* అబిడ్స్‌లోని శ్రీప్రియాంక ఎంటర్‌ప్రైజెస్ భారీ మోసానికి పాల్పడింది. అధిక వడ్డీ ఆశచూపి 517 మంది నుంచి రూ.200 కోట్లు వసూలు చేసి మోసం చేసింది. దీంతో బాధితులంతా బషీర్‌బాగ్ సీసీఎస్ పోలీసు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
* ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపు తప్పడంతో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అది 20 అడుగుల లోయలో పడిపోవడంతో ఈ భారీ ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. స్థానికులు కొందరు అడవి నుంచి తెండు ఆకుల్ని సేకరించి పికప్ వాహనంలో తిరిగివస్తుండగా అదుపుతప్పి లోయలో పడింది. అప్పుడు అందులో 25 మంది వరకు ఉన్నారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఎక్కువమంది మహిళలేనని వెల్లడించారు. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. ప్రమాదం గురించి తెలియగానే ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్‌శర్మ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
* బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు పట్టుబడ్డారు. ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్ హౌస్‌లో బర్త్ డే పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాడి చేశారు. దాదాపు 100 మందికి పైగా పార్టీకి హాజరయ్యారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే పార్టీకి వచ్చిన ఓ కారులో ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి సంబంధించిన స్టిక్కర్ దొరికింది. పార్టీలో పలు రకాల డ్రగ్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. 17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్, కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ హౌస్ పరిసరాల్లో జాగ్వార్, బెంజ్ సహా ఖరీదైన 15 ఖరీదైన కార్లను జప్తు చేశారు. ఐదుగురిని అరెస్టు చేసిన ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
* ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని నల్లా నీరు విషయంలో జరిగిన గొడవను సాకుగా తీసుకొని తాతపై మనవళ్లు దాడిచేసి చంపిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. హసన్‌పర్తి మండల కేంద్రానికి చెందిన జల్లి సారయ్య(80), సమ్మక్క దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమారుడు చిన్న వయసులోనే చనిపోగా.. పెద్ద కుమారుడు రమేశ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో తొమ్మిదేళ్ల కిందట మృతి చెందారు. రమేశ్ భార్య రమాదేవి(40), కుమారులు సాయికృష్ణ(22), శశికుమార్(20) పక్కనే వేరేగా ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సారయ్యకు రెండెకరాల భూమి ఉండగా.. ఇటీవల నాలుగు గుంటలు విక్రయించి, వచ్చిన డబ్బులు కుమార్తెలకు ఇవ్వడంతో కోడలు, మనవళ్లు గొడవపడ్డారు. తమకు రావాల్సిన ఆస్తి కుమార్తెలకు కట్టబెడుతున్నారని అప్పటి నుంచి తరచూ ఘర్షణ పడేవారు. ఆదివారం ఉదయం కుళాయి వద్ద నీళ్లు పట్టుకునే విషయంలో సారయ్య-సమ్మక్క దంపతులతో కోడలు, మనవళ్లు గొడవకు దిగారు. ఘర్షణ వద్దని వృద్ధుడు వారిస్తున్నా కోడలు వారిపై గట్టిగట్టిగా కేకలు వేయసాగింది. మనవళ్లు వాకింగ్ స్టాండ్‌తో తాతపై దాడి చేశారు. బంధువులు, ఇరుగు పొరుగు వచ్చేసరికి అక్కడి నుంచి పారిపోయారు. తల, నుదుటిపై తీవ్రగాయాలతో సారయ్య అక్కడికక్కడే మృతి చెందారు. సమ్మక్క ఫిర్యాదుతో హసన్‌పర్తి పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
* పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా మలికా గార్గ్ బాధ్యతలు స్వీకరించారు. జూన్ 4న కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడటమే తన మొదటి లక్ష్యమన్నారు. శాంతిభద్రతలను అదుపులోకి తేవడమే తన ముందున్న లక్ష్యమని చెప్పిన ఆమె.. కొన్ని ఘటనల కారణంగా శాంతిభద్రతలు అదుపు తప్పాయన్నారు. నాయకులు చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పల్నాడు జిల్లాలో ప్రశాంత వాతావరణానికి కృషి చేస్తానని తెలిపారు. పోలీసు అధికారులు తప్పుడు చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z