ScienceAndTech

చైనా హ్యాకర్లను నిలువరించలేకపోయిన మైక్రోసాఫ్ట్-CrimeNews-Apr 03 2024

చైనా హ్యాకర్లను నిలువరించలేకపోయిన మైక్రోసాఫ్ట్-CrimeNews-Apr 03 2024

* యూజర్ల భద్రతను కాపాడే విషయంలో మైక్రోసాఫ్ట్‌ (Microsoft) తప్పిదాలకు పాల్పడినట్లు ఓ కీలక నివేదిక వెల్లడించింది. లోపాలను సవరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపించింది. ఫలితంగా చైనా ప్రభుత్వ మద్దతున్న సైబర్‌ నేరగాళ్లు అమెరికా అధికారులు, సంస్థల ఈమెయిల్‌ ఖాతాల్లో చొరబడ్డారని తెలిపింది. బాధితుల్లో అమెరికా వాణిజ్య కార్యదర్శి సైతం ఉన్నట్లు తేల్చింది. దీనివల్ల సున్నితమైన సమాచారం బయటకు వెళ్లి ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. సైబర్‌ దాడులను అరికట్టేందుకు వివిధ కంపెనీలు తీసుకుంటున్న చర్యలను సమీక్షించేందుకుగనూ బైడెన్‌ ప్రభుత్వం 2021లో ‘సైబర్‌ సేఫ్టీ రివ్యూ బోర్డు’ పేరిట ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సైబర్‌ సెక్యూరిటీ విషయంలో మైక్రోసాఫ్ట్‌ (Microsoft) విధానాలు గందరగోళంగా ఉన్నాయని ఈ బోర్డు తేల్చింది. పైగా దాడులకు సంబంధించిన సమాచారం తెలుసా.. లేదా.. అనే విషయంలోనూ మైక్రోసాఫ్ట్‌ నిజాయతీగా వ్యవహరించలేదని ఆరోపించింది. ఈ నేపథ్యంలో కంపెనీ భద్రతా విధానాలు ప్రమాణాలకు అనుగుణంగా లేవని.. వాటిని పునర్‌వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని సూచించింది. టెక్‌ రంగంలో అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషిస్తున్న ఈ కంపెనీ అనేక దేశాల జాతీయ భద్రత, ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం వంటి కీలక రంగాలకు కావాల్సిన ఉత్పత్తులను అందిస్తోందని గుర్తుచేసింది.

* అదనపు కట్నం కోసం అత్తింటివేధింపులను తట్టుకోలేక ఏడాది బిడ్డకు విషగుళికలు ఇచ్చి చంపిందా తల్లి. ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడింది. దీన్ని తట్టుకోలేక మృతురాలి తల్లి సైతం ఆత్మహత్యకు పాల్పడింది. ఒకేరోజు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతితో కరీంనగర్‌ జిల్లా బొమ్మకల్‌ గ్రామంలో తీరని విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. బొమ్మకల్‌ గ్రామ పంచాయతీ విజయ్‌నగర్‌కాలనీలో ఉంటున్న ఉపాధ్యాయ దంపతులు గద్దె వెంకటేశ్వరచారి– జయప్రద(55) తమ చిన్న కూతురు శ్రీజ(25)కు మూడేళ్లక్రితం వరంగల్‌ జిల్లా మొగ్ధుంపూర్‌కు చెందిన నరేశ్‌తో కట్నకానుకలతో వివాహం జరిపించారు. ఏడాదిపాటు సక్రమంగా కాపురం చేసిన నరేశ్‌… కొడుకు ఆర్యన్‌(1) పుట్టాక శ్రీజను అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. అత్తమామలు సుజాత–కేశవచారి హింసించడంతో శ్రీజ గత నెల 29న బొమ్మకల్‌లోని పుట్టింటికి వచ్చింది. మంగళవారం ఉదయం 6గంటలకు కొడుకు మొదటి బర్త్‌డే గురించి నరేశ్‌కు శ్రీజ ఫోన్‌ చేయడంతో అత్తమామలు, భర్త కలిసి తీవ్రంగా దూషించారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన శ్రీజ క్రిమిసంహారక మాత్రలను కొడుకు ఆర్యన్‌కు తాగించి ఆ తర్వాత తానూ వేసుకుంది.

* పర్సు పక్కన పెట్టిన క్రికెట్‌ ఆడిన వ్యక్తి రూ. 6.72 లక్షలు పోగొట్టుకున్న సంఘటన ముంబైలో చోటుచేకుంది. దక్షిణ ముంబైలోని క్రాస్ మైదాన్‌లో క్రికెట్ ఆడేందుకు వచ్చిన 28 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ తన క్రెడిట్, డెబిట్ కార్డులు దొంగతనానికి గురై రూ. 6.72 లక్షలు పోగొట్టుకున్నారని పోలీసులు తెలిపారు. మార్చి 30 న జరిగిన ఈ సంఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఒక అధికారి చెప్పారు.

* అత్యాచార బాధితురాలి గాయాలు పరిశీలించేందుకు దుస్తులు విప్పాలని మెజిస్ట్రేట్‌ అన్నాడు. దీనికి ఆ మహిళ నిరాకరించింది. అనంతరం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో మెజిస్ట్రేట్‌పై కేసు నమోదు చేశారు. (Magistrate Asks Dalit Rape Survivor To Strip) రాజస్థాన్‌లోని కరౌలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మార్చి 19న దళిత మహిళపై అత్యాచారం జరిగింది. బాధితురాలి ఫిర్యాదుపై హిండౌన్ సదర్ పోలీస్ స్టేషన్‌లో మార్చి 27న కేసు నమోదైంది. కాగా, మార్చి 30న హిండౌన్‌ కోర్టులో బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్‌ అతిగా ప్రవర్తించాడు. దుస్తులు విప్పి గాయాలు చూపించాలని అత్యాచార బాధిత మహిళతో అన్నాడు. దీనికి ఆమె నిరాకరించింది. అనంతరం దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఐపీసీలోని సెక్షన్‌ 345తోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద మెజిస్ట్రేట్‌పై కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఎస్టీ, ఎస్టీ సెల్‌ డిప్యూటీ ఎస్పీ మీనా ఈ విషయం తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z