ScienceAndTech

దేవాలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి-NewsRoundup-May 18 2024

దేవాలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి-NewsRoundup-May 18 2024

* ‘సోషల్‌ మీడియాలో నేను పెట్టే ప్రతీ పోస్ట్‌పై స్పందిస్తూ ఎప్పుడూ నా మాజీ భర్తతో నన్ను పోలుస్తారెందుకు?’ అంటూ నటి రేణూదేశాయ్‌ (Renu Desai) అసహనం వ్యక్తంచేశారు. ఓ నెటిజన్ చేసిన కామెంట్‌పై ఆమె ఇలా రియాక్ట్‌ అయ్యారు. జంతు సంరక్షణ కోసం ఆమె ఇటీవల విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. ఆ విషయమై సదరు నెటిజన్‌ ‘మా పవన్‌ కల్యాణ్‌ అన్నయ్యలా గోల్డెన్‌ హార్ట్‌’ అని రేణు పోస్ట్‌కు కామెంట్‌ పెట్టాడు. దీనికి ఆమె బదులిస్తూ.. ‘‘పదేళ్ల వయసు నుంచి నేను జంతు సంరక్షణ కోసం నావంతు సాయం చేస్తున్నా. దానికి నా మాజీ భర్తతో సంబంధం లేదు. జంతువులపై నేను చూపించే ప్రేమ, కేర్‌ ఆయనకు లేవు. దయచేసి నేను చేసే పనుల గురించి పోస్ట్‌ పెడితే.. ఆయన ప్రస్తావన తీసుకొస్తూ కామెంట్‌ చేయకండి’’ అని విజ్ఞప్తి చేశారు.

* బుల్లితెర నటుడు చందు ఆత్మహత్యపై ఆయన భార్య శిల్ప స్పందించారు. ఐదు సంవత్సరాలుగా పవిత్రతో చందు సహజీవనం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. త్రినయిని సీరియల్ ప్రాజెక్టు వచ్చినప్పటి నుంచి వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగిందని చెప్పారు. చందు తన వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని.. ప్రస్తుతం తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని వివరించారు. గత ఐదు సంవత్సరాలుగా పవిత్ర మాయలో పడి తమను పట్టించుకోవడం మానేశాడని, ఇంటికి కూడా రాలేదని ఆమె వెల్లడించారు.

* పల్నాడు జిల్లా కలెక్టర్‌గా లట్కర్‌ శ్రీకేశ్‌ బాలాజీతో పాటు మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు ఎస్పీగా మల్లికా గార్గ్‌, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్‌, అనంతపురం ఎస్పీగా గౌతమి సాలిని నియమించింది. ఏపీలో పోలింగ్‌ రోజు, ఆ తర్వాత చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్‌ జవహర్‌ రెడ్డి, డీజీపీతో భేటీ తర్వాత అసహనం వ్యక్తం చేస్తూ మూడు జిల్లాలకు చెందిన కీలక ఉన్నతాధికారులపై కొరడా ఝుళిపించింది. పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలపై సస్పెన్షన్‌ వేటు వేసిన ఈసీ.. ఇద్దరినీ వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్‌, డీజీపీలను ఆదేశించింది. అలాగే, పల్నాడు జిల్లా కలెక్టర్‌, తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలకు ఆదేశించిన విషయం తెలిసిందే.

* పోలింగ్‌ రోజున కడప గౌస్‌నగర్‌లో ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడులు జరిగిన ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న సీఐ, ఐదుగురు ఎస్‌ఐలకు ఛార్జ్‌ మెమో జారీ జారీ చేశారు. కడప వన్‌టౌన్‌ సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్‌ఐలు రంగస్వామి, తిరుపాల్‌ నాయక్‌, మహమ్మద్‌ రఫీ, ఎర్రన్న, అలీఖాన్‌కు ఛార్జ్‌ మెమోలు పంపించారు. వీరందరిపైనా శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

* ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) సాంకేతికత వినియోగం నానాటికీ పెరుగుతోంది. ఈ క్రమంలోనే అభ్యర్థుల్లో ఉద్యోగాలపై ఆందోళన నెలకొంది. దీంతో ఉద్యోగులకు సూచనలు అందించారు గూగుల్‌(Google) సీఈఓ సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai). ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రోట్‌ లెర్నింగ్‌ గురించి మాట్లాడారు. అలానే తనకు ఇష్టమైన భారతీయ వంటకాల గురించి పంచుకున్నారు టాప్‌ టెక్‌ సంస్థలైన FAANG (ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్) సంస్థల్లో ఇంటర్వ్యూల్లో విజయం సాధించడమెలాగో యువకులకు సలహా ఇవ్వాలని ఇంటర్వ్యూయర్‌ పిచాయ్‌ని కోరారు. దీంతో ‘‘రోట్‌ లెర్నింగ్‌(బట్టీ పట్టి చదవడం)’’.. అనే అంశాన్ని పిచాయ్‌ ప్రస్తావించారు. విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా నిజమైన విజయం వస్తుందని తాను బలంగా నమ్ముతానన్నారు. అదే పద్ధతినే ఇప్పటి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు పాటించాలన్నారు. ఏదైనా అంశాన్ని తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించేందుకు ‘‘3 ఇడియట్స్‌’’లోని ఓ సన్నివేశాన్ని గుర్తుచేశారు. అందులో మోటార్‌ ఎలా పనిచేస్తుందో నిర్వచించమని ఓ విద్యార్థిని అడగ్గా.. కంఠస్థం చేసిన డెఫినేషన్‌ చెప్పకుండా సాధారణ పదాలతో యంత్రం అంటే ఏమిటో వివరిస్తాడు. విషయాన్ని గ్రహించడమంటే ఇదే అని అన్నారు.

