Business

నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన రిలయన్స్‌-వాణిజ్య వార్తలు

నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన రిలయన్స్‌-వాణిజ్య వార్తలు

* నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన రిలయన్స్‌

ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance jobs) ఇంజినీరింగ్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. తమ కంపెనీలోని వివిధ విభాగాల్లో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లను నియమించుకునేందుకు గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ ట్రైనీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా పెట్రో కెమికల్ నుంచి న్యూ ఎనర్జీ వరకు రిలయన్స్‌కు చెందిన వివిధ వ్యాపార విభాగాల్లో ఉద్యోగావకాశాలను కల్పించనుంది.క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించే కంపెనీలు కొన్ని విద్యా సంస్థలకే పరిమితమవుతున్నాయని, దీనివల్ల టాప్‌ 50 లేదా టాప్‌- 100 సంస్థల విద్యార్థులకే అవకాశాలు లభిస్తున్నాయని రిలయన్స్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్‌ విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ను చేపట్టినట్లు తెలిపింది. గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ (GET) 2024 పేరిట ప్రారంభించిన ఈ డ్రైవ్‌లో భాగంగా జనవరి 11 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.బీటెక్‌, బీఈ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏఐసీటీఈ ఆమోదం పొందిన విద్యా సంస్థల నుంచి కెమికల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఇన్‌స్ర్టుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్‌లిస్ట్‌ చేసిన విద్యార్థులకు ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. అందులో ఎంపికైన వారిని ఫిబ్రవరి 23 నుంచి మార్చి 11 వరకు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేస్తారు. మార్చి నెలాఖరుకు ఈ ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది.రిలయన్స్‌ అందిస్తున్న ఈ సదావకాశాన్ని ఇంజినీరింగ్‌ విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం ఓ వెబ్‌సైట్‌ను (https://relianceget2024.in/) సైతం రిలయన్స్ అందుబాటులో ఉంచింది. అందులో అర్హత, నియామక ప్రక్రియ, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ వివరాలను అందులో పొందుపరిచింది. అభ్యర్థులు 10, 12, డిప్లొమాలో 60 శాతం మార్కులు లేదా 6 CGPA సాధించి ఉండాలి. ఇంజినీరింగ్‌లో 60 శాతం (ఏడో సెమిస్టర్‌/ గ్రాడ్యుయేషన్‌) మార్కులు సాధించిన వారు అర్హులు.

* అమెజాన్ ఆడిబుల్ డివిజ‌న్‌ ఉద్యోగుల‌పై వేటు

కంపెనీ కార్య‌క‌లాపాల‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించే క్ర‌మంలో అమెజాన్‌ ఆడిబుల్ డివిజ‌న్ ఉద్యోగుల సంఖ్య‌ను ఐదు శాతం కుదించాల‌ని నిర్ణ‌యించింది. ఈ ప్ర‌క్రియ‌లో వంద మంది ఉద్యోగుల‌ను తొల‌గించిన‌ట్టు ఆడిబుల్ సీఈవో బాబ్ క‌రిగ‌న్ ఉద్యోగుల‌కు పంపిన మెమోలో వెల్ల‌డించారు.అమెజాన్ ఇటీవ‌ల ప్రైమ్ వీడియో, ఎంజీఎం స్టూడియోస్‌, ట్విచ్ లైమ్‌స్ట్రీమింగ్ వంటి ఇత‌ర విభాగాల్లో లేఆఫ్స్ ప్ర‌క‌టించ‌ని క్ర‌మంలో తాజా లేఆఫ్స్ వెలుగులోకి వ‌చ్చాయి. మారిన వ్యాపార ప‌రిస్ధితుల్లో ఆడిబుల్ స‌మ‌ర్ధ‌వంత‌మైన సంస్ధ‌గా ఎదిగేందుకు ఈ క‌ఠిన నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని మెమోలో క‌రిగ‌న్ వివ‌రించారు.ఇక తొల‌గించిన‌ ఉద్యోగుల‌కు కంపెనీ మ‌ద్ద‌తుగా నిలుస్తుంద‌ని, వారికి నూత‌న అవ‌కాశాలు వ‌చ్చే దిశ‌గా బాస‌టగా నిలుస్తుంద‌ని క‌రిగ‌న్ పేర్కొన్నారు. అమెజాన్ 2008లో 300 మిలియ‌న్ డాల‌ర్లు వెచ్చించి ఆడిబుల్‌ను టేకోవ‌ర్ చేసింది. ఇక 2022, 2023లో ఈకామ‌ర్స్ దిగ్గజం అమెజాన్ ఏకంగా 27,000 మంది ఉద్యోగుల‌ను తొల‌గించి మాస్ లేఆఫ్స్‌కు తెగ‌బ‌డింది.

