతం అదనంగా నిధులుండగా, ఈ ఏడాది అదనంగా లేకపోగా లోటు ఏర్పడినట్లు కాగ్‌ తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z