Politics

ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా రేవంత్

ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా రేవంత్

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటింది. మొత్తం 64 సీట్లతో తొలిసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లోనూ అవే ఫలితాలు పునరావృతమవుతాయని భావిస్తున్నారు. ఫిబ్రవరి లేదా మార్చిలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ తన వ్యూహానికి పదును పెడుతోంది. కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా వేగంగా ముందుకు సాగుతోంది. ఆ పార్టీ అగ్రనాయకత్వం ఇప్పటికే పలుమార్లు సమావేశమై లోక్‌సభ ఎన్నికలపై కసరత్తు చేసింది. ఇటీవల ఏఐసీసీ లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రాల వారీగా ఎన్నికల కమిటీలను ఏర్పాటు చేసింది. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల కమిటీ చైర్మన్‌గా సీఎం రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు, సీనియర్‌ నేతలకు కమిటీలో చోటు కల్పించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేశారు. అందరూ కలిసికట్టుగా పార్టీని విజయతీరాలకు చేర్చారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణలు ముఖ్యమైన రాష్ట్రాలు. ఈ రెండు రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణలో 17 సీట్లు మాత్రమే ఉన్నాయని.. కనీసం 12 సీట్లు గెలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.

అందులో భాగంగానే సమర్ధుడైన రేవంత్ రెడ్డికి ఎన్నికల కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక, ప్రస్తుత బలాబలాలు, సామాజిక సమీకరణలు తదితర వివరాలతో ఏఐసీసీకి నివేదిక ఇవ్వనున్నారు.. వారి నివేదిక ఆధారంగా అభ్యర్థులను ఏఐసీసీ ఖరారు చేస్తుంది. అయితే కమిటీలోని పలువురు సభ్యులు లోక్‌సభ టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. జానా రెడ్డి, బలరాం నాయక్, వంశీచందర్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ వంటి నేతలు లోక్ సభ టిక్కెట్ రేసులో ఉండగా వారు కూడా కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరు కమిటీ సభ్యులుగా.. చైర్మన్‌గా రేవంత్‌రెడ్డి, సభ్యులుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు డి.శ్రీధర్‌బాబు, సీతక్క, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు జానా రెడ్డి, వి.హనుమంతరావు, మధుయాష్కీ, జగ్గారెడ్డి, గీతారెడ్డి, అజరుద్దీన్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌, సంపత్‌కుమార్‌, రేణుకాచౌదరి, బలరాంనాయక్‌, మహేశ్వర్‌కుమార్‌ గౌడ్‌, పొదెం వీరయ్య, సునీతారావు, షబ్బీర్‌ అలీ, ప్రేంసాగర్‌రావుతో పాటు యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ, సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షులుగా ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా అవకాశం కల్పించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z