ScienceAndTech

వాట్సాప్ Encryptionలో మార్పులకు ప్రభుత్వం పట్టు…ఘాటుగా సమాధానం ఇచ్చిన మెటా

వాట్సాప్ Encryptionలో మార్పులకు ప్రభుత్వం పట్టు…ఘాటుగా సమాధానం ఇచ్చిన మెటా

కొత్త ఐటీ నిబంధనలు-2021లోని 4(2) సెక్షన్‌ చట్టబద్ధతను సవాలు చేస్తూ వాట్సప్‌, ఫేస్‌బుక్‌ (ఇప్పుడు మెటా) సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా వాట్సప్‌ (WhatsApp) కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాధ్యమంలో మెసేజ్‌లకు ఉన్న ఎన్‌క్రిప్షన్‌ విధానాన్ని తొలగించాలని చెబితే తాము భారత్‌లో సేవలను నిలిపివేస్తామని వెల్లడించింది. ఐటీ నిబంధనల్లోని 4(2) సెక్షన్‌.. వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్ఛకు, వినియోగదారుల గోప్యత హక్కుకు భంగం కలిగిస్తుందని ఆ సంస్థలు ఆరోపించాయి. ముఖ్యంగా సందేశ సృష్టికర్త జాడను బహిర్గతం చేసే (ట్రేసబిలిటీ) విధానానికి సంబంధించిన నిబంధనను సవరించాలని డిమాండ్‌ చేశాయి. ఈ క్రమంలోనే ఈ సెక్షన్‌ను సవాల్‌ చేస్తూ వాట్సప్‌, ఫేస్‌బుక్‌ సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీనిపై దిల్లీ హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా వాట్సప్‌ తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. ‘‘మా ప్లాట్‌ఫామ్‌లో సందేశాల భద్రత కోసం ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ (end-to-end encryption) విధానాన్ని అవలంబిస్తున్నారు. ఆ గోప్యత హామీ ఉన్నందువల్లే కోట్లాది మంది యూజర్లు దీన్ని వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఈ రూల్‌తో మేం బలవంతంగా ఆ ఎన్‌క్రిప్షన్‌ను బ్రేక్‌ చేయాల్సి ఉంటుంది. అలా చేయాలని మీరు చెబితే మేం భారత్‌ నుంచి వెళ్లిపోతాం’’ అని కోర్టుకు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z