సమ్మక్క-సారలమ్మ జాతర నేపథ్యంలో మేడారంలో తాత్కాలికంగా 50 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. జాతర సందర్భంగా 72 వైద్య శిబిరాలను నిర్వహించాలన్నారు. మేడారం జాతరలో వైద్య, ఆరోగ్య శాఖ చేపట్టాల్సిన కార్యక్రమాలపై మంత్రి సోమవారం సచివాలయంలో ఆ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు వైద్య సేవల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 50 పడకల తాత్కాలిక ఆసుపత్రితో పాటు మేడారంలోని ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో 6 పడకలతో స్పెషలిస్ట్ డాక్టర్లతో కూడిన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలన్నారు. జాతర పరిసరాల్లో 30, జాతరకు వెళ్లే మార్గాల్లో మరో 42 వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి శిబిరంలోనూ డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలని, అవసరమైన అన్ని మందులు, అత్యవసర మెడికల్ కిట్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వీటితో పాటు 20 మొబైల్ మెడికల్ యూనిట్లు, 15 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచాలన్నారు. జాతర ప్రారంభానికి రెండు వారాల ముందే వైద్య శిబిరాలు, తాత్కాలిక ఆసుపత్రి అందుబాటులో ఉండాలని దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. భక్తులకు అత్యవసర వైద్యం అందించాలని, ఎవరికైనా అవసరమైతే సాధ్యమైనంత త్వరగా వైద్య శిబిరాలకు లేదా సమీపంలోని ఆసుపత్రులకు చేర్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రాథమిక వైద్యం అనంతరం ఎవరికైనా అవసరమైతే ఉన్నతస్థాయి వైద్యం కోసం ములుగు, ఏటూరునాగారం, పరకాల ఏరియా ఆసుపత్రులు, వరంగల్ ఎంజీఎంకు పంపించి వైద్యం అందించాలని సూచించారు. సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ, వైద్య విద్య డైరెక్టర్ త్రివేణి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ రవీందర్ నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –