Politics

రేపు రేవంత్‌ పార్టీ అగ్ర నేతలతో భేటీ

రేపు రేవంత్‌ పార్టీ అగ్ర నేతలతో భేటీ

త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. మలి విస్తరణలో తమకు అవకాశం వస్తుందని పలువురు నేతలు ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 19న దిల్లీ వెళ్లి పార్టీ అగ్ర నేతలతో సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవుల భర్తీపైన హైకమాండ్‌తో చర్చించనున్నారని సమాచారం. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనుండడంతో ముందుగా పదవుల పంపిణీ ద్వారా పార్టీలో జోష్‌ తేవాలని భావిస్తున్నారు. లోక్‌సభ అభ్యర్థుల విషయంలోనూ ఇప్పటికే ఒక జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో గ్రేటర్‌ హైదరాబాద్‌కే తొలి ప్రాధాన్యం ఇస్తారని సమాచారం. హైదరాబాద్‌ నగరంలోని నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎవరూ ఎన్నికల్లో గెలవలేదు. అయినప్పటికీ నాంపల్లిలో పరాజయం పొందిన ఫిరోజ్‌ఖాన్‌ మైనార్టీ కోటాలో పోటీలో ఉన్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ స్థానంలో ఓటమి చెందిన షబ్బీర్‌అలీకి మంత్రి పదవి ఓకే అయితే ఫిరోజ్‌ఖాన్‌కు అవకాశాలు ఉండవని సమాచారం. మల్కాజిగిరి నుంచి ఓడిపోయిన మైనంపల్లి హన్మంతరావు మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే ఆయనను మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దింపాలనే ఆలోచన ఉన్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది.

అంజన్‌కుమార్‌ యాదవ్‌(ముషీరాబాద్‌), మధుయాస్కీ(ఎల్బీనగర్‌)లు కూడా ఎన్నికల్లో ఓడిపోయినా వారి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. షబ్బీర్‌అలీ, అంజన్‌కుమార్‌లకు మంత్రులుగా అవకాశం ఇచ్చి ఎమ్మెల్సీలుగా ఎంపిక చేస్తారని వారి అనుచరులు చెబుతున్నారు. ఆదిలాబాద్‌ నుంచి గడ్డం వినోద్‌, వివేక్‌ సోదరుల మధ్యే మంత్రి పదవికి పోటీ ఉంది. ఇద్దరూ దిల్లీలో అగ్రనేతలను కలిసినట్లు తెలుస్తోంది. తనకు అవకాశం ఇస్తారని వివేక్‌ ధీమాతో ఉన్నారు. బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు కూడా ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేరు పరిశీలనలో ఉంది. అదే సమయంలో కీలకమైన హోం శాఖ ఎవరికైనా అప్పగిస్తారా లేక సీఎం వద్దనే ఉంచుకుంటారా అనే చర్చ కూడా సాగుతోంది. ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు ఏడాది పాటు ఏ పదవీ ఇవ్వకూడదని పార్టీ యోచిస్తున్నట్టు కూడా మరోపక్క ప్రచారం జరుగుతోంది. దాన్నే అమలు చేస్తే మాత్రం ఓటమి చెందిన వారికి మంత్రిపదవులు దక్కే అవకాశం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z