Movies

అసలు ‘ఈగ’ ఆలోచన ఎలా పుట్టింది?

అసలు ‘ఈగ’ ఆలోచన ఎలా పుట్టింది?

భారతీయ చిత్ర పరిశ్రమలో చెరగని ముద్రవేసిన అతికొద్ది మంది దర్శకుల్లో దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఒకరు. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాలతో యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ‘మర్యాద రామన్న’ తర్వాత రాజమౌళి ప్రభాస్‌తో సినిమా చేయాలనుకున్నారు. కానీ, మధ్యలో ‘ఈగ’ వచ్చి చేరడంతో ఆ సినిమా కాస్త ఆలస్యమైంది. అసలు ‘ఈగ’ ఆలోచన ఎలా పుట్టింది? ఎలా తెరపైకి తీసుకొచ్చారని జక్కన్న అడిగితే ఒక సందర్భంలో ఇలా చెప్పుకొచ్చారు.

‘‘నాన్నగారి దగ్గర సహాయకుడిగా పనిచేస్తుండగా, ‘ఈగ’ కథ గురించి చెప్పారు. అప్పుడు చాలా నవ్వుకున్నాం. అయితే, ఇది ఒక సినిమాగా చేయాలని అస్సలు అనుకోలేదు. ‘సింహాద్రి’, ‘ఛత్రపతి’ చేస్తున్నప్పుడు అన్నీ పెద్ద సినిమాలే అవుతున్నాయని ఓ చిన్న సినిమా చేస్తే మంచిదనిపించింది. సాధారణంగా చిన్న సినిమాలంటే లవ్‌స్టోరీలు, కామెడీ, హారర్‌ సినిమాలే కనిపిస్తాయి. అవి తక్కువ బడ్జెట్‌లో పూర్తవుతాయి. హారర్‌ సినిమాలంటే నాకు ఇష్టం ఉండదు. (eega movie) లవ్‌స్టోరీలు, కామెడీ మీద నాకు పెద్దగా గ్రిప్‌ లేదు. మిగిలింది ప్రయోగాత్మక చిత్రం. అప్పుడు ‘ఈగ’ గుర్తొచ్చి దాన్ని డెవలప్‌ చేయడం మొదలు పెట్టాం. ‘బలహీనుడు.. బలవంతుడిపై నెగ్గడం’ ఈ కాన్సెప్ట్‌ చాలా సందర్భాల్లో హిట్‌ అవుతుంది. ఈగవంటి చిన్న ప్రాణి మనిషిపై ప్రతీకారం తీర్చుకుంటుందనే కాన్సెప్ట్‌తో నాటకీయత పెరుగుతుంది. అందుకే మొదలుపెట్టాం. రెండున్నర కోట్ల బడ్జెట్‌తో సినిమా చేయాలని అనుకున్నాం. కేవలం కొన్ని థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో విడుదల ప్రణాళిక వేసుకున్నాం. ఏ సీన్‌కు ఎంత బడ్జెట్‌ అవుతుంది? ఎలా తీయాలి? అని అంచనా వేసుకుంటూ వెళ్తుంటే, కథ ముందుకు సాగడం లేదు. అప్పుడే నిర్మాత సురేష్‌బాబు వచ్చి, ‘బడ్జెట్‌ గురించి ఆలోచించవద్దు. ముందు కథ సిద్ధం చేయండి’ అనడంతో పూర్తి కథను సిద్ధం చేశాం. చూసుకుంటే పెద్ద సినిమా అయింది. ‘ఈగ’ మొదలు పెట్టిన తర్వాతే అసలు విజువల్‌ ఎఫెక్ట్స్‌ అంటే ఏంటో తెలిసింది’’

