Movies

రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు- పోలీస్ కమీషనర్-CrimeNews-May 21 2024

రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు- పోలీస్ కమీషనర్-CrimeNews-May 21 2024

* ఒక మైనర్ దురుసు డ్రైవింగ్ రెండు కుటుంబాలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. రెండు రోజుల క్రితం మహారాష్ట్రలోని పుణెలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన అనీశ్‌, అశ్విని మృతి చెందిన సంగతి తెలిసిందే. వారి మృతదేహాలను చూసి, కుటుంబ సభ్యులు బోరున విలపించారు.ఇది ప్రమాదం కాదని హత్య అని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటన జరిగిన 15 గంటల్లోనే నిందితుడికి బెయిల్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ‘‘ఇప్పుడు మా కుటుంబం అంతా షాక్‌లో ఉంది. ఘటన జరిగిన 15 గంటల్లో బెయిల్ ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బెయిల్ షరతులు తీవ్రంగా బాధించాయి. మేం న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం. అతడి తల్లిదండ్రులను విచారించాలి. వెంటనే నిందితుడిని కస్టడీలోకి తీసుకోవాలని కోరుతున్నాం. ఇంకా జీవితమే చూడని అమాయకురాలిని పొట్టనపెట్టుకున్నాడు’’ అని అశ్విని బంధువు ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్‌లో అనీశ్‌ నిర్జీవంగా కనిపించడంతో.. అతడి కుటుంబాన్ని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు.‘‘ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అలాంటి సమయంలో నిందితుడికి బెయిల్ ఇవ్వడం దారుణం. అతడికి కఠిన శిక్ష పడాలి’’ అని అనీశ్‌ తాతయ్య వాపోయారు. పుణెలో ఆదివారం తెల్లవారుజామున ఓ బైక్‌ను లగ్జరీ కారు ఢీకొనడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు టెకీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు డ్రైవ్‌ చేసిన నిందితుడు ఓ మైనర్‌ అని గుర్తించిన పోలీసులు.. అతడిని కోర్టు ముందు హాజరుపర్చారు. ఆ బాలుడికి జువైనల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 300 పదాల్లో ప్రమాదంపై వ్యాసం రాయాలని, 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో పనిచేయాలంటూ విధించిన బెయిల్ షరతులు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. నిందితుడిని మేజర్‌గా పరిగణించాలన్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించడంతో.. పోలీసులు సెషన్‌ కోర్టును ఆశ్రయించనున్నట్లు చెప్పారు. మహారాష్ట్రలో ఔరంగాబాద్‌లో మైనర్ తండ్రిని పుణె పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే వయసు నిబంధనను మరిచి నిందితుడికి ఆల్కహాల్ సరఫరా చేసిన రెండు బార్స్‌ యజమానుల్ని కూడా అరెస్టు చేశారు. 12వ తరగతి ఫలితాలు వచ్చిన తర్వాత వేడుక చేసుకోవడానికి తన స్నేహితులతో కలిసి బార్‌కు వెళ్లాడు. అక్కడ మద్యం సేవించి, తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ఆ కారుకు ఇంతవరకు రిజిస్ట్రేషన్ లేదని తెలిసింది.

* బెంగళూరు రేవ్‌ పార్టీ టాలీవుడ్‌లో కలకలం సృష్టిస్తోంది. నగర శివారులో నిర్వహించిన రేవ్‌ పార్టీలో తెలుగు నటి హేమ పాల్గొన్నట్లు బెంగళూరు సిటీ కమిషనర్‌ దయానంద్‌ స్పష్టం చేశారు. ఆ నటి సోమవారం విడుదల చేసిన వీడియో ఎక్కడి నుంచి తీశారో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ‘సన్ సెట్ టు సన్ రైస్ విక్టరీ’ పేరుతో నిర్వహించిన ఈ ఈవెంట్‌లో దాదాపు వంద మంది పాల్గొన్నట్లు చెప్పారు. మొత్తంగా అందరి నుంచి రూ. 50 లక్షలు వసూలు చేశారని తెలిపారు. ఇందులో ప్రజా ప్రతినిధులెవరూ పాల్గొనలేదని చెప్పిన ఆయన.. ఈ వ్యవహారంలో మొత్తంగా ఐదుగురిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. బెంగుళూరు శివారులో ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్‌ హౌస్‌లో నిర్వహించిన రేవ్‌ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు పట్టుబడిన విషయం తెలిసిందే. ఆ పార్టీలో తాను లేనని తెలుపుతూ నటి హేమ సోమవారం ఓ వీడియో విడుదల చేశారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని.. తనపై వస్తోన్న వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పుడు ఆమె ఆ పార్టీలో పాల్గొన్నట్లు కమిషనర్‌ చెప్పడం గమనార్హం.

* సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో అనిశా సోదాలు చేపట్టింది. అశోక్‌నగర్‌లోని ఇంటితో సహా ఏకకాలంలో 10 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. ఆయనకు ఉన్న ఆస్తుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. సర్వీసు రికార్డు, ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్‌లోని 6 చోట్ల, మిగతా 4 ప్రాంతాల్లో దాడులు చేశారు. ఉదయం 5 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ అనిశా దాడులు చేసింది. ప్రస్తుతం ఉమామహేశ్వరరావు సాహితీ ఇన్‌ఫ్రా కేసుల విచారణ అధికారిగా ఉన్నారు. ఆయన గతంలో ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేశారు. అప్పటి నుంచి ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి.

* అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూర్‌ వీధికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్‌ ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేశారు. ఆయన కుమారుడు సోహెల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. సోహెల్‌ ఎస్‌బీఐ ఖాతాకు ఇటీవల అధిక మొత్తంలో నగదు జమ కావడంతో అతడి కుటుంబ సభ్యులను విచారించారు. అనంతరం యువకుడిని రాయదుర్గం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఉగ్రవాదులతో సంబంధాలపై విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

* నడిరోడ్డు మీద మహిళపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ముఖంపై, మెడపై, కడుపులో విచక్షణారహితంగా పొడిచాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. తూర్పు బీహార్లోని కతిహార్‌లో మగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. స్కూల్‌ టీచర్‌గా పనిచేస్తున్న యశోదా దేవి అనే 29 ఏళ్ల మహిళ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్నది. ప్రతి మంగళవారం ఉపవాసం ఉండే ఆమె ఉదయాన్నే స్కూల్‌కు వెళ్లి పూజ చేసి వస్తుంది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం 5.30 గంటలకు స్కూల్‌లో పూజ చేసేందుకు బయలుదేరింది. అప్పటికే దారికాచిన నిందితుడు మధ్యలోనే యశోదను అడ్డగించి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించినా విడువకుండా విచక్షణారహితంగా దాడిచేశాడు. కిందిపడిపోయిన వదలకుండా కడుపులో పొడిచి చంపేశాడు. అంతటితో ఆగక ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఈ హృదయవిధారక ఘటన స్థానికులను కలచివేసింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి, హతురాలికి ఆమె పెళ్లికి ముందు వివాహేతర సంబంధం ఉన్నట్లు తమ ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిందితుడు యశోధ భర్తపై కూడా కత్తితో దాడి చేశాడు. అయితే అతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z