DailyDose

హామీలు అమలు చేసే దాకా విడిచిపెట్టం-తాజా వార్తలు

హామీలు అమలు చేసే దాకా విడిచిపెట్టం-తాజా వార్తలు

* తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో బాలాజీ సన్నిధి కిటికిటలాడుతుంది. సర్వదర్శనానికి వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి.భక్తులు కృష్ణతేజ అతిథిగృహం వరకు క్యూలో నిలబడియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) లభిస్తుందని టీటీడీ (Ttd) అధికారులు వివరించారు. నిన్న 62,649 మంది భక్తులు దర్శంచుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ.3.74 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.

* కోనసీమ జిల్లాలో వైకాపాకు షాక్‌

కోనసీమ జిల్లాలో వైకాపాకు గట్టి షాక్‌ తగిలింది. అమలాపురానికి చెందిన వైకాపా యువజన నాయుడు, శెట్టిబలిజ యాక్షన్‌ ఫోర్స్‌ వ్యవస్థాపకుడు వాసంశెట్టి సుభాష్ తెదేపాలో చేరనున్నారు. చంద్రబాబు సమక్షంలో శనివారం 5వేల మందితో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు.వైకాపాకు రాజీనామా చేసినట్టు ఇప్పటికే సుభాష్‌ ప్రకటించారు. మంత్రి విశ్వరూప్, మరికొంత మంది సొంత పార్టీ నేతలే ఇబ్బంది పెట్టారని.. అలాంటి వారికి టికెట్ ఇవ్వొద్దని అగ్రనాయకత్వానికి చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు తెలిపారు. జిల్లా పేరు మార్పు విషయంలో జరిగిన అల్లర్ల కేసులో తమ సామాజిక వర్గాన్ని ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందన్నారు. అమాయకులపై కేసులు ఎత్తివేయాలని కోరగా వైకాపా జిల్లా అధ్యక్షుడు, స్థానిక నేతలు అడ్డుపడ్డారని ఆరోపించారు.

* హామీలు అమలు చేసే దాకా విడిచిపెట్టం

ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ నోటికి ఎంత వస్తే అంత అనుకుంటూ హామీలు ఇచ్చిందని, ఇచ్చిన మాట ప్రకారం 420 హామీలను అమ‌లు చేసేదాకా విడిచి పెట్టమని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన మెద‌క్ పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ స్థాయి స‌మావేశంలో పాల్గొన్న ఆయన.. గవర్నర్ ప్రసంగంలో పథకాల అమలులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం అయ్యిందని అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు. అందులోని నిజానిజాలు బయటపెట్టేందుకే స్వేద పత్రం విడుదల చేశామని, అందులో తెలంగాణ సమగ్ర అభివృద్ధిని పొందుపరిచినట్లు తెలిపారు.అధికారంలోకి వచ్చాక 2 లక్షలు రుణమాఫీ చేస్తానని పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ మాట్లాడారని గుర్తుచేశారు. కానీ తుమ్మల నాగేశ్వర్‌ రావు మాత్రం రుణాలు వసూలు చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారని, పైగా రుణాలు కట్టని వారిపై కేసులు పెట్టండని ఆదేశించినట్లు పత్రికల్లో వచ్చిందన్నారు. ప్రియాంక గాంధీ నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పగా.. భట్టి విక్రమార్క భృతి ఇస్తామని చెప్పలేదని హరీష్ రావు అడిగిన ప్రశ్నకు అసెంబ్లీ సాక్షిగా అబద్దం చెప్పారని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తామని హామీ ఇచ్చారని, కానీ అది సాధ్యం కాదని స్పష్టమైందని కేటీఆర్ పేర్కొన్నారు.మొన్నటిరవకు ప్రధాని, అదానీ ఒక్కటని విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి.. దావోస్ లో ఆయనతోనే ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ ఓ పక్క అదానీని తిడుతుంటే.. అదే సమయంలో రేవంత్ రెడ్డి దావోస్‌లో ఆయనతో ఉన్నాడని తెలిపారు. కేసీఆర్ ఉన్నంత కాలం అదానీ తెలంగాణ అడుగు పెట్టలేదని, కానీ కాంగ్రెస్ రాగానే ఎలా అడుగు పెడుతున్నాడ‌ని కేటీఆర్ ప్రశ్నించారు. ఈసారి కూడా మెదక్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయం అన్న కేటీఆర్, గత పదేళ్ళలో మన బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే పార్లమెంట్ లో తెలంగాణ గురించి మాట్లాడారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రయోజనాలు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాపాడుతుందన్నారు. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించి చెప్పాలని కేటీఆర్ సూచించారు.