‘‘సాధారణంగా కార్టూన్‌ యానిమేషన్‌లో ఆ పాత్రలకు పరిధులు ఉండవు. కానీ, రియలిస్ట్‌ యానిమేషన్‌లో అన్ని ఫిక్స్‌డ్‌ ఉంటాయి. చూసేవాళ్లకు నిజమైన ‘ఈగ’లా కనిపించాలి. ఈ సినిమా మొదలు పెట్టే సమయానికి నాకు యానిమేషన్‌ గురించి పెద్దగా తెలియదు. ఆ పనులన్నీ ‘మకుట’ వాళ్లకు అప్పగించాం. ‘ఈగ’ను క్రియేట్‌ చేయటం.. దానితో యానిమేషన్‌ చేయించడం.. మనకు కావాల్సిన భావాలు పలికించడం.. మనుషులతో సైగలు చేయడం.. ఇవన్నీ ‘మకుట’ చేసింది. అసలు ఈగ ఎలా ఉండాలి? (eega movie) దాని డిజైన్‌ ఎలా ఉండాలి? ఇవన్నీ ప్రి-ప్రొడక్షన్‌ పనులు. దాన్ని మేమే తయారు చేసి ‘మకుట’ వాళ్లకు ఇవ్వాలి. ఆ విషయం కూడా నాకు తెలియదు. ఆ పని కూడా వాళ్లదేననుకున్నా. ‘మకుట’తో మాకున్న అనుబంధం కారణంగా దాన్ని డిజైన్‌ చేసే పని కూడా వాళ్లే మొదలు పెట్టారు. దాదాపు ఏడెనిమిది నెలలు తర్వాత ఈగను తయారు చేసి ఒక వీడియో చూపించారు. దాన్ని చూసి నా గుండె జారిపోయింది. ఈగ పరమ అసహ్యంగా ఉంది. అదసలు ఈగలా లేదు. దాని కదలికలు అన్నీ రోబోటిక్‌గా ఉన్నాయి. అందంగా లేదు. ఏ కోణం నుంచి చూసినా అది నచ్చలేదు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అప్పటికే దాదాపు రూ.10కోట్లు ఖర్చు పెట్టేశారు. రూ.50లక్షలో.. రూ.కోటి అయితే, సినిమా ఆపేసేవాడిని’’

‘‘రెండు రోజుల తర్వాత ‘మకుట’ వాళ్లను కూర్చోబెట్టి వివరంగా చెబితే, వాళ్లు ‘బాబూ అది మా పని కాదు. మీరు డిజైన్‌ ఇస్తే, మేము దాన్ని సీజేలో క్రియేట్‌ చేస్తాం’ అన్నారు. నాకు ఒక్కసారిగా కళ్లు తిరిగిపోయాయి. ‘మళ్లీ మొదటి నుంచి పని ప్రారంభిద్దాం’ అని చెప్పా. అసలు నిజంగా ఈగ ఎలా ఉంటుంది? అన్న దాని కోసం ఈగల్ని పట్టుకుని ఫొటో షూట్‌ చేశాం. ఈగను ఫొటో తీయడానికి ప్రత్యేక లెన్స్‌లు తెప్పించాం. కానీ, లైట్స్‌ వేసి ఫొటో తీయాలంటే ఈగ ఎగిరిపోతుంది. అందుకే ఈగలను పట్టుకుని కొద్దిసేపు ఫ్రిజ్‌లో పెట్టేవాళ్లం. దీంతో అవి కాస్త అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయేవి. వాటిని తీసుకొచ్చి లైట్లు వేసి, కెమెరాతో ఫొటోలు తీసేలోపు ఆ వేడికి తేరుకుని ఎగిరిపోయేవి. (eega movie) మాకు ఇదొక పెద్ద పనిలా అనిపించింది. దీంతో కెమెరా, లైట్లు అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఫ్రిజ్‌లో నుంచి ఈగను బయటకు తీసుకొచ్చి టపటపా అంటూ పది ఫొటోలు తీయగానే అది ఎగిరిపోయేది. ఈగ ఫొటోలను ఎన్‌లార్జ్‌ చేస్తే, చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. అదొక మృగంలా అనిపిస్తుంది. అలా కాస్త వికృతంగా ఉన్న ఎలిమెంట్స్‌ తీసి, బాగున్నవి ఉంచాం. ఇక సీజీ కోసం కాన్సెప్ట్‌ ఆర్టిస్ట్‌తో స్కెచ్‌లు వేయించాం. అది చూసిన తర్వాత మనసు కాస్త కుదటపడింది. అప్పుడు ‘ఈగ’ను ముందుకు తీసుకెళ్లాం’’ అని చెప్పుకొచ్చారు. నాని, సమంత, సుదీప్‌ కీలక పాత్రల్లో నటించిన ‘ఈగ’బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ప్రతినాయకుడిగా సుదీప్‌ నటన అందరినీ కట్టిపడేసింది. ప్రస్తుతం రాజమౌళి తన తర్వాతి ప్రాజెక్ట్‌ కోసం సిద్ధవుతున్నారు. మహేశ్‌బాబు కథానాయకుడిగా ఈ చిత్రం తెరకెక్కనుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z