* జగన్‌ అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకే తనను కిడ్నాప్‌ చేసి దాడి చేశారని ఎన్‌ఆర్‌ఐ వైద్యుడు లోకేశ్‌ కుమార్‌ తెలిపారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో ఉన్న తనను సీఎం భద్రతా సిబ్బంది గుర్తుపట్టి అకారణంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛాతి నొప్పి వస్తోందని చెప్పినా పట్టించుకోకుండా హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికన్‌ పౌరుడైన తనపై పోలీసులు, అధికారులు దౌర్జన్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించి, అమానుషంగా ప్రవర్తించిన పోలీసులపై ప్రైవేటు కేసులు పెట్టి.. వారిపై చర్యలు తీసుకునే వరకు న్యాయ పోరాటం చేస్తానని లోకేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. సీఎం జగన్‌ విదేశీ పర్యటనకు వెళ్తున్న సమయానికి కొన్ని గంటల ముందు గన్నవరం విమానాశ్రయం వద్ద డాక్టర్‌ లోకేశ్‌ కుమార్‌ను పోలీసులు గుర్తించి నిర్బంధించారు. వైకాపా పాలన, అవినీతి, అక్రమాలు, మనీలాండరింగ్‌ అంశాలను ప్రధానంగా ఉటంకిస్తూ డాక్టర్‌ లోకేశ్‌ పలు వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇటీవల అమెరికా నుంచి రాష్ట్రానికి వచ్చిన ఆయన తిరిగి అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఎయిర్‌ ఇండియా విమానంలో దిల్లీకి వెళ్లి.. అక్కడి నుంచి అమెరికా తిరుగు ప్రయాణం అయ్యేందుకు టికెట్‌ ప్రింటింగ్‌ కోసం గన్నవరం విమానాశ్రయానికి వెళ్లగా..పోలీసులు నిర్బంధించారని లోకేశ్‌ తెలిపారు. ఆ తర్వాత వివిధ ప్రాంతాలు తిప్పారని, ఛాతీపై బలంగా కొట్టారని ఆరోపించారు. ఈ ఘటనపై అమెరికా ఎంబసీతో పాటు ప్రధాని కార్యాలయం, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ఢోబాల్‌ తదితరులకు సమాచారం ఇచ్చినట్టు చెప్పారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.

* జూన్ 2 నుంచి (భారత కాలమానం ప్రకారం) టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) ప్రారంభం కానుంది. జూన్ 9న పాకిస్థాన్‌తో గ్రూప్‌ స్టేజ్‌లో టీమ్‌ఇండియా (IND vs PAK) తలపడనుంది. అయితే, ఆ ఒక్కసారే కాకుండా టైటిల్‌ పోరు దాయాదుల మధ్యే జరగాలని.. ఆ మ్యాచ్‌ వీక్షిస్తే అద్భుతంగా ఉంటుందని భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్‌ వ్యాఖ్యానించాడు. అమెరికా-విండీస్‌ సంయుక్త ఆతిథ్యంలో మెగా టోర్నీ జరగనుంది. ‘‘టాప్‌-4లో న్యూజిలాండ్‌ దక్కించుకుంటుంది. ఐసీసీ ఈవెంట్లలో కివీస్‌ను తక్కువగా అంచనా వేయొద్దు. ఇక విండీస్‌ తమ స్వదేశంలో టోర్నీ జరుగుతుంది. ఆ జట్టులోని ప్రతీ ఆటగాడూ భీకరమైన ఫామ్‌లో ఉన్నారు. అందుకే అత్యంత ప్రమాదకరమైన టీమ్‌. ఇక ఆసీస్‌, పాకిస్థాన్‌లో ఒక జట్టే నాకౌట్‌కు వస్తుంది. ఒకవేళ పాక్‌ వస్తే మాత్రం ఫైనల్‌ లేదా సెమీస్‌లో భారత్‌తోనే ఢీకొట్టే అవకాశం ఉంది. నాకు మాత్రం తుది పోరును ఇరు జట్ల మధ్యే చూడాలని ఉంది. ఇప్పటివరకు ఐసీసీ టోర్నీల్లో మనదే ఆధిపత్యం. మరోసారి అదే కొనసాగుతుందని భావిస్తున్నా’’ అని కైఫ్‌ వివరించాడు.

