‘శివుడు అగ్నిలింగంగా అవతరించిన పవిత్ర ప్రదేశమే తిరువణ్ణామలై… చూసి తీరాల్సిన పుణ్యక్షేత్రం’ అంటారు భక్తులు. పంచ భూత స్థలాల్లో ఒకటిగానూ ప్రపంచంలోని అతిపెద్ద ఎనిమిదో హిందూదేవాలయంగానూ పేరొందిన అరుణాచలేశ్వర ఆలయంలోని పరమశివుణ్ణి దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుందన్న నమ్మకంతో కార్తికంలో అరుణాచలానికి వెళ్లేవారి సంఖ్య ఏటికేడూ పెరుగుతోంది. కార్తిక పౌర్ణమి సందర్భంగా ఆ శివక్షేత్రం గురించి..
తమిళనాడులోతిరువణ్ణామలై జిల్లాలోని పచ్చని కొండ పక్కన ఉంటుందీ అరుణాచలేశ్వరాలయం. కార్తిక దీపోత్సవానికి పెట్టింది పేరు. ‘చిదంబరాన్ని దర్శించినా, కాశీలో మరణించినా, తిరువారూరులో జన్మించినా కలిగే మోక్షప్రాప్తి…. అరుణాచలం అన్న పేరును ఉచ్చరించినా చాలు…ముక్తి లభిస్తుంది’ అంటారు. అందుకే జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలనుకునేవాళ్లు తప్పక దర్శిస్తుంటారు.తిరువణ్ణామలై పర్వత పాదాల చెంతన 25 ఎకరాల్లో నలుదిశలా ఠీవిగా ఉన్న గోపురాలతో అద్భుతంగా కనిపిస్తుందీ శైవ క్షేత్రం. బ్రహ్మ- విష్ణువుల మధ్య జరిగిన సంవాదాన్ని పరిష్కరించేందుకు శివుడు జ్వాలా స్తంభ రూపాన్ని దాల్చి ఆది అంతాలను కనుక్కోమని చెప్పాడనీ, అది తెలుసుకోలేని వాళ్లిద్దరూ తమ ఓటమిని ఒప్పుకుని ప్రార్థించగా- రూపాన్ని కుదించుకుని తిరువణ్ణామలై కొండ కింద శివలింగంగా అవతరించాడనీ పౌరాణిక కథనం. మరో పురాణం ప్రకారం-పార్వతీదేవి ఓసారిసరదాగా శివుడి కళ్లు మూయడంతో లోకం అంధకారమైందనీ, అప్పుడు లోకమాత తన తప్పు తెలుసుకుని, తిరువణ్ణామలై కొండ దగ్గర తపస్సు చేయగా, శివుడు జ్వాలలా ప్రత్యక్షమై లోకానికి వెలుగు నిచ్చాడనీ, తరవాత గౌరీదేవికి తన దేహంలో స్థానమిచ్చి అర్ధనారీశ్వరుడుగా మారి ఈ పర్వత పాదాలచెంత వెలిశాడనీ చెబుతారు.
ఆలయ నిర్మాణం!
సంప్రదాయ ద్రావిడ శైలిలో ఉన్న ఈ ఆలయాన్ని పల్లవులు, చోళులు, విజయనగర చక్రవర్తులు, తంజావూరు నాయకులు… ఇలా ఎందరో రాజులు వెయ్యి సంవత్సరాలపాటు ఎన్నో మార్పుచేర్పులతో కట్టించినట్లు తెలుస్తోంది. మొదటగా చోళులు 9 నుంచి 13వ శతాబ్దం వరకూ దీన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఎవరు ఎప్పుడు కట్టించినా ముప్ఫై అడుగుల భారీ కుడ్యాలూ రెండు పుష్కరిణులూ అనేక మందిరాలూ లెక్కలేనన్ని విగ్రహాలూ చూడచక్కని శిల్పాలతో ఉన్న ఈ ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. ప్రధాన రాజ గోపురం 217 అడుగుల ఎత్తులో 11 అంతస్తులతో దేశంలోని రెండో అతిపెద్ద గోపురంగా ఖ్యాతి చెందింది. సింహం శరీరం, ఏనుగు తలతో ఉన్న ‘యాళీ’ రూపంలో చెక్కిన స్తంభ శిల్పకళ కళ్లను కట్టిపడేస్తుంది.