Agriculture

కేజీ కుంకుమ పువ్వు ₹5లక్షలు-BusinessNews-May 11 2024

కేజీ కుంకుమ పువ్వు ₹5లక్షలు-BusinessNews-May 11 2024

* కుంకుమ పువ్వు (Saffron).. సుగంధ ద్రవ్యాల రారాణి. వంటల నుంచి ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల్లోను దీని వినియోగం ఎక్కువే. కశ్మీర్‌ (Jammu and Kashmir)లో ‘ఎర్ర బంగారం’ అంటూ ముద్దుగా పిలుచుకునే దీనికి ఇప్పుడు యుద్ధం సెగ తగిలింది. సరిపడినంత సరఫరా లేకపోవడంతో దేశంలో కుంకుమ పువ్వు ధరకు రెక్కలొచ్చాయి. రిటైల్‌ మార్కెట్‌లో కేజీ ధర దాదాపు రూ.5 లక్షలు పలుకుతోంది. ప్రపంచంలో పండే కుంకుమ పువ్వులో దాదాపు 90 శాతం ఇరాన్‌లోనే పండిస్తున్నారు. అక్కడ ఏటా దాదాపు 430 టన్నులు పండించి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే, ఇజ్రాయెల్‌-గాజా యుద్ధంతో గత కొన్ని నెలలుగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇరాన్‌ నుంచి కుంకుమపువ్వు సరఫరా భారీగా తగ్గిపోయింది. దీంతో దేశీయంగా దీని ధర విపరీతంగా పెరిగింది. మన దేశంలో కుంకుమపువ్వును అత్యధికంగా జమ్మూకశ్మీర్‌లో పండిస్తారు. ఇరాన్‌ నుంచి దిగుమతి తగ్గడంతో దేశీయ వర్తకులు, ఉత్పత్తిదారులకు గిరాకీ పెరిగింది. ఫలితంగా ధర కొండెక్కింది. హోల్‌సేల్‌లో 20శాతం, రిటైల్‌లో 27శాతం మేర ధర పెరిగినట్లు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ముందు హోల్‌సేల్‌లో కిలో కుంకుమ పువ్వు ధర రూ.2.8 – రూ.3 లక్షల వరకు ఉండగా.. ఇప్పుడు అది రూ.3.5-3.6 లక్షలకు చేరింది. ఇక రిటైల్‌ మార్కెట్‌లో అయితే ఏకంగా రూ.4.95 లక్షలు పలుకుతోంది. అంటే దాదాపు 70 గ్రాముల పసిడి ధరకు సమానం. మన దేశంలో ఏటా 60-65 టన్నుల కుంకుమ పువ్వుకు డిమాండ్‌ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పండే దానితో పోలిస్తే కశ్మీరీ కుంకుమ పువ్వు ఇంకాస్త ప్రత్యేకమే. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా దీని ఉత్పత్తి తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం మన దేశంలో కేవలం 3 టన్నుల కంటే తక్కువే దీన్ని ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో దిగుమతుల మీదే ఆధారపడాల్సి వస్తోందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు అవి తగ్గడంతో దేశీయంగా ధర పెరిగిందని పేర్కొన్నారు.

* ఆదాయ పన్ను విభాగం నుంచి పన్ను చెల్లింపుదారులకు అప్పుడప్పుడూ నోటీసులు అందుతుంటాయి. ఐటీ పత్రాల్లో సమస్య ఉందనో, బకాయిలు చెల్లించాలనో నోటీసులు అందుతుంటాయి. కొన్నిసార్లు ఇలాంటి నోటీసులకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఐటీ శాఖ నుంచి సమాచారం కూడా అందుతుంటుంది. తాజాగా ఈ నోటీసులకు సంబంధించి ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌లో ఆదాయపు పన్ను శాఖ కొత్త సదుపాయం తీసుకొచ్చింది. ఆ శాఖ పంపే నోటీసులు, లెటర్లు, ఇంటిమేషన్లు అన్నింటినీ ఒకేచోట చూసుకునేలా.. ఇ-ప్రొసీడింగ్స్‌ అనే ట్యాబ్‌ను తీసుకొచ్చింది. ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌లో రిజిస్టరయిన యూజర్లు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు గానీ, అసెసింగ్‌ ఆఫీసర్లు గానీ పంపించిన నోటీసులు, సమాచారం ఇందులో కనిపిస్తుంది. సాధారణంగా ఐటీ రిటర్నుల్లో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు గుర్తిస్తే సెక్షన్‌ 139 (9) సెక్షన్‌ కింద నోటీసు జారీ చేస్తారు. క్రితం ఏడాది పన్ను చెల్లింపు డిమాండ్‌లు ఏమైనా బకాయి ఉంటే సెక్షన్‌ 245 కింద నోటీసులు ఇస్తారు. వీటితో పాటు సెక్షన్‌ 143(1), సెక్షన్‌ 154 కింద ఏవైనా నోటీసులు అందినా ఇ-ప్రొసీడింగ్స్‌ ట్యాబ్‌లో కనిపిస్తాయి.

* ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) వేగంగా అన్ని పరికరాల్లోకి చేరుతోంది. ఇప్పటికే కొన్ని దిగ్గజ సంస్థలు తమ పరికరాల్లో ఏఐ సాంకేతికతను తీసుకొచ్చాయి. అనేక కంపెనీలు కొత్తగా లాంచ్‌ చేసిన మొబైల్స్‌లో ఏఐ ఫీచర్లను అందించాయి. తాజాగా ప్రముఖ టెక్‌ సంస్థ యాపిల్‌ (Apple) కూడా కొత్తగా తీసుకురానున్న ఐఓఎస్‌ 18లో ఏఐ ఆధారిత ఫీచర్లను జోడించేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా చాట్‌జీపీటీ (ChatGPT) సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI)తో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ ఏడాది చివరికి యాపిల్‌ ఆవిష్కరించనున్న ఐఫోన్ 16 సిరీస్‌లో జనరేటివ్ ఏఐ ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. మార్కెట్లోకి విడుదలైన గూగుల్ పిక్సెల్ 8 (Pixel 8), శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 (Galaxy S24) సిరీస్‌లు ఏఐ ఆధారిత టూల్స్, యాప్‌లతో వచ్చాయి. యాపిల్‌ మాత్రం ఈ విషయంలో వెనుకంజలో ఉంది. ఐఓఎస్‌ 18 (iOS 18)తో ఆ లోటు తీర్చనుంది. దీని కోసం ఓపెన్‌ ఏఐతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ తాజా ఒప్పందం దాదాపుగా ఖరారైనట్లు విషయం తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ బ్లామ్‌బర్గ్‌ ఓ కథనాన్ని పేర్కొంది.

* టాటా మోటార్స్‌, జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.17,528.59 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.5,496.04 కోట్లతో పోలిస్తే ఇది మూడు రెట్లకు పైగా ఎక్కువ. వాహన విభాగాలన్నీ బలమైన పనితీరు కనబరచాయి. ముఖ్యంగా బ్రిటన్‌లోని అనుబంధ సంస్థ జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) రాణించడంతో, లాభంలో గణనీయ వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో టాటా మోటార్స్‌ మొత్తం ఏకీకృత ఆదాయం రూ.1,05,932.35 కోట్ల నుంచి రూ.1,19,986.31 కోట్లకు పెరిగింది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో జేఎల్‌ఆర్‌ మొత్తం ఆదాయం 11% పెరిగి 7.9 బిలియన్‌ పౌండ్లకు చేరింది. నికర లాభం 259 మిలియన్‌ పౌండ్ల నుంచి 1.4 బిలియన్‌ పౌండ్లకు పెరిగింది.

* బంగారం ధర కొంతకాలంగా భారీగా పెరిగింది. రెండేళ్ల క్రితం బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి ఆకర్షణీయ లాభాలు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి పెరిగిపోవడం, అధిక ద్రవ్యోల్బణంతో వివిధ దేశాలు ఇబ్బందులు పడుతూ ఉండటం, వివిధ దేశాల మధ్య ఉద్రిక్తతలు, వాణిజ్య అవరోధాల వంటివి బంగారం ధర అనూహ్యంగా పెరిగేందుకు కారణమయ్యాయి. దీనికి తోడు మనదేశం, చైనా సహా మరికొన్ని దేశాల కేంద్ర బ్యాంకులు బంగారాన్ని పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. ఇందువల్ల బంగారానికి గిరాకీ పెరిగింది. బంగారం ధర (24 క్యారెట్లు- 10 గ్రాములు) గత ఏడాది రూ.62,000 కాగా, ఇప్పుడు రూ.75,000 స్థాయికి పెరిగింది. బంగారంపై మదుపు చేసిన వారికి దాదాపు 20% లాభాలు వచ్చాయి. వెండి ధర ప్రస్తుతం రూ.82,000 వద్ద కనిపిస్తోంది. ఇక్కడి నుంచి వెండి ధరా ఆకర్షణీయంగా పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘త్వరలోనే కిలో వెండి ధర రూ.1,00,000 పలుకుతుంది’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఎంఓఎఫ్‌ఎస్‌ఎల్‌) తాజా నివేదికలో పేర్కొంది. మదుపరులు వెండిపై పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన తరుణమని వివరించింది. ధర తగ్గిన ప్రతిసారీ వెండి కొనుగోలు చేయొచ్చని అభిప్రాయపడింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z