NRI-NRT

తానా ప్రపంచ సాహిత్య వేదిక 4వ వార్షికోత్సవ వేడుకలు

తానా ప్రపంచ సాహిత్య వేదిక 4వ వార్షికోత్సవ వేడుకలు

“ప్రజాభ్యుదయంలో సాహిత్యం, కళల పాత్ర: నాడు-నేడు” సదస్సు విజయవంతం.

తానా సాహిత్యవిభాగం “తానా ప్రపంచసాహిత్యవేదిక” ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న 67వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశంలో నాల్గవ వార్షికోత్సవ వేడుకలలో “ప్రజాభ్యుదయంలో సాహిత్యం, కళల పాత్ర: నాడు-నేడు” సదస్సు ఘనంగా నిర్వహించారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డా. కె. పద్మరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని తమ విశ్వవిద్యాలయంలో తెలుగు భాష, సాహిత్య వికాసాలకోసం జరుగుతున్న కృషిని సోదాహరణంగా వివరించారు. తానా పూర్వాధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి, అంజయ్యచౌదరి లావు, ప్రస్తుత అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, ఉత్తరాధ్యక్షులు డా. నరేన్ కొడాలి, సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ సాహిత్యవేదిక నాల్గవ వార్షికోత్సవం జరుపుకోవడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు.

తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ఉభయ తెలుగు రాష్ట్రాలలో వేర్వేరు సమస్యలుండేవని, ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఉన్న సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి వరకట్నం, మధు సేవ, చింతామణి, రక్త కన్నీరు, మా భూమి, పాలేరు లాంటి నాటకాలు, ప్రజా నాట్యమండలి, జననాట్య మండలి లాంటి సంస్థల ప్రభావం భూస్వామ్యుల, పెత్తందార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు నాయకుల పోరాటం అయితే, తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా, తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఉద్యమ గీతాలు, కళాకారుల ఆట పాటలు ప్రజా చైతన్యాన్ని తీసుకువచ్చాయన్నారు”.

విశిష్టఅతిథులుగా ప్రజాకవి, తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యులు డా.గోరటి వెంకన్న, ప్రముఖ సినీగీత రచయిత డా.సుద్దాల అశోక్ తేజ, తెలంగాణ రాష్ట్ర గీతరచయిత డా. అందెశ్రీ, సినీగీత రచయిత మిట్టపల్లి సురేందర్, కళాభిమాని డా. శ్రీనివాసరెడ్డి ఆళ్ళ, ప్రముఖ కవి గొడిశాల జయరాజు, గద్దర్ కుమార్తె డా. వెన్నెల గద్దర్, అరుణోదయ కళాకారిణి బండ్రు విమలక్క, బుర్రకథ కళాకారులు పద్మశ్రీ నాజర్ కుమారులు షేక్ బాబుజి (బుర్రకథ), ఏర్పుల భాస్కర్ (బైండ్ల గానం); డా. రవికుమార్ చౌదరపల్లి (ఒగ్గుకథ); పాతూరి కొండల్ రెడ్డి (యక్షగానం); దామోదర గణపతిరావు (జానపదగానం), చాట్రగడ్డ శ్రీనివాసుడు (డప్పువిన్యాసం) తదితరులు పాల్గొని ప్రసంగాలు, కళావిన్యాసాలతో అలరించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z