Kids

చిన్నారుల్లో కోపాన్ని ఇలా నియంత్రించండి

చిన్నారుల్లో కోపాన్ని ఇలా నియంత్రించండి

చిన్న పిల్లల్లో కోపం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా చిన్న విషయానికే చిరాకు పడుతారు. వస్తువులు తీసి విసిరేస్తారు. వేరే పిల్లలతో ఆడుతున్నప్పుడు కాడా కొన్నిసార్లు వారిపై దాడి చేస్తూ ఉంటారు. పిల్లల్లో కోపం అనేది సహజమే. కానీ ఇది ఎక్కువైతే మాత్రం చాలా సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు కచ్చితంగా పిల్లల కోపాన్ని నియంత్రించాలి. నిజానికి పిల్లలు కోపంగా ఉన్నప్పుడు ఏమి చేస్తారో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల కోపాన్ని అదుపు చేసే టిప్స్ తల్లిదండ్రులకు తెలియాలి. లేకుంటే పెద్ద ప్రమాదాలు చూడాల్సి వస్తుంది. కోపం అనేది భావాలను వ్యక్తీకరించడానికి ఒక మార్గం. కానీ కొన్నిసార్లు ఈ కోపం సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంటుంది. కోపం అనేది తప్పు అని కొంత కాలం తర్వాత గ్రహిస్తారు. కానీ పిల్లలు దీన్ని అర్థం చేసుకోవడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది పిల్లలు తమ కోపాన్ని అదుపు చేసుకోలేరు.

పిల్లలు కోపంగా ఉండే భావాలు, దూకుడు ప్రవర్తన మధ్య తేడాను అర్థం చేసుకోవడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల కోపాన్ని అదుపు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లల కోపాన్ని ఎలా నియంత్రించాలో తెలుసుకోవాలి. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల కోరికలన్నింటినీ నెరవేర్చాలని కోరుకుంటారు. అయితే అలా చేయడంలో తప్పేమీ లేదు. పిల్లల డిమాండ్లన్నింటినీ నెరవేర్చడం ద్వారా మీరు వారిని మొండిగా, చిరాకుగా మారుస్తారు. అడిగిన ప్రతీదీ ఇవ్వడం మంచిది కాదు. ఎందుకంటే ఏదో ఒకరోజు మీరు వారి కోరికను నెరవేర్చకుంటే వారికి కోపం కట్టలు తెచ్చుకుంటుంది. ఏదైనా ఇచ్చే ముందు దాని గురించి చెప్పాలి. ఏదైనా ఇవ్వకూడదని డిసైడ్ అయినప్పుడు దాని వలన కలిగే నష్టాలను వివరించాలి.

పిల్లలు తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు కొన్ని విన్యాసాలు చేస్తుంటారు. ఇది ప్రతీ ఇంట్లో చూసేదే. అటువంటి పరిస్థితిలో వారు ఎల్లప్పుడూ ఇలా ప్రవర్తించడం ప్రారంభిస్తారు. అయితే ఇలాంటి సమయంలో కొన్నిసార్లు వారిని పట్టించుకోనట్టుగా ఉంటేనే మంచిది. మీరు గారాబం చేస్తే ఇక వారు రెచ్చిపోతారు. అందుకే తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. పిల్లలు కోపంగా ఉన్నప్పుడు పెద్దలు కోపంగా స్పందించకుండా ఉండండి. పిల్లల కోపాన్ని తగ్గించడానికి ఉత్తమ మార్గం వారితో సున్నితంగా వ్యవహరించడం. మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో ప్రశాంతంగా, సున్నితంగా పిల్లలకు చెప్పడం చాలా ముఖ్యం. మీరు వారితో కోపంగా ఉంటే వారు తమ కోపాన్ని నియంత్రించడం నేర్చుకోరు. బదులుగా వారి దూకుడు స్థాయి పెరుగుతుంది.

మీ బిడ్డ కోపం ఎక్కువైతే అలాగే వదిలేయకూడదు. మీ బిడ్డను కౌగిలించుకొని, వారు కలత చెందినప్పుడు లేదా మొండిగా ఉన్నప్పుడు వారిని శాంతింపజేయడానికి వీపుపై చేయి వేయండి. కాస్త పెద్ద పిల్లలైతే వారి కోపాన్ని నియంత్రించేందుకు వారితో కాసేప గడపాలి. మాట్లాడండి, ప్రశాంతంగా ఉండటానికి వారికి అవకాశం ఇవ్వండి. చిన్నప్పుడే పిల్లల కోపాన్ని నియంత్రించుకంటే పెరుగుతూ ఉంటే అస్సలు కంట్రోల్ చేయలేరు. తర్వాత మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే పిల్లల కోపాన్ని తగ్గించేందుకు వారితో సరిగా నడుచుకోవాలి. పిల్లలు అడిగిందల్లా ఇవ్వకూడదు. అవసరం లేని దాని గురించి సరిగ్గా వివరించాలి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z