DailyDose

గాజాపై అణుబాంబు వేస్తాం

గాజాపై అణుబాంబు వేస్తాం

హమాస్‌ను అంతమొందించేందుకు.. గాజాస్ట్రిప్‌పై పట్టు సాధించేందుకు ఇజ్రాయెల్‌ అణుబాంబు ప్రయోగించడానికి కూడా సిద్ధమైందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్‌ మంత్రి అమిచాయ్‌ ఇలియాహు రేడియో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘పరిస్థితులు అనుకూలించకపోతే గాజాస్ట్రిప్‌పై అణుబాంబు వేయటమొక్కటే ఆప్షన్‌’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై అధికార, విపక్ష పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సదరు మంత్రిని ప్రభుత్వ సమావేశాల్లో పాల్గొనకుండా నిరవధికంగా సస్పెండ్‌ చేస్తున్నామని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ ప్రకటించారు. అంతర్జాతీయ చట్టాల్ని గౌరవిస్తూ యుద్ధాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, శనివారం రాత్రి ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు జరిపిన బాంబు దాడుల్లో గాజాలోని మఘాజి శరణార్థుల శిబిరం ధ్వంసమైంది. ఈ ఘటనలో కనీసం 40మంది పౌరులు చనిపోయారని, మృతుల్లో 8 మంది చిన్నారులున్నారని, పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై అంతర్జాతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. గాజాలో కాల్పుల విరమణ ప్రకటించాలని పలు దేశాలు డిమాండ్‌ చేశాయి. గాజాపై ఇజ్రాయెల్‌ దాడుల్లో 3,900 మంది చిన్నారులు చనిపోయారని, 8,067మంది గాయపడ్డారని హమాస్‌ నేతృత్వంలోని గాజా ఆరోగ్య శాఖ ఆదివారం తెలిపింది. ప్రతి 10 నిమిషాలకు ఒక చిన్నారి మృత్యువాత పడుతున్నాడని ఆందోళన వ్యక్తం చేసింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z