Health

కాలేయం జాగ్రత్త

కాలేయం జాగ్రత్త

కాలేయం.. శరీరంలో అతి కీలకమైన అవయవం. ఇది అతిపెద్ద గ్రంథి. ఒక్క కాలేయమే దాదాపు అయిదొందల విధులు నిర్వర్తిస్తుంది. చర్మం తరువాత ఒక్క కాలేయానికే పునరుత్పత్తి సామర్థ్యంఉంది. దాదాపు డెబ్బయి అయిదు శాతం దెబ్బతిన్నా కూడా.. తక్కిన పావు భాగంతోనే కాలేయం తన విధులను నిర్వహించగలదు. అంతేకాదు, ఆరోగ్యకరమైన జీవనశైలితో శిథిలమైన భాగాన్ని తిరిగి అభివృద్ధి చేసుకోగల అసాధారణ శక్తి కాలేయానికి ఉంది. మనిషి మరణించే వరకూ ఆ పునరుత్పాదక శక్తి కొనసాగుతుంది. అంటే కాలేయం తనకు నష్టం కలిగిస్తున్న అలవాట్లు, వ్యాధులను గుర్తించి.. ఆ లోపాల్ని సరిదిద్దుకోవడానికి మనిషికి అవకాశం ఇస్తుందన్నమాట. అయితే కాలేయ కణాలు మొత్తం దెబ్బతిన్నప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా చేజారుతుంది. కాలేయానికి ఉన్న ప్రత్యేక శక్తి కూడా పనికి రాకుండా పోతుంది.

మద్యపాన వ్యసనం, హెపటైటిస్‌-బి, సి వైరస్‌ ఇన్ఫెక్షన్ల వల్ల ఎక్కువమందికి కాలేయ వ్యాధులు దాపురిస్తున్నాయి. ఆ రుగ్మతకు సంకేతంగా మొదట కామెర్ల వ్యాధి సోకుతుంది. దాన్ని గుర్తించి వెంటనే చికిత్స చేయించుకోవాలి. లేదంటే, అది కాస్త ముదిరి కాలేయం పనితీరు తీవ్రంగా దెబ్బతింటుంది. వీటిలో హెపటైటిస్‌- ఎ, ఇ వైరస్‌ల వల్ల వచ్చే కామెర్లు మరీ ప్రమాదకరం. హఠాత్తుగా మరణం ముంచుకొస్తుంది. కలుషితమైన నీళ్లు, ఆహారం నుంచి హెపటైటిస్‌-ఎ, ఇ వైరస్‌లు శరీరంలో ప్రవేశిస్తాయి. దీర్ఘకాలంపాటు మితిమీరిన మద్యపానం అలవాటు.. కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. దీంతో, లివర్‌ సిరోసిస్‌ వ్యాధి వస్తుంది.

ఊబకాయం కూడా కాలేయ వ్యాధులకు కారణం అవుతున్నది. ఫ్యాట్‌ సిరోసిస్‌ లేదా నాన్‌ ఆల్కహాలిక్‌ స్టియటోహెపటైటిస్‌ ఏర్పడుతుంది. ప్రస్తుతం కాలేయ సమస్యలతో వస్తున్న వారిలో దాదాపు సగం మందిలో ఈ ఫ్యాట్‌ సిరోసిస్‌ వ్యాధే కనిపిస్తున్నది. ఫ్యాట్‌ సిరోసిస్‌ బి, సి దశ ప్రారంభంలో కాలేయ కణాలు చాలావరకు పనిచేయలేని స్థితికి చేరుకుంటాయి. ఇక పిల్లల్లో కనిపించే కాలేయ వ్యాధులు చాలావరకు పుట్టుకతో వస్తున్నవే. శరీరధర్మాలకు సంబంధించినవే. విల్సన్‌ డిసీజ్‌, బైల్‌ డక్ట్స్‌ లేకపోవటం, కురుపులు వంటి సమస్యలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమస్యలు ఉన్న పిల్లల కాలేయం భవిష్యత్తులో పూర్తిగా పనిచేయలేని స్థితికి చేరుకుంటుంది.

