Sports

టీమ్‌ఇండియా ఘన విజయం

టీమ్‌ఇండియా ఘన విజయం

రాజ్‌కోట్‌ వేదికగా మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 557 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్‌ 122 పరుగులకే కుప్పకూలింది. దీంతో 434 పరుగుల భారీ తేడాతో టీమ్‌ఇండియా విజయకేతనం ఎగురవేసింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 445 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ 319 రన్స్‌కే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌ను టీమ్‌ఇండియా 430/4 స్కోరు వద్ద డిక్లేర్డ్‌ చేసింది. యశస్వి జైస్వాల్ (214*) డబుల్ సెంచరీ సాధించాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 2-1 లీడ్‌ సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన రవీంద్ర జడేజాను ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు వరించింది. నాలుగో టెస్టు మ్యాచ్‌ ఫిబ్రవరి 23 నుంచి రాంచీ వేదికగా ప్రారంభం కానుంది.

పెనాల్టీ టైమ్‌ లేకుండానే అశ్విన్‌ వచ్చేశాడు!
వ్యక్తిత అత్యవసర కారణాలతో మ్యాచ్‌ మధ్యలోనే చెన్నైకి వెళ్లిన రవిచంద్రన్ అశ్విన్.. నాలుగో రోజు టీ బ్రేక్‌ సమయానికి జట్టుతోపాటు చేరాడు. అయితే, ఎలాంటి పెనాల్టీ టైమ్ లేకుండానే నేరుగా మ్యాచ్‌లోకి వచ్చాడు. బౌలింగ్‌ కూడా చేసి ఒక వికెట్‌ తీశాడు. అయితే, అతడిపై ఎలాంటి పెనాల్టీ టైమ్‌ లేకుండా ఉండటానికి ఐసీసీ రూల్సే కారణం. ‘‘ఎవరైనా ఆటగాడు సహేతుకమైన కారణంతో మైదానం వీడి.. మళ్లీ జట్టులోకి వచ్చిన తర్వాత ఎలాంటి పెనాల్టీ టైమ్‌ విధించనవసరం లేదు. ఫీల్డ్‌ అంపైర్లు ఆ కారణాన్ని అంగీకరించని పక్షంలోనే పెనాల్టీ పడే అవకాశం ఉంది’’ అని ఐసీసీ నిబంధనలు తెలియజేస్తున్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z