Politics

విశ్రాంత IASలపై రేవంత్ గురి

విశ్రాంత IASలపై రేవంత్ గురి

పదవీ విరమణ చేసి ప్రభుత్వంలో పలు హోదాల్లో కొనసాగుతున్న వారిపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది. రిటైరైన తర్వాత తిరిగి నియమితులయిన, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పని చేస్తున్న వారి వివరాలను అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఈ వివరాలన్నింటినీ బుధవారం సాయంత్రంలోగానే ఇవ్వాలని స్పష్టం చేశారు. నీటిపారుదల, రోడ్లు-భవనాలు, జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలు సహా పలు శాఖల్లో కీలక స్థానాల్లో.. రిటైరైన అధికారులు కొనసాగుతున్నారు. కొందరు సుదీర్ఘకాలం ఆయా శాఖల్లో అధిపతులుగా కూడా ఉన్నారు. ఎన్నికలకు ముందు పలువురి పేర్లను కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చి నెలదాటినా వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఒక రోజు గడువులోనే సీఎస్‌ వివరాలను కోరడం ప్రాధాన్యం సంతరించుకొంది.

నీటిపారుదల శాఖలో కీలక ప్రాజెక్టులన్నీ వారి చేతుల్లోనే
నీటిపారుదల శాఖలో కీలక ప్రాజెక్టులన్నీ పదవీ విరమణ చేసిన వారి చేతుల్లోనే ఉన్నాయి. ఇలా 13 మంది ఉన్నారు. వీరిలో నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (జనరల్‌) మురళీధర్‌, కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (రామగుండం) వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (గజ్వేల్‌) పరిధిలో ఎస్‌ఈ వేణు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల చీఫ్‌ ఇంజినీర్‌ హమీద్‌ఖాన్‌, దేవాదుల ఇన్‌ఛార్జి చీఫ్‌ ఇంజినీర్‌ సుధాకర్‌రెడ్డి, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, కన్సల్టెంట్‌ విజయ్‌ ప్రకాశ్‌, క్వాలిటీ కంట్రోల్‌ ఎస్‌ఈ రామశ్రీనివాసరావు, ఈఈ గోపాల్‌రెడ్డితోపాటు మరికొందరున్నారు.

రోడ్లు-భవనాల శాఖలో ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు రవీంద్రరావు, గణపతిరెడ్డితో సహా పదిమంది వరకు ఇంజినీర్లు ఉన్నట్లు సమాచారం. విద్యుత్తు శాఖలో పదవీ విరమణ చేసిన వారు అధిక సంఖ్యలో డైరెక్టర్లుగా కీలక స్థానాల్లో ఉన్నారు. సుమారు 12 మంది ఉన్నట్లు సమాచారం. జెన్‌కోలో ఇద్దరు, ట్రాన్స్‌కోలో నలుగురు, డిస్కంలలో ఆరుగురు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రెడ్‌కో ఎండీ కూడా విశ్రాంత అధికారే.

తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ ఎండీ నేతి మురళీధర్‌తో పాటు ఉమ్మడి జిల్లా స్థాయుల్లో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధికారులు కూడా అనేకమంది ఉన్నారు. అయితే అపెక్స్‌ బ్యాంకు ఎండీ పదవికి దరఖాస్తులు ఆహ్వానించడంతో రిటైరైన మురళీధర్‌ ఎంపికై కొనసాగుతున్నారు. కొన్ని శాఖల్లో అధికారులు దశాబ్దకాలం నుంచి కూడా రిటైరయ్యాక సర్వీసు పొడిగింపులో ఉన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, బోర్డులు ఇలా అన్నింటిలో పదవీ విరమణ చేసి ఇంకా వివిధ విధుల్లో కొనసాగుతున్న అందరి వివరాలను అత్యధిక ప్రాధాన్యమిచ్చి పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులందరినీ ఆదేశించారు. వారి విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. విభాగం, అధికారి, ఎప్పుడు పదవీ విరమణ చేశారు, తిరిగి ఎప్పుడు చేరారు, ప్రస్తుత హోదా, పని చేస్తున్న స్థానంలో గడువు ఎప్పటిలోగా ముగుస్తుందన్న వివరాలను పంపాలని స్పష్టం చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z