* సివిల్ సర్వీస్ పరీక్ష.. లక్షలాది మంది కల. దీన్ని సాకారం చేసుకోవడమంటే అంత ఆషామాషీ కాదు. లక్షల మంది ప్రిలిమ్స్ రాస్తే.. చివరకు ఎంపికయ్యేది వందల్లోనే. దీన్ని సాధించాలంటే ఎంతో కృషి, పట్టుదలతో పాటు కఠోర శ్రమ, కచ్చితమైన ప్రణాళిక అవసరం. ఇటీవల విడుదలైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో (UPSC Civils 2023 Result) అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. యూపీకి చెందిన ఆదిత్య శ్రీవాస్తవ (Aditya Srivastava) తొలి ర్యాంకు సాధించగా, ఒడిశాకు చెందిన అనిమేశ్ ప్రధాన్(Animesh Pradhan) రెండు, పాలమూరుకు చెందిన దోనూరు అనన్యరెడ్డి (Donuru Ananya Reddy) జాతీయస్థాయిలో మూడో ర్యాంకుతో మెరిశారు. అయితే, సివిల్స్ పరీక్ష ఎంత కఠినంగా ఉంటుందో టాపర్లు సాధించిన ఈ మార్కులను చూస్తే అర్థం చేసుకోవచ్చు.
* రాష్ట్రమంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఎక్కడ చూసినా మద్యం మాఫియా, మట్టి మాఫియా, ఇసుక మాఫియా చెలరేగిపోతోందన్నారు. ‘‘వేదవతి ప్రాజెక్టును పూర్తి చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఐదేళ్లలో ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదు. 2008లో వైఎస్‌ఆర్ శిలాఫలకం వేస్తే.. అదే ప్రాజెక్టుకు జగన్ మరో శిలాఫలకం వేశారు. ఈ ప్రభుత్వం శిలాఫలకాల ప్రభుత్వం. ప్రాజెక్టు కట్టి ఉంటే 80వేల ఎకరాలకు సాగునీరు వచ్చి ఉండేది. రైతుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నారు.. కట్టలేదు. ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి మోసం చేశారు. రైతును వైఎస్‌ఆర్ రాజును చేస్తే.. వైకాపా హయాంలో రైతు అప్పుల పాలయ్యారు. మూర్ఖులకు, అహంకారులకు ఓటు వేయొద్దు. మీ ఓటు వృథా కానివ్వొద్దు.. వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం.. హోదా ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. అధికారమిస్తే 2.25లక్షల ఉద్యోగాలు ఇస్తాం’’ అని షర్మిల హామీ ఇచ్చారు.
* మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ‘‘న్యాయం కోసం ప్రజాతీర్పు కోరుతుంటే వైకాపా అడ్డుపడుతోంది. పులివెందులలో నేను ప్రచారం చేయకుండా కేసులు వేస్తున్నారు. వివేకా హత్య అంశంపై వైకాపా నేతలు చాలాసార్లు మాట్లాడారు. మీ ఇళ్ల వద్దకు నేను రాలేకపోతే మన్నించండి. ఎన్నికల్లో షర్మిలను గెలిపించే బాధ్యత ప్రజలదే’’ అని ఆమె పేర్కొన్నారు. వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్‌ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. ప్రతివాదులు, వారి అనుచరులు, ఆయా పార్టీల అభ్యర్థులు ఈ కేసులో అవినాష్‌రెడ్డిని హంతకుడిగానూ, సీఎం జగన్ ఆయన్ను కాపాడుతున్నట్లుగానూ వ్యాఖ్యానిస్తున్నారన్నారు. ఇలా వారి ప్రతిష్ఠకు భంగం కలిగించేవి, వ్యాఖ్యలు చేయరాదని కోర్టు గురువారం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కు వాయిదా వేస్తూ కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
* భారాసకు చెందిన మరో ఎమ్మెల్యే ఆ పార్టీని వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సీఎంకు ఆయన తెలిపారు. నేడో, రేపో అనుచరులతో కలిసి చేరతానని చెప్పారు. ఇప్పటికే భారాస నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే.
* అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. ఇక వారి సినిమాలు వస్తున్నాయంటే.. పండుగ వాతావరణం నెలకొనేది. జీవితంలో ఒక్కసారైనా తమ అభిమాన కథానాయకుడిని చూడాలని ఉవ్విళ్లూరుతుండేవారు. ‘ఫలానా చోట ఫలానా హీరో వచ్చాడంటరా!’ అని ఎవరైనా చెబితే ఉన్న పనులన్నీ పక్కనపెట్టి పరుగు పరుగున అక్కడకు వెళ్లిపోయేవారు. ఇప్పుడు కూడా షాపింగ్‌మాల్స్ ప్రారంభోత్సవం అంటే ఇలాగే వస్తున్నారునుకోండి. అయితే అప్పట్లో తమ అభిమాన కథానాయకుడు వస్తున్నాడన్న సంగతి విని వెళ్తే ఏమైందో తెలుసా..! అప్పట్లో కొంతమంది అభిమానులు పద్మాలయా స్టూడియోలో షూటింగ్ చూడ్డానికొచ్చారు. చూసి, బయల్దేరుతూ ఉండగా, టెలిఫోన్ సంభాషణ విన్నారు. ‘‘నువ్వు అక్కడే ఎయిర్‌పోర్ట్‌లో ఉండు.. టికెట్స్ ఓకే అయ్యాయి. కదా! సరే… శరత్‌బాబుగారు ఇక్కడి నుంచే ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేస్తారు. చిరంజీవిగారిని తీసుకుని నువ్వు అక్కడికి వచ్చేయ్. జాగ్రత్త…’’ అదీ సంభాషణం. స్టూడియో నుంచి బయలుదేరుతున్న సందర్శకులు టక్కున ఆగారు. చిరంజీవి! ఎయిర్‌పోర్ట్! ‘‘మనం వెంటనే వెళ్లి ఎయిర్‌పోర్ట్ దగ్గర నిలబడితే చిరంజీవి గారిని చూడొచ్చు. ఆటోగ్రాఫ్ తీసుకోవచ్చు. గొప్ప అవకాశం… పదండి’’ అని పరుగులెత్తారు. విమానాశ్రయానికి శరత్‌బాబు వచ్చేశారు. విమానం వెళ్లే టైమ్ దగ్గర పడుతోంది. మరి, చిరంజీవి? ఆత్రుత పట్టలేక శరత్‌బాబునే అడిగారు. ‘‘సార్, మీ పేరు, చిరంజీవి పేరూ ఫోన్‌లో విన్నాం. చూడాలని పరుగెత్తుకొచ్చాం… మరి ఆయన ఎక్కడ సార్?’’ శరత్‌బాబు ఫక్కున నవ్వి ‘‘సారీ బాబూ… మీరు విన్నది కరెక్టే. చిరంజీవి గారంటే- ఈయనే. నా మేకప్‌మేన్. ఈయన పేరు విని మీరు ఆ చిరంజీవి అనుకున్నారు. పాపం…’’ అనడం అభిమానులు నీరుకారిపోవటం ఒక్కసారే జరిగాయి.
* షెడ్డు నుంచి కారు ఇక బయటకు రాదు.. అది పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. మహబూబ్‌నగర్‌లో ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారాస అధినేత కేసీఆర్ (KCR) ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘20 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని కేసీఆర్ అంటున్నారు. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్‌రెడ్డి. మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావు. పాలమూరులో అనేక ప్రాజెక్టులు చేపట్టాం. పదేళ్లుగా ఈ జిల్లాను ఎడారిగా మార్చారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చారా? పార్లమెంటులో నిద్రపోవడానికా భారాసకు ఓటు వేయాలి?’’ అని రేవంత్ ప్రశ్నించారు.
* యూపీఎస్సీ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఎంపిక కావడం సాధారణ విషయం కాదు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి ఉన్నతస్థాయి ఉద్యోగాల కోసం నిర్వహించే ఈ పరీక్షకు ఏటా లక్షల మంది సన్నద్ధమవుతుంటారు. కానీ, ఖాళీలు మాత్రం 1000కి అటుఇటుగా మాత్రమే ఉంటాయి. ర్యాంకర్లను మినహాయిస్తే మిగిలినవారికి నిరాశ తప్పదు. అలాంటివాళ్లు ఏళ్ల పాటు చేసిన శ్రమను చూసిన వారికి సానుభూతి కలగక మానదు. జీవితంలో కీలక సమయాన్ని పరీక్ష సన్నద్ధత కోసం వెచ్చించిన వాళ్లకు మరో మార్గంలో నడవడం అంత సులభమైన విషయం కాదు. అలాంటివారిని దృష్టిలోఉంచుకొని ‘డిట్టో ఇన్సూరెన్స్’ ప్రత్యేక నియామక ప్రక్రియను ప్రకటించింది. యూపీఎస్సీలో (UPSC) తృటిలో అవకాశం కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకువచ్చింది. వారు చేసిన కృషి, పట్టుదలకు గుర్తింపుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ సంస్థలో జిరోదా సహ-వ్యవస్థాపకుడు నితిన్ కామత్‌కు వాటాలున్నాయి.
* విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో వైకాపా ప్రచారరథం ఢీకొని భరద్వాజ్ (10) అనే బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. సమయానికి 108 అంబులెన్స్ రాకపోవడం, బాలుడిని సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోవడం బాధాకరమన్నారు. కన్నూమిన్ను కానరాక ప్రచార రథాన్ని నడిపిన నిర్లక్ష్యం ఒకటైతే.. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ అందించలేని వైకాపా పాలనా నిర్లక్ష్యం మరొకటని మండిపడ్డారు. ఈ రెండూ కలిసి ఎంతో భవిష్యత్తు ఉన్న పసివాడి జీవితాన్ని బలితీసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భరద్వాజ్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
* దేశవ్యాప్తంగా లోక్‌సభ తొలివిడత పోలింగ్ జరుగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మణిపుర్‌లోని ఓ పోలింగ్ కేంద్రం సమీపంలో కాల్పులు వినిపించాయి. దానికి సంబంధించి వీడియో క్లిప్ ఒకటి వైరల్‌గా మారింది. ప్రజలు పరుగులు పెట్టిన దృశ్యాలు ఇందులో కనిపిస్తున్నాయి. ఇన్నర్ మణిపుర్, ఔటర్ మణిపుర్.. ఈ రెండు స్థానాల్లో ఎక్కడ ఈ ఘటన జరిగిందో తెలియాల్సి ఉంది.
* దుబాయ్‌లో వరదల (Dubai Floods) నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని భారత రాయబార కార్యాలయం కీలక సూచన చేసింది. దుబాయ్‌కు వచ్చేవారు, స్థానిక అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు.. అత్యవసరం లేని ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని తాజా అడ్వైజరీలో పేర్కొంది. భారీ వరదల నేపథ్యంలో కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చేంతవరకు ఈ సూచనలు పాటించాలని తెలిపింది.
* తెలంగాణ గొంతుకే అజెండాగా, పార్టీకి పూర్వవైభవమే ధ్యేయంగా భారత రాష్ట్ర సమితి (BRS) లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమైంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఏప్రిల్ 22 నుంచి మే 10 వరకు బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది. కాంగ్రెస్, భాజపా వైఫల్యాలను ఎత్తిచూపడంతో పాటు భారాస హయాంలో చేపట్టిన కార్యక్రమాలు, వాటి ద్వారా కలిగిన లబ్ధిని ప్రజలకు వివరించేలా ప్రచారం కొనసాగించనున్నారు.
* తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. కుప్పంలో రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి నామినేషన్ పత్రాలను ఆమె సమర్పించారు. అంతకుముందు భారీ ర్యాలీగా ఆర్వో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తొలుత నిర్వహించిన ర్యాలీలో కార్యకర్తలను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడుతూ వైకాపా పాలనలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదన్నారు.
* 48 సార్లు భోజనంలో కేవలం మూడు మామిడి పండ్లు తీసుకున్నానని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) వెల్లడించారు. ఒక్కసారి మాత్రమే ఆలూపూరీ తిన్నానని చెప్పారు. అది కూడా నవరాత్రి ప్రసాదమని శుక్రవారం దిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టుకు వెల్లడించారు. తిహాడ్ జైల్లో తనకు ఇన్సులిన్ అందించాలని కోరుతూ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా తన వాదనను వినిపించారు.
* ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రేసులో అడుగుపెట్టింది. వాట్సప్, ఫేస్‌బుక్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్ వేదికలకు తన మెటా ఏఐని ఇంటిగ్రేట్ చేసింది. లాలామా 3 లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆధారంగా పని చేస్తుంది. దీంతో చాట్‌జీపీటీ తరహాలో మెటా ఏఐ చాట్‌బాట్ ఏ ప్రశ్నకైనా చిటికెలో సమాధానం రాబట్టొచ్చు.
* భారీస్థాయి దాడులతో ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా (Russia) కొంతకాలంగా దూకుడు పెంచింది. మరోవైపు ఆయుధాల కొరతతో కీవ్ సతమతమవుతోంది. ఈ పరిణామాల నడుమ ఉక్రెయిన్ కీలక ప్రకటన చేసింది. సైనిక చర్య మొదలైన తర్వాత మొట్టమొదటిసారి శత్రుదేశానికి చెందిన ఓ దీర్ఘశ్రేణి వ్యూహాత్మక బాంబర్‌ను కూల్చివేసినట్లు వెల్లడించిందని ఓ వార్తా సంస్థ తెలిపింది. పుతిన్ ప్రభుత్వం మాత్రం దీన్ని ఖండించింది. సాంకేతికలోపం కారణంగానే అది స్టావ్రోపోల్‌లోని నిర్మానుష్య ప్రాంతంలో కూలిపోయిందని తెలిపింది.
* నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరమవుతున్నారు. ఇటీవల విడవలూరు మండలానికి చెందిన 40 మంది కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమక్షంలో తెదేపాలో చేరగా.. తాజాగా నెల్లూరు నగర ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ సమక్షంలో దాదాపు 100 మంది వాలంటీర్లు తెదేపాలో చేరారు.
* సార్వత్రిక ఎన్నికల (Lok sabha Elections) సమరంలో తొలి విడత పోలింగ్ (First Phase Voting) శుక్రవారం కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో అల్లర్ల వంటి చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మొదటివిడతలో 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 49.78శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ (Election Commission) వెల్లడించింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z