* ఒప్పో నుంచి కొత్త ఫోన్లు

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ఒప్పో (Oppo) రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఒప్పో రెనో 11 (Oppo Reno 11), ఒప్పో రెనో 11 ప్రో (Reno 11 Pro) పేరుతో వీటిని తీసుకొచ్చింది. జనవరి 25 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్‌ 14తో వస్తున్న ఈ రెండు ఫోన్ల ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.ఒప్పో రెనో 11 (Oppo Reno 11) స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తోంది. 120Hz స్క్రీన్‌ రిఫ్రెష్‌ రేటు కలిగి ఉంటుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత కలర్‌ ఎస్‌ 14తో పనిచేస్తుంది. 5,000mAh బ్యాటరీ, 67W ఫాస్ట్‌ ఛార్జింగ్ సదుపాయం ఉంది. కెమెరాల విషయానికొస్తే.. ఇందులో 50 ఎంపీ ప్రధాన కెమెరా, 32ఎంపీ టెలీ ఫొటో లెన్స్‌ ఇచ్చారు. సెల్ఫీ కోసం ముందు భాగంలో 32 ఎంపీ కెమెరా అమర్చారు. ఈ ఫోన్‌ రెండు వేరియంట్లలో అందుబాటులో రానుంది. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.29,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.31,999గా పేర్కొంది. వేవ్‌ గ్రీన్‌, రాక్‌ గ్రే రంగుల్లో లభిస్తుంది.ఒప్పో రెనో 11 5జీలో ఉన్న డిస్‌ప్లే, కెమెరానే ఒప్పో రెనో 11 ప్రో (Reno 11 Pro)లోనూ ఉన్నాయి. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్‌ను అమర్చారు. 4,600mAh బ్యాటరీ, 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సదుపాయం ఉంది. కేవలం 10 నిమిషాల్లో 45శాతం ఛార్జి అవుతుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌ 12జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.39,999గా కంపెనీ నిర్ణయించింది. పెరల్ వైట్‌, రాక్‌ గ్రే రంగుల్లో దీన్ని తీసుకొచ్చారు. జనవరి 25 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, ఒప్పో వెబ్‌సైట్లతో పాటు ఇతర రిటైల్‌ స్టోర్లలో కొనుగోలు చేయొచ్చని పేర్కొంది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, వన్‌ కార్డ్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా క్రెడిట్‌ కార్డు, ఈఎంఐ సదుపాయంతో కొనుగోలు చేసిన వారికి రూ.4,000 డిస్కౌంట్‌ అందించనుంది. పాత ఫోన్‌ ఎక్స్‌ఛేంజ్‌ ద్వారా అదనపు డిస్కౌంట్‌ పొందొచ్చని పేర్కొంది.

