Politics

ఏపీలో భారీగా పోలింగ్-NewsRoundup-May 13 2024

ఏపీలో భారీగా పోలింగ్-NewsRoundup-May 13 2024

* ఓటరు జాబితా విషయంలో ఈ సారి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌కుమార్‌ మీనా తెలిపారు. సోమవారం సాయంత్రం పోలింగ్‌ సమయం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల దాడులు జరిగాయని, పల్నాడు, తెనాలి, మాచర్ల నియోజకవర్గాల్లో జరిగిన ఘటనలపై చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ‘‘ఈవీఎంలకు సంబంధించి కొన్ని సమస్యలు వచ్చాయి. 275 బీయూలు, 217 సీయూలు, 600 వీవీప్యాట్‌లకు సంబంధించి సమస్యలు తలెత్తాయి. పోలింగ్‌ కేంద్రాల వద్ద 20వేల యంత్రాలు అదనంగా ఉంచాం. పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగే అవకాశముందని ఇంటెలిజెన్స్‌ నుంచి ముందే సమాచారం అందింది. అనంతపురం, పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో ఘటనలపై సమాచారం ఉంది. అందుకే, ముందుగానే తగిన ఏర్పాట్లు చేశాం. మాచర్ల కేంద్రంలో ఈవీఎంలు దెబ్బతిన్నాయి. ఇంజినీర్లు యంత్రాలను పరిశీలించి.. డేటా వస్తుందని చెప్పారు. ఇదే నియోజకవర్గంలో 8 కేంద్రాల్లో యంత్రాలు మార్చి మళ్లీ పోలింగ్‌ నిర్వహించాం. ఎక్కడా రీపోలింగ్‌ నిర్వహించాల్సిన అవసరం లేదు. రాత్రి 10గంటలకు పోలింగ్‌ పూర్తయ్యే అవకాశముంది. ఈసారి పోలింగ్‌ శాతం బాగా పెరిగింది. సాయంత్రం 5గంటల వరకు 68 శాతం పోలింగ్‌ జరిగింది. తుది పోలింగ్‌ వివరాలు పరిశీలించిన తర్వాత వెల్లడిస్తాం’’ అని ఎంకే మీనా తెలిపారు.

* రాష్ట్రం ఓటెత్తింది.. ఎండా వానను సైతం జనం లెక్కచేయలేదు.. పలుచోట్ల అధికార పార్టీ హింసాత్మక దాడులకు సైతం వెరవకుండా ఓటర్లు చైతన్యంతో తమ తీర్పును నిక్షిప్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చెదురుమదురు హింసాత్మక ఘటనల మధ్య సాయంత్రం 6గంటలకే పోలింగ్‌ సమయం ముగిసినా అప్పటికే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకొనేందుకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. దీంతో వీరందరికీ ఓటు వేసేందుకు ఈసీ అవకాశం కల్పించింది. సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 68 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ఇంకా దాదాపు 3,500కు పైగా పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలింగ్‌ కొనసాగుతోంది. రాత్రి 10గంటల వరకు ఈ పోలింగ్‌ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు ఎన్నికల సంఘం అధికారులు పేర్కొంటున్నారు.

* పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం తంగెడలో వైకాపా శ్రేణులు నాటు బాంబులు, పెట్రోల్‌ సీసాలతో దాడులకు తెగబడ్డారు. పోలింగ్‌ ముగిసే సమయంలో ఓటు విషయంలో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. 6గంటల తర్వాత కూడా పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటర్లు బారులు తీరి ఉన్నారు. ఓటింగ్‌ శాతం పెరిగితే తమకు నష్టం జరగుతుందేమోనన్న భయంతో వైకాపా మూకలు నాటు బాంబులతో దాడులకు దిగాయి. మరో వైపు రాళ్ల వర్షం కురిపించడంతో ఓటర్లు భయాందోళనకు గురై పోలింగ్‌ కేంద్రం నుంచి పరుగులు తీశారు.

* అణుబాంబు పడిన ప్రదేశంలో ఉంటే మనుషులే ఆవిరైపోతారంటారు. రోజుల వ్యవధిలోనే రెండు అణు బాంబుల దాడిలో గాయపడి సుదీర్ఘకాలం జీవించారు జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి. ఒక దాడిలో బతికి మరో చోటుకు పారిపోతే.. అక్కడికి మృత్యువు తరుముకొంటూ వచ్చింది. అతడిపేరు త్సుటోము యమగుచి. 1945 ఆగస్టు 6న హిరోషీమాపై తొలి అణు దాడి జరిగే సమయానికి అతడి వయసు 29 ఏళ్లు. నేవల్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఆ రోజు మూడు నెలల పాటు బిజినెస్‌ ట్రిప్‌నకు బయల్దేరాల్సి ఉంది. ఉదయం 8.15 సమయంలో తన కంపెనీకి చెందిన షిప్‌యార్డ్‌ వద్దకు వెళ్లాడు. అతడికి హఠాత్తుగా గాల్లో అమెరికన్‌ బాంబర్‌ విమానం కనిపించింది. అది పారాచూట్‌ కట్టి ఏదో వస్తువును కిందకు జారవిడిచింది. అదేంటో గమనించే లోపే భారీ వెలుగుతో కూడిన అగ్నిగోళం కనిపించింది.

