* నగరంలోని నీలోఫర్ ఆస్పత్రిలో బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పాత భవనం మొదటి అంతస్తులోని ల్యాబ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగ వ్యాపించింది. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. మైక్రోబయాలజీ ల్యాబ్‌లోని ఫ్రిజ్ వద్ద విద్యుదాఘాతంతో స్వల్పంగా మంటలు వచ్చాయని, వెంటనే సిబ్బంది అప్రమత్తమై ఆర్పివేశారని సూపరింటెండెంట్ ఉషారాణి తెలిపారు. పొగ ఎక్కువగా వ్యాపించడంతో రోగుల సహాయకులు ఆందోళనకు గురయ్యారని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు.
* ప్రేమ జంట కనిపిస్తే చాలు వీరి పంట పండినట్టే. లవర్స్‌ను బెదిరిస్తూ అందినకాడికి దోచుకుంటున్న ముఠా ఎట్టకేలకు నల్గొండ పోలీసులకు చిక్కింది. ప్రేమికులు ఏకాంతంగా ఉన్న సమయంలో వారిని ఈ ముఠా టార్గెట్ చేస్తుంది. రహస్యంగా వీడియోలు తీసి.. లీక్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతోంది. ఆరుగురు యువకులు బృందంగా ఏర్పడి పలువురిని బెదిరించి డబ్బు, నగలు, విలువైన వస్తువులు తీసుకున్నారు.
* మేడ్చల్ పరిధిలోని ఓఆర్‌ఆర్‌పై అతివేగంతో వచ్చిన కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి ఎదురు లైన్‌లో వస్తున్న మరో కారును ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మేడ్చల్ ఎస్‌ఐ నవీన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని వనస్థలిపురంనకు చెందిన రెడ్డప్ప రెడ్డి (50) ఉద్యోగ నిమిత్తం సోమవారం ఉదయం 10 గంటలకు ఇంటినుంచి తన ఇన్నోవా కారులో బయలుదేరి బాచుపల్లిలో విధులు ముగించుకుని రాత్రి తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యలోని మేడ్చల్ ఎగ్జిట్ నెంబర్–6 సమీపంలోకి చేరుకున్నాడు. ఇదే సమయంలో ఎదురు లైన్‌లో వేగంగా వస్తున్న ఎక్స్‌యూవీ కారు అతివేగంతో వచ్చి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి ఎదురులైన్‌లోకి దూసుకోచ్చి రెడ్డప్ప రెడ్డి ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. విషయం తెలుసుకున్న మేడ్చల్ సీఐ నర్సింహారెడ్డి, ఎస్‌ఐ నవీన్‌రెడ్డి ఘటన స్థలికి చేరుకుని క్షతగాత్రులను కార్లలోంచి బయటికి తీశారు. ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న రెడ్డప్ప రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎక్స్‌యూవీ కారులో ఉన్న జగద్గిరిగుట్టకు చెందిన ముగ్గురిలో బీటెక్ విద్యార్థి రెడ్డి గణేశ్ (18) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరో ఇద్దరు విద్యార్థులు మోక్షిత్‌రెడ్డి, మంగలపు గణేశ్‌లు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు.
* గుంటూరు జిల్లా తెనాలి (Tenali) లో విషాదం చోటు చేసుకుంది. ఐతానగర్‌లో మున్సిపల్ కార్మికుడు పనిచేస్తుండగా మట్టిపెళ్లలు మీదపడి మృతి చెందాడు. తాగునీటి పైపులైన్ల(Pipelines) కు మరమ్మతు పనులు చేస్తుండగా ఒక్కసారిగా మట్టిపెళ్లలు విరిగిపడి మున్సిపల్ కార్మికుడు వెంకటేశ్వర్లు మీదపడ్డాయి. దీంతో కార్మికుడు ఊపిరాడక మృతి చెందాడు. పోలీసులు, మున్సిపల్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z