Health

గుల్ల చేసే నకిలీ మందులను ఇలా గుర్తించవచ్చు

గుల్ల చేసే నకిలీ మందులను ఇలా గుర్తించవచ్చు

ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వేసుకునే ఔషధాలు నకిలీవి అయితే.. వ్యాధి తగ్గకపోగా కొత్త ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. ఇటీవల డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (డీసీఏ) అధికారులు వరుసగా నకిలీ ఔషధాల తయారీ కంపెనీలపై దాడులు చేస్తూ, వాటిని సీజ్‌ చేస్తున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్న నకిలీ మందులను అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మందులు కొనే సమయంలో కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని, ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకోవాలని డీసీఏ హెచ్చరిస్తున్నది.

ఇటీవల వరుసగా నకిలీ ఔషధాల తయారీ సంస్థలు, రవాణా రాకెట్‌ పట్టుబడుతున్న నేపథ్యంలో నకిలీ ఔషధాలను ఎలా గుర్తించాలి? ఔషధాలు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న విషయాలను వివరిస్తూ తాజాగా సూచనలు జారీ చేసింది. అనుమతి లేని దుకాణాలు, అనుమతి లేని వెబ్‌సైట్ల నుంచి ఔషధాలు కొనుగోలు చేయొద్దని స్పష్టం చేసింది. ప్రతి మెడికల్‌ షాప్‌లో లైసెన్స్‌ను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని, ఈ మేరకు లైసెన్స్‌ను బహిర్గతం చేస్తున్నారో లేదో పరిశీలించాలని సూచిస్తున్నది.

పోల్చడం: అసలైన ఔషధాన్ని, నకిలీ ఔషధాన్ని పక్కపక్కన పెట్టి పోల్చినప్పుడు కొన్ని తేడాలు గమనించవచ్చు. ముఖ్యంగా కంపెనీలు ప్యాకింగ్‌ మార్చినా.. నకిలీ ఔషధాలు పాత ప్యాకింగ్‌లోనే వస్తుంటాయి. పరిమాణం, రంగు, బరువు, క్వాలిటీ, డిజైన్‌లో తేడాలు కనిపిస్తుంటాయి.

స్పెలింగ్‌ తప్పులు: కంపెనీ పేరు లేదా ఉత్పత్తి పేరు లేదా అందులో ఉన్న రసాయనాల స్పెల్లింగ్‌ తేడాలు ఉంటాయి. తయారీ తేదీ, గడువు తేదీ, వంటివి ఔషధంతోపాటు బయటి కాటన్‌పై ఉండే వివరాలతో సరిపోల్చుకోవాలి.

చూడటానికి ఒకేలా ఉండాలి: ట్యాబ్లెట్లు షీట్‌లో ఉన్నా, బాటిల్‌లో ఉన్నా అన్నీ చూడటానికి ఒకే రకంగా ఉండాలి. పరిమాణంలో తేడాలు ఉండటం, పర్రెలు రావడం, విరిగిపోవడం వంటివి గుర్తిస్తే నకిలీవిగా అనుమానించాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, తరుచూ ఔషధాలు వాడేవారు ఎలాంటి తేడాలు ఉన్నా వెంటనే గుర్తిస్తారు. ఇలాంటి సందర్భాల్లో కంపెనీ వివరాలను కచ్చితంగా చెక్‌ చేయాలి.

అతి తక్కువ ధర: మనం గతంలో తీసుకున్న ధరతో పోల్చినప్పుడు తక్కువగా ఉండటం, తెలిసినవారు తెచ్చుకున్న ధరలతో పోల్చినా తక్కువకు దొరికితే జాగ్రత్త పడాల్సిందే. కొన్నిసార్లు దుకాణాదారు చాలా ఎక్కువ డిస్కౌంట్‌ ఇచ్చినా అనుమానించాలి.

అధికారిక ముద్ర: 300 రకాల అత్యవసర మందులకు కచ్చితంగా బార్‌ కోడ్‌, క్యూఆర్‌ కోడ్‌ ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. మందులపై లేదా వాటిని ప్యాక్‌ చేసిన డబ్బాలపై కోడ్‌ లేకపోతే అనుమానించాలి.

ప్యాకేజింగ్‌: బ్రాండెడ్‌ కంపెనీలు ప్యాకేజింగ్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాయి. కాబట్టి మందులు తీసుకునే సమయంలో ప్యాకేజింగ్‌ సరిగా ఉన్నదా? సీల్‌ సరిగా ఉన్నదా? అన్నది చూడాలి. లీకేజీలు ఉన్నా, తేడాగా ఉన్నా అనుమానించాలి.

సైడ్‌ ఎఫెక్ట్స్‌ : మందు వేసుకున్న తర్వాత అలర్జీలు, ఇతర సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమైనా వస్తే వెంటనే అప్రమత్తం కావాలి.

బిల్లు తప్పనిసరి: మందులు కొన్న తర్వాత మెడికల్‌ షాప్‌ నుంచి కచ్చితంగా బిల్లు తీసుకోవాలి. అందులో ఏయే ఔషధాలు తీసుకున్నారో వివరంగా ఉండాలి. ఎవరైనా బిల్లు ఇవ్వడానికి నిరాకరిస్తే అనుమానించాల్సిందే. ఫిర్యాదు ఎలా చేయాలి? నకిలీ మందులు గుర్తిస్తే డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800599696 కు సమాచారం ఇవ్వవచ్చు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారు. స్థానిక డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేయవచ్చు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z