* బాలీవుడ్‌ తారలు సోనాక్షి సిన్హా (Sonakshi Sinha), మనీషా కొయిరాలా (Manisha Koirala), రిచా చద్ధా, సంజీదా షేక్‌, షర్మిన్‌ సెగల్‌, అదితి రావు హైదరి (Aditi Rao Hydari) ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్‌ ‘హీరామండి’ (Heeramandi). ప్రచారంలో భాగంగా టీమ్‌ ‘ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో’లో పాల్గొని సందడి చేసింది. ఈ క్రమంలోనే పెళ్లి ప్రస్తావన రాగా సోనాక్షి నవ్వులు పంచారు. ‘అలియా భట్‌, కియారా అడ్వాణి కూడా మ్యారేజ్‌ చేసుకున్నారు?’ అని సోనాక్షిని ఉద్దేశిస్తూ హోస్ట్‌ కపిల్‌ శర్మ అడిగారు. దానికి ఆమె బదులిస్తూ.. ‘వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు నేను ఎంతగా ఎదురుచూస్తున్నానో మీకు తెలుసు కదా’ అని అన్నారు. ‘‘ఎప్పుడో ప్రారంభించిన హీరామండి’ చిత్రీకరణ పూర్తయింది. ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ, నాకింకా పెళ్లి కాలేదు (నవ్వుతూ). నేను తప్ప ఈ సిరీస్‌లో కీలక పాత్రలు పోషించిన వారంతా వివాహితులే’’ అని చమత్కరించారు.

* ఏపీలో ఓటేసేందుకు హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు వెళ్లి తిరిగిపయనమవుతున్నవారికి గుడ్‌న్యూస్‌! వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వేశాఖ అధికారులు ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. విశాఖపట్నం-సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య (08589/08590) మంగళ, బుధవారాల్లో ఈ ప్రత్యేక రైలు నడపనున్నట్లు వెల్లడించారు. 08589 నంబర్‌ రైలు మంగళవారం సాయంత్రం 4.15గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.15గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోనుంది. అలాగే, బుధవారం ఉదయం 10.30గంటలకు సికింద్రాబాద్‌లో మళ్లీ బయల్దేరనున్న ఈ ప్రత్యేక రైలు (08590) అదేరోజు రాత్రి 11.30గంటలకు విశాఖపట్నం చేరుకోనుంది.

* దాచేపల్లిలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. పెట్రోల్‌ బాంబులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 2 షాపులు, నాలుగు బైక్‌లు దగ్ధమయ్యాయి. పలువురు గాయపడ్డారు. పల్నాడు జిల్లా చాగంటివారిపాలెంలో కన్నా లక్ష్మీనారాయణ దౌర్జన్యానికి దిగారు. పోలింగ్‌ బూత్‌ దగ్గర పెద్ద సంఖ్యలో మహిళలు వేచి ఉండగా, 20 మంది రౌడీలతో పోలింగ్‌ బూత్‌కు వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ.. మహిళలను వెనక్కి పంపి పోలింగ్‌ ఆపాలంటూ జూలుం ప్రదర్శించారు.

* పెద్ద సంఖ్యలో పోలింగ్‌ నమోదైంది: ఏపీ సీఈవో. సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేశాం. కొన్ని ఘర్షణలు జరిగినా కట్టడి చేశాం. పల్నాడు జిల్లాలో 12 చోట్ల ఘర్షణలు జరిగాయి. పల్నాడులో ఒక చోట ఈవీఎంను ధ్వంసం చేశారు. ఈవీఎంలోని చిప్‌లో డేటా భద్రంగా ఉంది. ఈవీఎంలను మార్చి మళ్లీ పోలింగ్‌ ప్రారంభించాం. కొన్ని చోట్ల ఇంకా పోలింగ్‌ కొనసాగుతోంది. 11 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఎక్కడా రీ పొలింగ్‌ అవసరం పడలేదు. కొన్ని ఘర్షణలు జరిగినా కట్టడి చేశాం. ఇప్పటివరకు 75 శాతం పోలింగ్‌ నమోదైంది. స్ట్రాంగ్‌ రూమ్‌లోకి ఈవీఎంల తరలింపు జరుగుతుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z