* ఫ్రెండ్‌ పెళ్లిలో శ్రద్ధా కపూర్‌ సందడి

బాలీవుడ్‌ స్టార్‌ నటి శ్రద్ధా కపూర్‌ (Shraddha Kapoor) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. శక్తికపూర్‌ వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుస ప్రేమ కథా చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. ఇక శ్రద్ధా నటించిన ఆషికి-2 మూవీతో ఈ బ్యూటీ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది. ఈ సినిమాలోని పాటలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అయ్యారు. ఇక పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటించిన సాహో చిత్రంతో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకూ పరిచయం అయ్యింది.తాజాగా ఈ సాహో భామ తన ఫ్రెండ్‌ పెళ్లి (Friend Wedding)లో సందడి చేసింది. శ్రద్ధా ఫ్రెండ్‌ నికితా మేనన్‌ వివాహం గోవాలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా వివాహానికి హాజరైన శ్రద్ధా అక్కడ సందడి చేసింది. పింక్‌ కలర్‌ దుస్తులు ధరించి.. తోటి ఫ్రెండ్స్‌తో కలిసి డ్యాన్స్‌ (Dance)తో దుమ్మురేపింది. డప్పు వాయిద్యాల ముందు హుషారైన స్టెప్పులేసి ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

* కృష్ణా బేసిన్‌లో నీరు లేనప్పుడు రెండో పంటకు ఇవ్వడం ఎలా సాధ్యం?

తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగానే పారిశ్రామికవేత్త అదానీని సీఎం రేవంత్‌ రెడ్డి కలిశారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. ‘‘భారాస ప్రభుత్వం ఎన్నో చీకటి జీవోలు ఇచ్చింది. రాష్ట్రం బంగారుపళ్లెం కాదు.. అప్పుల కుప్పగా మార్చారు. రూ.7 లక్షల కోట్ల అప్పు చేశారు. రూ.40 వేల కోట్లు వడ్డీలకే పోతోంది. భాజపా తెచ్చిన ప్రతి బిల్లుకు పార్లమెంటులో భారాస మద్దతు ఇచ్చింది. ఇరుపార్టీల స్నేహాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. అందువల్లే రూ.వేల కోట్లు కుమ్మరించినా.. శాసనసభ ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలవలేదు.2018 ఎన్నికలప్పుడు భారాస చాలా హామీలు ఇచ్చి అమలు చేయలేదు. గతంలో విపక్షాలు తెరాసను రెండేళ్ల తర్వాత విమర్శిస్తే.. పసికందును విమర్శిస్తున్నారా?అని వాపోయారు. మరి భారాస నేతలు 2 నెలలు కూడా ఎందుకు ఆగలేకపోతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేసింది. మిగతా గ్యారంటీల అమలు కోసమే ‘ప్రజాపాలన’ నిర్వహించాం. దరఖాస్తుల పరిశీలన పూర్తి కాగానే మిగతావి అమలు చేస్తాం. లోక్‌సభ ఎన్నికల్లో భారాస తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు భయపడుతున్నారు. భారాసను వీడటానికి ఇప్పటికే చాలా మంది సిద్ధంగా ఉన్నారు. స్థానిక సంస్థల్లో ఆ పార్టీ ప్రతినిధులే అవిశ్వాసాలు పెడుతున్నారు. గత రెండేళ్లలో కృష్ణా బేసిన్‌లో నిండుగా నీరు ఉన్నప్పటికీ సాగుకు ఇవ్వలేదు. ఈ ఏడాది వర్షాలు లేక నాగార్జునసాగర్‌లో జలాలు అడుగంటిపోయాయి. కృష్ణా బేసిన్‌లో నీరు లేనప్పుడు రెండో పంటకు ఇవ్వడం ఎలా సాధ్యం?’’ అని జూపల్లి అన్నారు.