* ఎన్నికల సమయంలో ప్రజల నుంచి కోడ్‌ ఉల్లంఘనలను తెలుసుకోవడానికి ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ‘సీ-విజిల్‌ (C-Vigil)’ యాప్‌నకు విపరీతంగా తాకిడి పెరిగింది. కేవలం రెండు నెలల్లోనే దీనికి 4.24 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ (Election Commission) తాజాగా వెల్లడించింది. వీటిలో ఇప్పటికే మెజార్టీ ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపింది. ‘‘మార్చి 16న ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పటినుంచి ఇప్పటివరకు కోడ్‌ ఉల్లంఘనలపై (Model Code of Conduct) 4,24,317 ఫిర్యాదులు అందాయి. ఇందులో 4,23,908 ఫిర్యాదులను పరిష్కరించాం. దాదాపు 89 శాతం కేసులను 100 నిమిషాల్లోనే ఛేదించాం. ఇంకా 409 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి’’ అని ఈసీ వెల్లడించింది. నమోదైన కేసుల్లో అత్యధికం (3.24 లక్షలు) అక్రమ బ్యానర్లు, పోస్టర్లపైనే వచ్చాయని తెలిపింది.

* రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ (Vladimir Putin) చైనా పర్యటనపై అమెరికా స్పందించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ (Xi Jinping)ను మర్యాదపూర్వకంగా కలిసిన పుతిన్‌ ఆయన్ను ఆలింగనం చేసుకోవడంపై వైట్‌హౌస్‌ వ్యంగ్యాస్ర్తాలు సంధించింది. ఇరునేతలు కౌగిలించుకున్నంత మాత్రాన ఆ దేశాల మధ్య సంబంధాల్లో పురోగతి సాధిస్తుందని అనిపించడం లేదని వైట్‌హౌస్‌ ప్రతినిధి జాన్ కిర్బీ ఎద్దేవా చేశారు. ‘‘ఆ దేశాధినేతలిద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారో, లేక ఇతరుల దృష్టిని ఆకర్షించేందుకు ఇలా చేశారో ఆ జెంటిల్‌మెన్లకే (పుతిన్‌, జిన్‌పింగ్‌లను ఉద్దేశిస్తూ) వదిలేస్తున్నా. దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయాలనుకోవడం లేదు. కౌగిలించుకున్నంత మాత్రాన దేశాలు పురోగతి సాధించలేవు. అందుకే ఈ పర్యటన మాకు ఆశ్చర్యంగా అనిపించడం లేదు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, దీని ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి’’ అని కిర్బీ విమర్శలు గుప్పించారు. ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో రష్యాకు చైనా సాంకేతిక సాయం చేయడంపై అమెరికా మరోసారి ఆందోళన వ్యక్తంచేసింది.

* యువత ప్రార్థనా స్థలాలకు రావడానికి ఆసక్తి చూపించాలంటే దేవాలయాల్లో గ్రంథాలయాలను ఏర్పాటుచేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO ) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ (Somanath) అన్నారు. ఈ విధంగా గ్రంథాలయాల ఏర్పాటుతో యువతను ఆకర్షించవచ్చని ఆయన సలహా ఇచ్చారు. తిరువనంతపురంలోని శ్రీ ఉడియన్నూర్ దేవి ఆలయం సభ్యులు సోమనాథ్‌ను సన్మానించారు. ఇస్రో మాజీ ఛైర్మన్ జి.మాధవన్ నాయర్ ఆయనకు అవార్డు ప్రదానం చేశారు. అనంతరం సోమనాథ్‌ మాట్లాడుతూ ‘ఈ అవార్డు ప్రదానోత్సవానికి యువకులు పెద్దసంఖ్యలో వస్తారని నేను ఊహించాను. కానీ వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఆలయ నిర్వాహకులు వారిని దేవాలయాల వైపు ఆకర్షించడానికి కృషి చేయాలి. ఇందుకోసం దేవాలయాల్లో లైబ్రరీలను ఎందుకు ఏర్పాటుచేయకూడదు?’’అని ఆయన ప్రశ్నించారు. ఆలయాలు కేవలం వృద్ధులు వచ్చి దేవుడిని తలుచుకునేవిగానే కాకుండా సమాజాన్ని మార్చే ప్రభావవంతమైన ప్రదేశాలుగా మారాలని ఆయన పేర్కొన్నారు. ఈవిధంగా చొరవ తీసుకోవడం వల్ల ధార్మిక విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారు, ప్రశాంత వాతావరణంలో చదువుకోవాలనుకునేవారు ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతారని ఆయన తెలిపారు. సాయంత్రం వేళల్లో వివిధ అంశాలపై చర్చలు ఏర్పాటుచేస్తే యువకులు తమ అభివృద్ధికి బాటలు వేసుకునేందుకు దోహదపడుతుందని సోమనాథ్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. ఆలయ నిర్వాహకులు ఆ దిశగా కృషి చేస్తే సమసమాజంలో మంచి మార్పులు చోటుచేసుకుంటాయని ఆయన అన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z