Movies

పూనం పాండేపై కేసు-నేరవార్తలు

పూనం పాండేపై కేసు-నేరవార్తలు

* ప్రముఖ నటి, మోడల్‌ పూనమ్‌ పాండే తనను తాను చనిపోయినట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించుకొని చిక్కుల్లో పడింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కోల్‌కతాకు చెందిన అమిత్‌ రాయ్‌ అనే వ్యక్తి.. ఏకంగా కోర్టును ఆశ్రయించారు. చనిపోయానని ప్రకటించడం ఎంతో తీవ్రమైన అంశం అని, అలాంటి ప్రకటన ద్వారా పూనమ్ పాండే తీవ్ర గందరగోళం సృష్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై పూనమ్ పాండే మీడియా ద్వారా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పూనమ్ పాండేకు కోర్టు ద్వారా లీగల్‌ నోటీసులు పంపారు. కాగా, గత శుక్రవారం గర్భాశయ క్యాన్సర్‌ తో పూనమ్‌ పాండే చనిపోయినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. స్వయంగా నటి టీమే ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. దీంతో పూనమ్‌ చనిపోయిందని అంతా భావించారు. ఈ మేరకు ఆమె మృతికి సంతాపంగా సోషల్‌ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. అయితే అనూహ్యంగా కొందరు నెటిజన్లు ఆమె మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. పూనమ్‌ తన మరణంతో కొత్త పబ్లిసిటీ స్టంట్ చేస్తోందంటూ సోషల్‌ మీడియా మొత్తం చెప్పుకుంది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ‘నేను చనిపోలేదు.. ఇంకా బతికే ఉన్నాను’ అంటూ పూనమ్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో ఓ వీడియో రిలీజ్‌ చేసింది. సర్వైకల్‌ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఇలా చేశానని వివరణ ఇచ్చింది. దీంతో ఆమెపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. క్యాన్సర్‌పై అవగాహన కోసం చనిపోయానని చెప్పడం తీవ్ర విషయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

* ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వ‌ర్యంలో నడిచే మౌలానా అజాద్ మెడిక‌ల్ కాలేజ్ హాస్ట‌ల్ రూంలో 23 ఏండ్ల విద్యార్ధిని అర్ధంతరంగా త‌నువు చాలించ‌డం క్యాంప‌స్‌లో క‌ల‌క‌లం రేపింది. ఢిల్లీకి చెందిన బాధిత విద్యార్ధిని ఆదివారం న‌గ‌రంలోని ఇంటికి వెళ్లి కుటుంబ స‌భ్యుల‌తో గ‌డిపి అదేరోజు సాయంత్రం హాస్ట‌ల్‌కు తిరిగివ‌చ్చింది. సోమ‌వారం ఉద‌యం హ‌స్ట‌ల్ స‌హ‌చరులు ఆమె రూంకు వ‌చ్చి త‌లుపు కొట్ట‌గా ఎంత‌సేప‌టికి బ‌దులివ్వ‌లేదు. దీంతో హాస్ట‌ల్ నిర్వాహ‌కులు పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో ఘ‌ట‌నా స్ధ‌లానికి చేరుకున్న పోలీసులు త‌లుపులు ప‌గ‌ల‌కొట్టి లోప‌లికి వెళ్ల‌గా ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ విగ‌త‌జీవిగా క‌నిపించింది. మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బాధితురాలు ఇంత తీవ్ర నిర్ణ‌యం తీసుకోవ‌డానికి కార‌ణాల‌ను తెలుసుకునేందుకు ఆమె కాల్ డిటైల్స్‌, వాట్సాప్ రికార్డ్‌ను చెక్ చేస్తున్నామ‌ని, కుటుంబ స‌భ్యుల‌నూ ప్ర‌శ్నిస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు త‌దుప‌రి ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

* ఏపీలోని విశాఖలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ద్విచక్రవాహనదారులు మృతి చెందారు. విశాఖ మధురవాడ బొరవానిపాలెం జాతీయ రహదారిపై గ్యాస్‌ లోడ్‌ లారీ అతివేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పెదవాల్తేరు వాసులు మణి, నిరంజన్‌గా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

* మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హర్దా జిల్లాలోని ఓ టపాసుల తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బైరాగఢ్‌ గ్రామంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో మంగళవారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 40 మందికి పైగా గాయపడ్డారు. తీవ్రగాయాలతో 25 మంది ఆసుపత్రిలో చేరారు. ఈ పేలుడు శబ్ధం దాదాపు రెండు కిలోమీటర్ల దాకా వినిపించింది. చుట్టుపక్కల 60 ఇళ్లకు మంటలు అంటుకున్నాయి. పేలుడు సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకూ సుమారు 100 ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. మంటల ధాటికి పలు వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

* హైదరాబాద్‌లో మరోసారి పెద్దమొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. పంజాగుట్టలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న నైజీరియన్‌ను నార్కొటిక్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి పెద్దమొత్తంలో హెరాయిన్‌, కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గోవా కేంద్రంగా డ్రగ్స్‌ విక్రయిస్తున్న నైజీరియన్‌ దేశస్థుడు స్టాన్లీని ఎర్రమంజిల్‌ మెట్రో స్టేషన్‌ వద్ద అరెస్టు చేసినట్లు వెస్ట్‌ జోన్‌ డీసీపీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా అతడి వద్ద చాలా మంది డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు. అతని వద్ద లభించిన కోట్ల విలువైన డ్రగ్స్‌, తొమ్మిది మొబైల్‌ ఫోన్లను సీజ్‌ చేశామని వెల్లడించారు. 2015లో కూడా నార్కోటిక్స్‌ బ్యూరో అధికారులకు పట్టుబడ్డాడని చెప్పారు.

* భారత హాకీ జట్టు క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత వరుణ్‌ కుమార్‌ పై కేసు నమోదైంది. గత ఐదేళ్లుగా వరుణ్‌ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అతడిపై బెంగళూరు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z