ఆలయ ప్రాంగణంలో చిన్నాపెద్దా కలిపి మొత్తం తొమ్మిది గోపురాలూ ఐదు ప్రాకారాలూ ఉన్నాయి. ఐదో ప్రాంగణంలోని వేయి స్తంభాల మండపాన్ని కృష్ణదేవరాయలు నిర్మించారు. మూడో ఆవరణలో పదహారు స్తంభాల దీప దర్శన మండపం లేదా కాంతి మందిరం ఉంటుంది. ఇక్కడున్న వృక్షాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. సంతానలేమితో బాధపడేవాళ్లు కొమ్మలకు చిన్న ఊయలలు కట్టి మొక్కుతారు. గర్భాలయంలో శివలింగం పెద్దదిగా ఉంటుంది. దీన్నే తేజోలింగం అనీ అంటారు. సన్యాసి జీవితం ద్వారా కర్తవ్యం, ధర్మం, త్యాగం, విముక్తికి ప్రతీకే ఈ అగ్నిలింగం అని చెబుతారు. శివుడికి ఒక వైపున అపీతకుచాంబ అనే పేరుతో పార్వతీదేవి ఉంటుంది. ఆలయం లోపల హాల్లోని నేల మాళిగలో పాతాళ లింగం ఉంటుంది. అక్కడే రమణ మహర్షి ధ్యాన ముద్రలో ఉండగా- శరీరాన్ని చీమలు ఛిద్రం చేస్తున్న దశలో ఆయనకు ఆత్మ సాక్షాత్కారం అయ్యిందన్న నమ్మకంతో ఈ ప్రదేశాన్ని ముక్తిస్థలం అనీ పిలుస్తారు.
కార్తిక దీపోత్సవం!
అరుణాచలంలో స్వామికి ఉదయంఎనిమిది నుంచి రాత్రి పదిగంటల వరకూ రోజుకు ఆరుసార్లు ఆచార రీతుల్నీ అన్ని పండుగల్నీ నిర్వహిస్తారు. తమిళ నెల ప్రకారం- నవంబరు లేదా డిసెంబరులో వచ్చే కార్తిగై బ్రహ్మోత్సవాన్ని పది రోజులపాటు నిర్వహిస్తారు. పౌర్ణమికి తొమ్మిది రోజుల ముందు ధ్వజారోహణంతో ప్రారంభించి ఉదయం, రాత్రి వేళలో స్వామిని వెండి వాహనంపై ఊరేగిస్తారు. చివరిరోజైన కార్తిక పౌర్ణమినాడు దీపోత్సవాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తుతారు. ఆ రోజు రాత్రి వెండి వృషభ వాహనంపై అరుణాచలేశ్వరుడిని పర్వతం చుట్టూ ఊరేగిస్తారు. పౌర్ణమిరోజు సాయంత్రం ఆరుగంటలకు ఏడు అడుగుల ఎత్తైన రాగి పాత్రలో మూడు వేల కిలోల నెయ్యి పోసి, వెయ్యి మీటర్ల దూదితో పొడవాటి దీపాన్ని చేసి వెలిగిస్తారు. దీన్నే మహాదీపం అంటారు. ఈ జ్యోతిని చూసేందుకు లక్షలాది భక్తులు తరలి వస్తారు. ఈ దీపం కనీసం ఓ వారం పాటు వెలుగుతూ చుట్టుపక్కల 30 కి.మీ. వరకూ కనిపిస్తుందట.
గిరివాలం!