* ఇన్ఫీ బాటలోనే విప్రో

ఐటీ మేజర్ విప్రో (Wipro) గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) డిసెంబర్ త్రైమాసికం నికర లాభాల్లో వెనక బడింది. 2022-23తో పోలిస్తే ఈ ఏడాది మూడో త్రైమాసికం నికర లాభం 11 శాతం తగ్గింది. గతేడాది డిసెంబర్ త్రైమాసికం నికర లాభం రూ.3052.9 కోట్లు కాగా, ఈ ఏడాది రూ.2,694.2 కోట్లతో సరి పెట్టుకున్నది. సెప్టెంబర్ త్రైమాసికం నికర లాభం రూ.2,646.3 కోట్లతో పోలిస్తే ఎక్కువే.ఆపరేషన్స్ ద్వారా విప్రో కంపెనీ ఆదాయం కూడా తగ్గుముఖం పట్టింది. 2022-23 మూడో త్రైమాసికంలో రూ.23,290 కోట్ల రెవెన్యూ గడిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో రూ.22,205.1 కోట్లకు పరిమితమైంది. సెప్టెంబర్ త్రైమాసికం రెవెన్యూ రూ.22,515.9 కోట్లుగా నిలిచింది. విప్రో ఐటీ బిజినెస్ రెవెన్యూ స్వల్పంగా 1.1 శాతం తగ్గి రూ.22,151 కోట్లతో సరి పెట్టుకున్నది. ఐటీ బిజినెస్ ఈబీఐటీ మార్జిన్ 16 శాతం.. సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది 16.1 శాతం.ఇన్ఫీ బాటలోనే విప్రో పయనిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం రెవెన్యూ గైడెన్స్ 1.5 నుంచి 0.5 శాతానికి కుదించి వేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరం తుది త్రైమాసికంలో ఐటీ సర్వీసెస్ బిజినెస్ ద్వారా 2615 మిలియన్ల డాలర్ల నుంచి 2669 మిలియన్ల డాలర్ల రెవెన్యూ వస్తుందని అంచనా వేసినట్లు విప్రో తెలిపింది. ఇక విప్రోలో అట్రిక్షన్లు పది త్రైమాసికాల కనిష్ట స్థాయి 12.3 శాతానికి పడిపోయాయి.వాటాదారులకు విప్రో ఒక్కో షేర్ మీద రూపాయి ఇంటరిం డివిడెండ్ ప్రకటించింది. వచ్చేనెల 10న వాటాదారులకు ఇంటరిం డివిడెండ్ చెల్లిస్తామని రెగ్యులేటరీ ఫైలింగ్ లో వెల్లడించింది. విప్రో ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో సంస్థ స్టాక్స్ శుక్రవారం నాలుగు శాతానికి పైగా పుంజుకున్నాయి. బీఎస్ఈలో విప్రో షేర్ రూ.466.10 వద్ద ముగిసింది. విప్రో సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్ థెర్రీ డెలాపోర్టే స్పందిస్తూ.. ‘సీజనల్‌గా డిసెంబర్ త్రైమాసికం సాఫ్ట్‌గా ఉంది. డీల్ బుకింగ్స్‌లో శక్తిమంతంగా ఉన్నాం. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారీ డీల్స్ విషయంలో 20 శాతం గ్రోత్ సాధించాం’ అని చెప్పారు.

* స్టాక్‌ మార్కెట్ సూచీలు మరోసారి సరికొత్త రికార్డు

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు (stock market) మరోసారి సరికొత్త రికార్డులను నెలకొల్పుతూ భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో.. సెన్సెక్స్‌ 72,720.96 పాయింట్ల వద్ద, నిఫ్టీ 21,928.25 పాయింట్ల వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠాలను అందుకున్నాయి. ఆఖర్లో స్వల్పంగా క్షీణించాయి.ఉదయం 72,148.07 పాయింట్ల వద్ద లాభాల్లో సెన్సెక్స్‌ ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 71,982.29- 72,720.96 మధ్య సూచీ కదలాడింది. చివరికి 847.27 పాయింట్ల లాభంతో 72,568.45 వద్ద ముగిసింది. నిఫ్టీ 247.35 పాయింట్ల లాభంతో 21,894.55 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో ఇన్ఫోసిస్‌, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, విప్రో, టీసీఎస్‌ షేర్లు లాభడ్డాయి. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 9 పైసలు బలపడి 82.92 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 79.53 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. ఔన్సు బంగారం ధర 2043 డాలర్లు పలుకుతోంది.