DailyDose

ఛాంబర్ లాకర్‌లో చీరలు 20లక్షలు-నేరవార్తలు

ఛాంబర్ లాకర్‌లో చీరలు 20లక్షలు-నేరవార్తలు

* ఉత్తర్‌ప్రదేశ్‌లోని (Uttar Pradesh) లఖ్‌నవూ (Lucknow) జిల్లా కారాగారంలో కలకలం రేగింది. అందులో శిక్ష అనుభవిస్తున్న 63 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ (HIV) పాజిటివ్‌ అని నిర్ధరణ అయ్యింది. డిసెంబర్‌లో నిర్వహించిన పరీక్షల్లో 36 మందికి ఈ వైరస్‌ సోకినట్లు తేలగా.. తాజాగా ఆ సంఖ్య మరింత పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, వైరస్‌ వ్యాప్తికి గల కారణాలపై స్పష్టత కొరవడింది. వీరిలో చాలామందికి డ్రగ్స్‌ తీసుకునే అలవాటుందని, వాటిని శరీరంలోకి ఎక్కించుకునే క్రమంలో ఒకరు ఉపయోగించిన సిరంజిని మరొకరు వాడటం వల్లే ఈ వైరస్‌ వ్యాపించిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వీరందరికీ ముందే హెచ్‌ఐవీ ఉందని, ఈ జైలులోకి వచ్చిన తర్వాత ఎవరికీ సంక్రమించలేదని అంటున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో బాధితులందరికీ లఖ్‌నవూలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. వారి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు చెప్పారు. గత ఐదేళ్లలో ఈ జైలులో ఇంతపెద్ద మొత్తంలో హెచ్‌ఐవీ కేసులు బయటపడటం ఇదే తొలిసారి. దీనికి గల కారణాలను గుర్తించేందుకు ప్రత్యేకంగా దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో కేసులు నమోదుకావడంతో ఇక్కడి మిగతా ఖైదీల ఆరోగ్యం, భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. కేసుల సంఖ్య పెరగకుండా వైద్యారోగ్యశాఖ సూచన మేరకు నియంత్రణ చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.

* అక్రమాస్తుల కేసులో అరెస్టయిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఏసీబీ దర్యాప్తులో రోజుకో సంచలనం వెలుగులోకి వస్తోంది. ఆరో రోజు సోమవారం ఏసీబీ అధికారులు శివ బాలకృష్ణను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఇప్పటికే ఐదు రోజుల పాటు బాలకృష్ణను విచారించిన అధికారులు కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు గుర్తించారు. రియల్ ఎస్టేట్స్ వ్యాపారంలో పెట్టుబడులపై విచారించారు. ఇందులో ఎవరెవరు బాలకృష్ణకు బినామీలుగా వ్యవహరించారనే దానిపై విచారణ చేశారు. బాలకృష్ణ సోదరుడు శివ సునీల్ కుమార్‌ను కూడా అధికారులు విచారించారు. బాలకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు గుర్తించారు. రెరా కార్యాలయంలోని బాలకృష్ణ చాంబర్‌లో లాకర్‌ను బ్రేక్ చేశారు. రూ. 12 లక్షల విలువ చేసే చీరలు, రూ. 20 లక్షలకు పైగా క్యాష్ లభ్యమైంది. వాటితో పాటు బాలకృష్ణ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు ఫోటో ఆల్బమ్‌లు, కీలకమైన భూముల‌ పాసు పుస్తాకాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) పరిధిలో నిర్మించే బహుళ అంతస్తులకు సంబంధించి, అనుమతులు తీసుకునే సమయంలోనే.. 10 శాతం హెచ్‌ఎండీఏకు మార్టగేజ్‌ చేయాలనే నిబంధన ఉంది. సెట్‌బ్యాక్‌లను వదిలి, పర్మిషన్‌లో పేర్కొన్న ప్రకారమే నిర్మాణ పనులన్నీ పూర్తయితేనే.. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌(ఓసీ) ఇస్తారు. ఓసీ ఉంటేనే హెచ్‌ఎండీఏ ఆ మార్టగేజ్‌ను విడుదల చేస్తుంది. అధికారాన్ని అడ్డుపెట్టుకున్న శివబాలకృష్ణ.. మార్టగేజ్‌తోనే అసలు మతలబు నడిపినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బహుళ అంతస్తుల భవనాల్లో.. ఫ్లాట్ల నిర్మాణాన్ని బట్టి.. తన వంతు వాటాను తీసుకునేవాడు. విల్లాల నిర్మాణంలోనూ ఇదే విధానాన్ని అనుసరించినట్లు ఏసీబీ నిర్ధారించింది. అలా వాటా తీసుకున్న ఫ్లాట్‌, ఇళ్లకు రిజిస్ట్రేషన్‌ కూడా చేయించుకోకుండా.. తన వారిని వాటిల్లో దింపేస్తాడు. ఆ ఫ్లాట్లు, ఇళ్లు బిల్డర్లు/నిర్మాణ సంస్థ పేరిటే ఉన్నా.. ఎవరికీ విక్రయించే అవకాశం లేకుండా చేస్తాడు. అంతా అనుకున్నట్లు జరిగాక.. తన వాళ్ల పేరిట వాటిని రిజిస్ట్రేషన్‌ చేయిస్తాడు. ఇదే తరహాలో.. ఓ నిర్మాణ సంస్థ పేరిట ఉన్న విల్లాలో శివబాలకృష్ణ సన్నిహితులు ఇంటీరియర్‌ డిజైన్‌ చేస్తున్న విషయాన్ని ఏసీబీ గుర్తించింది. ఇలా శివబాలకృష్ణ తన సర్వీసులో ఆదాయానికి మించి విల్లాలు, ఫ్లాట్లు, స్థలాలను సేకరించాడని ఏసీబీ గుర్తించింది. దీన్ని బట్టి అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు..! రెవెన్యూ సంబంధిత అంశాల్లో స్పష్టత కోసం సంబంధిత శాఖలో పనిచేసి, పదవీ విరమణ చేసిన అధికారుల సహకారం కోసం ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

