తోలుకు ప్రత్యామ్నాయంగా మొక్కల వ్యర్థాలతో వివిధ వస్తువులు తయారు చేసే విధానాన్ని తిరువనంతపురానికి చెందిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (సీఎస్‌ఐఆర్) అభివృద్ధి చేసింది. వీగన్ ప్లాంట్ బేస్డ్ టెక్నాలజీతో తయారు చేసిన జాకెట్లు, పర్సులు, బూట్లు, చెప్పులు, చేతి సంచులను మైసూరులో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఆహార సమ్మేళనంలో శుక్రవారం ప్రదర్శించారు. ఈ వస్తువులు చెరకు పిప్పి, వరి, గోధుమ పొట్టు, మామిడి టెంక, పీచుతో తయారుచేసినవి, పర్యావరణానికి ఎలాంటి హాని తలపెట్టవు అని సంస్థ ప్రతినిధులు చెప్పారు. సాధారణ తోలు, సింథటిక్ ముడి సరకుతో పోలిస్తే ఈ వస్తువుల తయారీకి తక్కువ పెట్టుబడి అవుతుంది. మన్నిక కాలం సుమారు మూడేళ్లు. భూమిలో సులభంగా కలిసిపోతాయి. రైతులకు ఆదాయాన్ని సృష్టించగలిగే ఈ తరహా ముడి సరకుతో జౌళి, ఫ్యాషన్, మోటారు వాహనాల్లో వాడే వస్తువులను కూడా తయారు చేయొచ్చని ఈ సంస్థ చెబుతోంది.
👉 – Please join our whatsapp channel here –