అరుణాచలంతో ఎందరో యోగులకీ సిద్ధులకీ అనుబంధం ఉంది. వారిలో ఒకరైన రమణ మహర్షి అరుణాచలాన్ని ఆత్మస్వరూపంగా భావించేవారు. కైలాసం, కాశీ, చిదంబరం… ఈ క్షేత్రాలన్నిటా శివుడు కొలువుదీరతాడు. కానీ ‘శివ రూపమే అరుణాచలం… ఈ కొండ చుట్టూ చెప్పులు లేకుండా శివనామ స్మరణతో నెమ్మదిగా తిరగడమే ఓ యోగా’ అన్నారు మహర్షి. అందుకే అక్కడి ఆలయంకన్నా కొండకే ప్రాధాన్యం ఇస్తారు భక్తులు. దీని చుట్టూ చేసే ప్రదక్షిణనే గిరివాలం అంటారు. అరుణ అంటే ఎరుపు… అచలం అంటే కొండ… అరుణాచలం అంటే పాపాలను తొలగించేది… అని పండితులు చెబుతారు. కోరికల కోసం కాకుండా జ్ఞాన సముపార్జన కోసమే పౌర్ణమి రోజుల్లో భక్తులు అరుణాచలానికి చేరుకుని గిరివాలం చేస్తారు. కార్తిక పౌర్ణమినాడు ఆ సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుంది.కొండ చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేయాలంటే 14 కిలోమీటర్లు నడవాలి. గిరివాలం దారిలోనే ఇంద్రలింగం, అగ్నిలింగం, యమ లింగం, నైరుతి లింగం, వరుణ లింగం, వాయు లింగం, కుబేర లింగం, ఈశాన్య లింగం… అనే పేర్లున్న అష్టలింగాలు ఉన్నాయి. ఇవి భూమి వేర్వేరు దిశలను సూచిస్తుంటాయి. ఆ ఎనిమిది లింగాలనూ తీర్థాలనూ రాజరాజేశ్వరీ ఆలయాన్నీ దక్షిణామూర్తి ఆలయాన్నీ దర్శించుకుంటూ ప్రదక్షిణ పూర్తిచేస్తారు భక్తులు. పుణ్యం మాటెలా ఉన్నా పౌర్ణమినాటి చంద్రకాంతి సమక్షంలో కొండమీద ఉన్న ఔషధమొక్కల చల్లని గాలుల్ని ఆస్వాదిస్తూ శివ స్మరణ చేయడంవల్ల మానసిక, శారీరక ఆరోగ్యం ప్రాప్తిస్తుందని యోగులూ సిద్ధులూ చెప్పే మాట నూటికి నూరుశాతం సత్యం అంటారు భక్తులు. అందుకే ఆత్మస్వరూపాన్నితెలుసుకోవాలనుకునే జ్ఞానాన్వేషకుల్నిఅయస్కాంతంలా ఆకర్షిస్తోందిఅరుణాచలం… సుప్రసిద్ధ జ్ఞాన క్షేత్రం!
రహస్య ప్రదేశం!
తిరువణ్ణామలైని భూమిమీద ఉన్న రహస్య పవిత్ర ప్రదేశంగాచెబుతారు. కొండ కింద ఉన్న గుహలో సిద్ధ పురుషులు తపస్సుచేసుకుంటూ ఉంటారనీ, రాత్రి వేళలో శివలింగాన్ని అర్చించి ఉదయాన్నే తిరిగి వెళ్లిపోతారనీ అంటారు. ఆలయాన్ని పునరుద్ధరించినప్పుడు- గర్భగుడిలో ఓ పెద్ద సొరంగాన్ని గుర్తించారనీ దాన్ని తెలుసుకునేందుకు కొందరు వెళ్లి, అంత దూరం వెళ్లలేక వెనక్కి వచ్చేశారనీ అంటారు. గర్భాలయంలోని శివలింగానికి దగ్గరగా కూర్చుంటే ఉక్కపోసి చెమటలు పట్టేసి సతమతం అయిపోయినట్లు ఉంటుందట. ఈశ్వరుడు తానే అగ్నిహోత్రం అని తెలియజేసేందుకే అలా జరుగుతుందని భక్తులు చెబితే, దీనికి కింద భాగంలో అసలైన అగ్ని లింగం ఉండి ఉంటుందని కొందరు పండితులు చెబుతారు. ఇవన్నీ ఒకెత్తయితే, ప్రముఖ శాస్త్రవేత్త నికోలె టెస్లా- ప్రత్యామ్నాయ విద్యుచ్ఛక్తి రూపకల్పనకోసం వాడిన ఎలక్ట్రిక్ కాయిల్‌ను పోలిన శిల్పం ఆలయ రాజగోపురం మీద ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీన్నిబట్టి ఇక్కడ భూమిలోపలవిద్యుచ్ఛక్తిని వెలువరించే శక్తిమంతమైన పరికరం ఉండి ఉంటుందనీ, దానివల్లే బయటి వాతావరణంకన్నా గర్భాలయంలో వేడిగా ఉంటుందనీ అది ఎలక్ట్రోథెరపీలా పనిచేస్తుందనీ, అందువల్లే ఎంతోమంది ఇక్కడకు వచ్చి ధ్యానం చేసి మానసిక ప్రశాంతతను పొందుతుంటారనీ, అందుకే ఇది ఆధ్యాత్మిక కేంద్రంగా పేరొందిందనీ కొందరు నిపుణులు చెబుతారు. ఇదంతా కేవలం యాదృచ్ఛికం కావచ్చు అనీ ఇంకొందరు అంటున్నారు. కారణమేదయినా అరుణాచలం అంతుచిక్కని శక్తిమంతమైన ప్రదేశం అన్నది నిజం.
👉 – Please join our whatsapp channel here –