* తన సంస్థలో విధులు నిర్వహిస్తున్న యువతి కోసం అమెరికా నుంచి వచ్చిన ఓ సీఈఓ..ఆమెను వేధించి కటకటాల పాలైన సంఘటన మధురానగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అమీర్‌పేటలో ఉన్న ఇన్ఫోగ్రావిటీ సంస్థ సీఈఓ టి.చంద్ర అమెరికాలో ఉంటాడు. ఇండియాలో తన కంపెనీ అభివృద్ధిలో భాగంగా నిరంతరం జూమ్‌ సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యోగులకు సలహాలు, సూచనలు ఇస్తుంటాడు. ఈ క్రమంలో తన కంపెనీలో (అమీర్‌పేట సంస్థ)లో హెచ్‌ఆర్‌గా విధులు నిర్వహిస్తున్న యువతిని జూమ్‌ సమావేశంలో చూశాడు. అంతేగాకుండా ఆమెపై మనసు పారేసుకున్నాడు. తన కంపెనీ అభివృద్ధి కోసం అందమైన అమ్మాయిలకు ఉద్యోగాలు ఇవ్వాలని సూచించడమే కాకుండా ఆమెను నిత్యం పొగిడేవాడు. అయితే అతను తన యజమాని కావడంతో యువతి ఏమీ అనలేక పోయింది. గతేడాది డిసెంబర్‌లో ఇండియాకు వచ్చిన చంద్ర ఆ యువతిని వేధించడం మొదలుపెట్టాడు. తనతో సన్నిహితంగా ఉండాలని ఒత్తిడి చేశాడు. దీంతో విసుగుచెంది అదే నెల 12న ఉద్యోగానికి రాజీనామా చేసింది. తనకు రిలీవింగ్‌ లెటర్, జీతం, లీగల్‌ సరీ్వసెస్‌ డ్యూస్, ఎక్స్‌పీరియన్స్‌ లెటర్స్‌ కావాలని కోరింది. అయితే తన కోర్కె తీరిస్తేనే వాటిని ఇస్తానని చంద్ర చెప్పడంతో ఆమె ఆగ్రహించి మధురానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

* సికింద్రాబాద్ మోండా మార్కెట్ ప‌రిధిలో మూడు రోజుల క్రితం ఓ యాచ‌కుడు దారుణ హ‌త్య‌కు గురైన సంగ‌తి తెలిసిందే. ఈ హ‌త్య కేసును మోండా మార్కెట్ పోలీసులు ఛేదించారు. యాచ‌కుడిని హ‌త్య చేసిన మ‌హ్మ‌ద్ మోసిన్‌ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రూ. 800 కోసం నితిలేశ్‌పై మోసిన్‌ఖాన్ బ్లేడుతో దాడి చేశాడు. ఈ దాడిలో నితిలేశ్ ప్రాణాలు కోల్పోయాడు. సీసీ కెమెరాల ఆధారంగా నిజామాబాద్‌లో నిందితుడు మోసిన్‌ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని రిమాండ్‌కు త‌ర‌లించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z