ScienceAndTech

వాట్సాప్ గ్రూపుల సహాయంతో అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం!

వాట్సాప్ గ్రూపుల సహాయంతో అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం!

వాట్సప్‌ (WhatsApp) సమూహాల సాయంతో తప్పిపోయిన బాలుడి ఆచూకీ లభించిన సంఘటన వికారాబాద్‌ పట్టణంలో ఆదివారం జరిగింది. వికారాబాద్‌ సీఐ శ్రీను తెలిపిన వివరాలు.. వికారాబాద్‌ పురపాలక సంఘం పరిధిలోని కొత్రేపల్లికి చెందిన అబ్దుల్‌నయీం తన ఐదేళ్ల కొడుకును ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని ఆర్టీసీ బస్సు డిపో పక్కన ఉన్న మర్రి చెన్నారెడ్డి విగ్రహం దగ్గరికి పని నిమిత్తం వచ్చాడు. ఇతరులతో మాట్లాడుతుండగా, బాలుడు బైక్‌ దిగి రైల్వే వంతెన మీదుగా కిలోమీటరుకు పైగా నడుచుకుంటూ వికారాబాద్‌ పట్టణంలోకి ప్రవేశించాడు. బాలుడు కనిపించక పోవడంతో నడుచుకుంటూ ఇంటికే వెళ్లి ఉంటాడని తండ్రి భావించి వెళ్లగా అక్కడికీ రాలేదు. దీంతో ఆందోళన చెందిన అతను బైక్‌పై పట్టణమంతా గాలించినా ఆచూకీ లభించలేదు. పట్టణంలోకి వెళ్లిన బాలుడు రోడ్డు పక్కన ఏడుస్తూ నిల్చున్నాడు. గమనించిన పలువురు పోలీసులకు సమాచారం ఇవ్వగా, అతడిని ఠాణాకు తీసుకెళ్లారు. చిరునామాకు యత్నించినా చెప్పలేదు. పోలీసులు పలు వాట్సప్‌ సమూహాల్లో బాలుడి ఫొటోను పోస్టు చేశారు. రెండున్నర గంటల తరువాత సమాచారం తండ్రికి చేరడంతో ఠాణాకు వచ్చి బాలుడిని తీసుకెళ్లాడు. పోలీసులు చేసిన కృషిని స్థానికులు అభినందించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z