కాలేయం దెబ్బతినటం ఓ ప్రమాద సంకేతం. ముందుగానే గుర్తించగలిగితే క్యాన్సర్‌ సహా వివిధ కాలేయ వ్యాధులను ఔషధాలతో నయం చేయవచ్చు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం పరిస్థితి చేజారిపోతుంది. కాలేయ వ్యాధులు సోకినా కూడా.. ఆ లక్షణాలు బయటపడటానికి పది నుంచి ఇరవై సంవత్సరాల సమయం పడుతుంది. ఈ సుదీర్ఘ కాలంలో కాలేయ కణాలు క్రమంగా మృతిచెందుతూ వస్తాయి. దీంతో ‘లివర్‌ స్కార్‌’ ఏర్పడుతుంటుంది. ఇది కాలేయాన్ని పూర్తిగా కప్పేసేటప్పటికి రోగలక్షణాలు స్పష్టంగా బయటపడతాయి. అప్పటికే వ్యాధి ముదిరిపోయి ఉంటుంది. ఈ పరిస్థితికి చేరేలోగా కాలేయానికి కష్టాలు మొదలైపోతాయి. ఆ సంకేతాలూ కనిపిస్తాయి. కళ్లు పచ్చబడతాయి. దురద బాధపెడుతుంది. ఆకలి మందగిస్తుంది. నీరసంగా ఉంటుంది. ఎప్పుడూ నిద్రమత్తే. కడుపులో వికారంగా అనిపిస్తుంది. ఏకాగ్రత కుదరదు. జ్ఞాపకశక్తి మందగిస్తుంది. చివరికి కోమాలోకి జారిపోతారు.

కాలేయ క్యాన్సర్‌ అంటే ఇదివరకు డాక్టర్లలో కూడా దాదాపు 90 శాతం మందికి మరణమే అనే భావన ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. అత్యాధునిక సర్జరీతో క్యాన్సర్‌ కణుతులను పూర్తిగా తొలగించటం సాధ్యమవుతున్నది. కణితి 3- 5 సెంటీమీటర్లు ఉంటే ఆర్‌ఎఫ్‌ఏ, టీఏసీఈ వంటి సర్జరీయేతర చికిత్స చేస్తారు. వీరిలో 90 శాతం మంది కోలుకుంటారు. అయితే వీరికి రెండు మూడేండ్లలో మళ్లీ కాన్సర్‌ వచ్చే ముప్పు ఉంటుంది. అందువల్ల క్రమం తప్పకుండా డాక్టర్‌కు చూపించుకుంటూ ఉండాలి. అవసరమైతే ఆ చికిత్సలను కొనసాగించి క్యాన్సర్‌ కణుతులను అదుపుచేస్తారు. ‘బి’ నుంచి తరువాతి స్థాయికి మారుతున్న స్థితిలో వచ్చినవారికి, ‘సి’ చైల్డ్‌ స్థాయి పూర్తిగా ముదరని దశలో వచ్చిన వారికి కాలేయ మార్పిడి చేయడం ద్వారా ప్రాణాపాయం నుంచి రక్షించవచ్చు. ఇలాంటి కేసులలో తొంభై అయిదు శాతం వరకు కాలేయ మార్పిడి సర్జరీలు విజయవంతం అవుతున్నాయి. ఇటీవలి కాలంలో కాలేయ వ్యాధుల చికిత్స ఆధునికతను సంతరించుకుంది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, శక్తిమంతమైన మందులు, కచ్చితమైన శస్త్రచికిత్సలు, కాలేయ మార్పిడి సర్జరీలు ఎక్కువ శాతం విజయవంతం అవుతుండటం కాలేయ వ్యాధిగ్రస్తులకు ఉపశమనం కలిగిస్తున్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z