DailyDose

మూడింటిని లీజుకిచ్చిన ఎల్‌అండ్‌టీ సంస్థ!

మూడింటిని లీజుకిచ్చిన ఎల్‌అండ్‌టీ సంస్థ!

మెట్రో రైలు ‘రవాణా ఆధారిత అభివృద్ధి’(టీవోడీ)లో భాగంగా ఎల్‌అండ్‌టీ సంస్థ ‘హైదరాబాద్‌ నెక్స్ట్‌ గల్లేరియా’ పేరుతో పంజాగుట్ట, ఎర్రమంజిల్‌, హైటెక్‌ సిటీలోని ప్రభుత్వ భూముల్లో నిర్మించిన మూడు మాల్స్‌ చేతులు మారాయి. లిస్టెడ్‌ రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్టు ‘నెక్సస్‌ సెలెక్ట్‌’కు లీజుకిచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు ఇటీవల ముంబయిలో రూ.3 వేల కోట్లతో ఒప్పందం జరిగిందని సమాచారం. ఈ మూడు మాల్స్‌ 12 లక్షల చదరపు అడుగుల్లో విస్తరించి ఉన్నాయి. గత ఆగస్టులోనూ రాయదుర్గంలోని 15 ఎకరాల భూమిని, అక్కడే నిర్మించిన కార్యాలయ భవనాన్ని కలిపి రాఫర్టీ సంస్థకు సబ్‌ లైసెన్సు ఇచ్చింది. ఒప్పందం విలువ రూ.వెయ్యి కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ రెండు లావాదేవీల ద్వారా ఎల్‌అండ్‌టీ మెట్రోకు మొత్తం రూ.4 వేల కోట్ల వరకు సమకూరనున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి మెట్రో రూ.4 వేల కోట్లకు పైగా నష్టాల్లో ఉంది. ఈ సబ్‌ లైసెన్సుల ద్వారా వాటి నుంచి గట్టెక్కాలనే ప్రణాళిక ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నెక్సస్‌ సెలెక్ట్‌తో ఒప్పందంపై ఎల్‌అండ్‌టీ నుంచి తమకెలాంటి ప్రతిపాదనలు రాలేదని హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.

సర్కారు అనుమతిచ్చిందా..?

హైదరాబాద్‌ మెట్రోరైలు మొదటి దశ పనులను ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో సంస్థ సొంత నిధులతో చేపట్టింది. ఇందుకు గాను నిర్మాణ సమయం కలిపి మొత్తం 35 ఏళ్లకు ఒప్పందం చేసుకుంది. ఈ కాలంలో ప్రయాణికుల ఛార్జీల ద్వారా 50% ఆదాయం రాబట్టుకోవాలి. మరో 5% వాణిజ్య ప్రకటనలు, మిగిలిన 45% మెట్రో కారిడార్‌ వెంట ప్రభుత్వం కేటాయించిన భూముల్లో మాల్స్‌, కార్యాలయాల నిర్మాణాలు చేపట్టి అద్దెలు, లీజుల ద్వారా సమకూర్చుకోవాలి. వీటికి మాత్రం 60 ఏళ్ల గడువిచ్చారు. అనంతరం ప్రాజెక్టును సర్కారుకు అప్పగించాలి. ఇప్పటికే పదేళ్ల లీజు ముగిసింది. అయితే ఈ భూములను, అందులో నిర్మాణాలను లీజుకు ఇచ్చేందుకు, అమ్మేందుకు హక్కు లేదు. కొవిడ్‌ సమయంలో తీవ్రంగా నష్టపోయామని అప్పటి సర్కారుకు విన్నవించడంతో సబ్‌ లైసెన్సులకు ఆగస్టులో అనుమతిచ్చినట్లు ఎల్‌అండ్‌టీ మెట్రో చెప్పింది. సర్కారు నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఎల్‌అండ్‌టీ మెట్రోకు మూడు మార్గాల్లో మరిన్నిచోట్ల ప్రభుత్వ భూములున్నాయి. మలక్‌పేటలో మాల్‌ను నిర్మించింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z