* 21న రాజకీయ ప్రయాణంపై నిర్ణయం ప్రకటిస్తా

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలు కూడా శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా, కీలక నేతలు తమ పట్టును నిలబెట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులోభాగంగా, ఇతర పార్టీల్లో చేరేందుకు అమితాసక్తి చూపుతున్నారు. తాజాగా ఏపీ రాజకీయాల్లో ఉన్న సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరైన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఇటీవల కొణతాల పవన్‌కళ్యాణ్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై కొణతాల రామకృష్ణ కాస్త స్పష్టతను ఇచ్చారు.ఈనెల 21న రాజకీయ ప్రయాణంపై నిర్ణయం ప్రకటిస్తానని మాజీమంత్రి కొణతాల రామకృష్ణ స్పష్టం చేశారు. నాయకులు, శ్రేయోభిలాషుల నుంచి చాలా కాలంగా ఒత్తిడి ఉందని.. వారి సూచనల మేరకు హైదరాబాద్ వెళ్లి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను కలిశానని ఆయన వెల్లడించారు. పవన్‌తో జరిగిన భేటీలో ఆంధ్ర అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు సహా అనేక విషయాలు చర్చకు వచ్చాయని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.ఏ పార్టీలో జాయిన్ అవుతానో డిసైడ్ చేసుకున్న తరువాత ఎమ్మెల్యే, ఎంపీ పోటీపై మాట్లాడతాననని కొణతాల రామకృష్ణ తెలిపారు. ఇదిలా ఉంటే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగాలన్న తలంపులో కొణతాల రామకృష్ణ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

* జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం

దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ‘అప్రజాస్వామిక’ ఆలోచనను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక ‘ అనేది సమాఖ్య హామీలకు, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని అభిప్రాయపడింది. జమిలి ఎన్నికలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రామ్‌నాథ్ కొవింద్ కమిటీకి లేఖ రాసిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె, దేశంలో పటిష్టమైన ప్రజాస్వామ్యాన్ని కొనసాగించేందుకు ఈ ఆలోచన సరికాదన్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీని రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు కమిటీ ఛైర్మన్‌గా ఉన్న రామ్‌నాథ్ కొవింద్‌ను ప్రస్తావిస్తూ, ‘ పార్టీ, దేశ ప్రజల తరపున అభ్యర్థిస్తూ.. తమ వ్యక్తిత్వాన్ని, భారత మాజీ రాష్ట్రపతి కార్యాలయాన్ని దుర్వినియోగం చేసేందుకు అనుమతించవద్దు. ఈ దేశంలో రాజ్యాంగాన్ని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం తుంగలో తొక్కింది’ అంటూ ఖర్గె పేర్కొన్నారు. ఒకేసారి ఎన్నికల వంటి అప్రజాస్వామిక ఆలోచనలతో ప్రజల దృష్టిని మళ్లించకుండా, వారి ఆదేశాలను గౌరవించే ప్రభుత్వం, పార్లమెంట్, ఎన్నికల సంఘం పనిచేయాలన్నారు.కాంగ్రెస్‌తో పాటు బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సైతం జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక ‘పై గతేడాది సెప్టెంబర్‌లో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్ నేతృత్వంలో కేంద్రం అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇటీవల పలు జాతీయ, ముప్పైకి పైగా ప్రాంతీయ పార్టీల నుంచి అభిప్రాయాలను కోరింది. అలాగే, న్యాయ కమిషన్ నుంచి సైతం సలహాలు తీసుకుంటోంది. ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంది.

* ఉచిత బస్సు సౌకర్యం వద్దంటూ కొందరు పిల్‌ వేయడం సరికాదు

శ్రీరాముడు(Sriramudu) అందరివాడని, కొందరి వాడు అన్నట్లుగా బీజేపీ(BJP) ప్రచారం చేయడం సరికాదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌(Ponnam Prabhakar) అన్నారు. రాముడి గుడి(Rama temple) పేరుతో బీజేపీ రాజకీయం చేయడం ఆపాలని మంత్రి సూచించారు. పవిత్ర కార్యాన్ని రాజకీయాలకు వాడుకోవడం మంచిపద్ధతి కాదన్నారు. ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే ప్రాణ ప్రతిష్ఠ చేయడమేంటని ప్రశ్నించారు. రామాలయం ప్రాణప్రతిష్ఠ ప్రధాని మోదీ చేయడాన్ని పీఠాధిపతులే వ్యతిరేకించారని గుర్తు చేశారు. రాములవారి అక్షతల పేరుతో బియ్యం సంచులు ఇస్తున్నారని ఆక్షేపించారు. మళ్లీ గెలుస్తామో..తిరుగుబాటు వస్తుందో కాలమే నిర్ణయిస్తుందన్నారు. మహిళకు ఉచిత బస్సు సౌకర్యం వద్దంటూ కొందరు పిల్‌ వేయడం సరికాదన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z