Kids

తెలంగాణలో పెరుగుతున్న చిన్నారుల ఆశ్లీల దృశ్యాల కేసులు-CrimeNews-May 18 2024

తెలంగాణలో పెరుగుతున్న చిన్నారుల ఆశ్లీల దృశ్యాల కేసులు-CrimeNews-May 18 2024

* ఖమ్మం జిల్లాలో వేకువజామున ఘోరం జరిగింది. ఓ వృద్ధురాలు, ఆమె ఇద్దరు మనవరాళ్లు దారుణ హత్యకు గురయ్యారు. ఆ వృద్ధురాలి తనయుడు కనిపించకుండా పోవడంతో అతనే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం జరిగింది. పిట్టల పిచ్చమ్మ(60), ఆమె మనవరాళ్లు నీరజ(10), ఝాన్సీ(6)లు హత్యకు గురయ్యారు. శనివారం ఉదయం రక్తపు మడుగులో ఉన్న ఇద్దరినీ గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ ఇద్దరు చిన్నారుల తండ్రి వెంకటేశ్వర్లే ఈ హత్యలు చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండేళ్ల కిందట ఆ చిన్నారుల తల్లి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. అయితే ఆమెను కూడా భర్తే వెంకటేశ్వర్లే హత్య చేసి ఉంటాడని పోలీసులు వద్ద స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో వెంకటేశ్వర్లు ఆచూకీ కోసం పోలీసులు యత్నిస్తున్నారు.

* ఆప్‌ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో అరవింద్‌ కేజ్రీవాల్‌ అనుచరుడు బిభవ్‌ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. సోమవారం కేజ్రీవాల్‌ నివాసానికి వెళ్లిన తనపై విభవ్‌ దాడికి పాల్పడ్డాడని స్వాతి మలివాల్‌ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ సీఎం నివాసం నుంచే అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నేరుగా సివిల్‌ లైన్‌ పోలీస్‌ స్టేషన్‌కు ఇంటరాగేషన్‌ కోసం తరలించారు. అంతకు ముందు సీఎం కేజ్రీవాల్‌ నివాసంలో సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ నిర్వహించారు పోలీసులు. అయితే.. ఈ కేసులో పూర్తిగా సహకరిస్తామని అధికారులకు తాము మెయిల్‌ పంపించామని, అయినా కూడా పోలీసుల నుంచి బదులేం లేదని విభవ్‌ లాయర్‌ మీడియాకు వెల్లడించారు.

* అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు సైతం ఉండడం గమనార్హం. పెళ్లి షాపింగ్‌ కోసం హైదరాబాద్‌ వెళ్లి తిరిగొస్తుండగా ఈ ఘోరం జరిగింది. అనంతపురం రాణినగర్‌కు చెందిన షేక్‌ సురోజ్‌ బాషా వివాహం ఈ నెల 27న జరగనునంది. పెళ్లి వస్త్రాల కొనుగోలు కోసం కుటుంబ సభ్యులతో హైదరాబాద్‌ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గుత్తికి 4 కిలోమీటర్ల దూరంలో రాయల్‌ దాబా వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అదే సమయంలో అనంతపురం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ.. కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనాస్థలిలోనే మృతి చెందారు. మరో ఇద్దరు గుత్తి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సంఘటనపై గుత్తి సీఐ వెంకట్రామిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్‌ నిద్ర మత్తే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మృతులను అల్లీ సాహెబ్‌ (58), షేక్‌ సురోజ్‌బాషా(28) మహ్మద్‌ అయాన్‌(6), అమాన్‌(4), రెహనాబేగం(40)గా గుర్తించారు.

* ‘‘ హైదరాబాద్‌లో ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా మైనర్ల అశ్లీల వీడియో(ఛైల్డ్‌ సెక్సువల్‌ అబ్యూజివ్‌ మెటీరియల్‌- సీశామ్‌) షేర్‌ అయ్యింది. ఛైల్డ్‌ పోర్నోగ్రఫీపై నిఘా ఉంచే అమెరికా నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిస్సింగ్‌ అండ్‌ ఎక్స్‌ప్లాయిటెడ్‌ చిల్డ్రన్‌(నెక్‌మెక్‌) ఈ విషయాన్ని గుర్తించింది. ఆ వీడియో గురించి ఆరా తీసి జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్‌సీఆర్‌బీ)కు సమాచారం అందించింది. అది తెలంగాణ రాష్ట్ర సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్‌సీఎస్‌బీ)ను అప్రమత్తం చేసింది. ఇక్కడి అధికారులు ప్రాథమిక దర్యాప్తు చేసి హైదరాబాద్‌ బండ్లగూడ హఫీజ్‌బాబానగర్‌కు చెందిన వ్యక్తి ఫోన్‌ నుంచి ఆ వీడియో బయటకు వచ్చినట్లు తేల్చింది. దీంతో ఇటీవలే అతనిపై కేసు నమోదు చేశారు.’’ రాష్ట్రంలో ఛైల్డ్‌ పోర్నోగ్రఫీ చాపకింద నీరులా పాకుతోంది. పిల్లల అశ్లీల దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేస్తున్న ఉదంతాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో బండ్లగూడ, యూసుఫ్‌గూడ రహమత్‌నగర్‌లలో బహిర్గతం కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ తరహా ఉదంతాలపై ఆయా యూనిట్ల పోలీసులను టీఎస్‌సీఎస్‌బీ అప్రమత్తం చేస్తోంది. సాధారణంగా ఈ బాలల అశ్లీల వీడియోలపై ప్రపంచవ్యాప్తంగా నెక్‌మెక్‌ నిఘా ఉంచుతుంది. ఎప్పటికప్పుడు సైబర్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ ఐపీ అడ్రస్‌ల ఆధారంగా ఆయా దేశాలను అప్రమత్తం చేస్తుంది. అదే క్రమంలో భారత్‌ నుంచి అలాంటి వీడియోలు వ్యాప్తి జరిగినట్లు తేలితే ఎన్‌సీఆర్‌బీకి తరచూ టిప్‌లైన్స్‌(నివేదికలు) పంపుతోంది. ఎన్‌సీఆర్‌బీ ఆయా రాష్ట్రాలకు వాటిని చేరవేస్తోంది. గతంలో తెలంగాణకు సంబంధించిన సమాచారాన్ని సీఐడీకి పంపించేది. గత జూన్‌ నుంచి టీఎస్‌సీఎస్‌బీ ఈ కేసుల్ని పర్యవేక్షిస్తోంది. ఈ బ్యూరోకు ఈ ఏడాది కాలంలో 42 టిప్‌లైన్స్‌ అందడం గమనార్హం. ఇందులో గత నెల రోజుల్లో వచ్చినవే 12 ఉన్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z