ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 2023 ఎన్నికల్లో కొడాలి నరేన్ ప్యానెల్ నుండి చిత్తూరు జిల్లాకు చెందిన పాంట్ర సునీల్ సహాయ కోశాధికారి పదవికి బలీయమైన, అనుభవజ్ఞుడైన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. తానా ఆపన్నుల సంజీవని టీంస్క్వేర్‌కు లక్ష డాలర్లను సేకరించి తానాకు ఆర్థికపరమైన, సేవాపరమైన బలాన్ని తీసుకురావడమే లక్ష్యంగా తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు TNIకు ఆయనిచ్చిన ముఖాముఖిలో పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లా ప్రవాసుల సంఘానికి అమెరికాలో ప్రముఖ స్థానం ఉంది. ఈ సంస్థ ఏర్పాటులో, నిర్వహణలో, వృద్ధిలో సునీల్ కీలక భూమిక పోషించారు. తానాతోనే గాక డెట్రాయిట్ తెలుగు సంఘాన్ని కూడా సమన్వయం చేసి చిత్తూరు జిల్లాలో అనేక సేవా కార్యక్రమల నిర్వహణకు వేల డాలర్ల నిధులను సమీకరించి సమర్థవంతంగా ఖర్చు చేశారు.
తానా…కోట్ల రూపాయిల నిధులు, వేలమంది సభ్యులు, మూడు దేశాల్లో (అమెరికా-కెనడా-ఇండియా) కార్యక్రమాలు అంటే సామాన్య విషయం కాదన్న సునీల్, ఇంతటి ఆర్థిక బరువుని విచక్షణతో సమర్థంగా మోయాలంటే విశేష అనుభవం తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. తన అమెరికా ప్రవాస జీవితంలో ఎన్నో సంస్థలతో సాగిన తన అనుబంధం తనకు నేర్పిన పాఠాలను ఈ బాధ్యత నిర్వహించడానికి ఉపయోగపడతాయని తెలిపారు.
తానాలో 12ఏళ్లుగా ప్రాంతీయ ప్రతినిధితో పాటు సాంస్కృతిక సమన్వయకర్తగా, మీడియా విభాగ అధ్యక్షుడిగా విశేష అనుభవం గడించిన సునీల్, డెట్రాయిట్ తెలుగు సంఘంలో గత 15ఏళ్లుగా పలు పదవులను కూడా నిర్వహించారు. వీటిలో ప్రవాసులతో మమేకమయ్యే కార్యక్రమాలతో పాటు ఆర్థికపరమైన అనుభవాలను కూడా గడించానంటున్న ఆయన ఆ అనుభవాలను తానా బలోపేతానికి వినియోగించాలనుకుంటున్నట్లు వెల్లడించారు.
సంస్థకు వచ్చే ప్రతి డాలరుకు జవాబుదారీతనం, పారదర్శకత పెంపొందించడంతో పాటు సాంకేతికతను కూడా పెంచాలనే లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నానని సునీల్ తెలిపారు. తనకు, తమ ప్యానెల్ సభ్యులకు ఈ లక్ష్యాన్ని చేరుకునేలా ఓటు వేసి గెలిపించవల్సిందిగా సునీల్ కోరారు.
—సుందరసుందరి(sundarasundari@aol.com)
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z