DailyDose

బ్రిటన్‌కు మాంద్యం ముప్పు-వాణిజ్య-08/10

Britain On The Edge Of Financial Crisis-Telugu Business News Today-Aug102019-బ్రిటన్‌కు మాంద్యం ముప్పు-వాణిజ్య-08/10

* బ్రిటన్కు మాంద్యం ముప్పు పొంచి ఉందా..? ఏమో.. 2020 ప్రారంభంలో ఆ పరిస్థితి వచ్చినా రావొచ్చని ఆ దేశ ప్రధాన బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ హెచ్చరిస్తోంది. ప్రధానంగా బ్రెగ్జిట్ ప్రక్రియపై నెలకొన్న అనిశ్చితులతో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ సతమతమవుతోంది. వ్యాపార కార్యకలపాలపైనా ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దీంతో ఎవరూ ఊహించని విధంగా ఏప్రిల్- జూన్లో బ్రిటన్ జీడీపీ 0.2% మేర క్షీణించింది. దాదాపు ఏడేళ్ల తర్వాత బ్రిటన్ జీడీపీ క్షీణత బాట పట్టడం గమనార్హం. అంతేకాదు.. ఇంత అధిక స్థాయిలో క్షీణించడమూ ఇదే మొదటిసారి. ఆఫీస్ పర్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ఓఎన్ఎస్) శుక్రవారం విడుదల చేసిన ఈ గణాంకాలు మార్కెట్ వర్గాల అంచనాలకూ దూరంగానే నిలిచాయి. ప్రస్తుత మూడో త్రైమాసికంలోనే ఇదే పరిస్థితి నెలకొంటే బ్రిటన్ అధికారికంగానే మాంద్యంలోకి వెళ్లిపోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే కేవలం బ్రిటన్లోనే వృద్ధి నెమ్మదించలేదని.. మిగతాదేశాల్లోనే ఇదే పరిస్థితి ఉందని బ్రిటన్ ఆర్థిక మంత్రి సాజిద్ జావేద్ తమ దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరును సమర్థించుకున్నారు. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్ఠంగా ఉన్నాయని తెలిపారు.
**ఉద్యోగాలకు ముప్పు
ఎటువంటి ఒప్పందాలు లేకుండా ఐరోపా కూటమి నుంచి బ్రిటన్ వైదొలిగితే ఐరోపా ప్రాంతంలో 17 కోట్ల వరకు ఉద్యోగాలు పోతాయని లూయేన్ యూనివర్శిటీ తన అధ్యయనంలో అంచనా వేసింది. ఏయే దేశాల్లో ఎనెన్ని ఉద్యోగాలకు ముప్పు ఉందో ఆ వివరాలు ఇలా..
**బ్రెగ్జిట్ పదినిసలు
1 2016 జూన్.. ఐరోపా కూటమి నుంచి వైదొలిగేందుకు బ్రిటన్ దేశీయులు ఓటేసిన తేదీ ఇది. అయితే ఇప్పటికీ అధికారికంగా వైదొలిగే ప్రక్రియ పూర్తికాలేదు.
2 వాస్తవానికి ఈ ఏడాది మార్చి 29వ తేదీతో బ్రెగ్జిట్ ప్రక్రియ జరిగిపోవాల్సి ఉంది. అయితే దీనిని అక్టోబరు 31వ తేదీకి పొడిగించారు.
3 ఈయూతో ఒప్పందం కుదిరినా.. కుదరకపోయిన అక్టోబరు 31న ఐరోపా కూటమి నుంచి బ్రిటన్ వైదొలుగుతుందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పడం కొంత భయాలను పెంచింది.
4 మార్చి 29న బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తయితే ఎలాంటి పరిస్థితులుంటాయోనని ఆ సమయంలో కంపెనీలు నిల్వలు పెంచుకున్నాయి. దాంతో ఆ త్రైమాసికంలో వ్యాపార కార్యకలాపాల్లో వృద్ధి నమోదైంది.
5 ఎప్పుడైతే గడువు తేదీని పొడిగించారో.. అప్పటినుంచి కంపెనీలు నిల్వలను పెంచకోవడం తగ్గించాయి. ఆ ప్రభావమే ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై పడింది.
6 బ్రెగ్జిట్ అనిశ్చితులతో బ్రిటన్ కరెన్సీ కొన్ని నెలలుగా క్షీణస్తూ వస్తోంది. శుక్రవారం బ్రిటన్ జీడీపీ గణాంకాలు వెల్లడైన తర్వాత కూడా 0.2 శాతం క్షీణించింది.
7 ఐరోపా కూటమి, బ్రిటన్ మధ్య ఎటువంటి ఒప్పందం కుదురకుండా బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తయితే ఎగుమతులపై టారీఫ్లు, వాణిజ్య ఆంక్షలు విధించే పరిస్థితులు నెలకొంటాయి.
8 తాజా వృద్ధి గణాంకాలను గమనిస్తే బ్రెగ్జిట్ అనిశ్చితి ప్రభావం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై ఊహించని దాని కంటే అధికంగానే చూపిందనే ప్రమాద సంకేతాన్ని సూచిస్తోంది.
9 2016 జూన్లో బ్రెగ్జిట్కు అనుకూలంగా బ్రిటన్ ఓటేసినప్పటి నుంచి వ్యాపార పెట్టుబడులు రికార్డు స్థాయిలో పడిపోయాయి. రెండో త్రైమాసికంలో మరింతగా క్షీణించాయి.
10 ఈ అనిశ్చితుల రీత్యా 2020 ప్రారంభంలో బ్రిటన్ మాద్యంలోకి వెళ్లేందుకు మూడింట ఒక వంతు అవకాశం ఉందని గత వారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ హెచ్చరించింది.
* ఇటీవల ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్షలో రెపోరేటు తగ్గించిన గంటల వ్యవధిలోనే ఎస్‌బీఐ కూడా వడ్డీరేట్లను తగ్గించినట్లు ప్రకటన జారీ చేసింది. భవిష్యత్తులో ఆర్‌బీఐ వడ్డీరేట్లు మార్చిన తక్షణమే ఆ ప్రతిఫలాలు ప్రభుత్వ రంగబ్యాంకుల లబ్ధిదారులకు చేరనున్నాయి. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.
* భగీరథ కెమికల్స్‌ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. రూ.122.99 కోట్ల ఆదాయంపై రూ.7.71 కోట్ల నికరలాభాన్ని, రూ.9.28 ఈపీఎస్‌ను నమోదు చేసింది.
* టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిలో కోత విధిస్తున్నాయి. ప్రస్తుత త్రైమాసికంలో వేర్వేరు యూనిట్లలో 8-14 రోజుల పాటు ఉత్పత్తి నిలిపేస్తామని ఎం అండ్‌ ఎం తెలిపింది.
* వాహనాలపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలన్నదే తయారీ సంస్థల ఏకగ్రీవ డిమాండ్‌ అని, వాహన తయారీదార్ల సంఘం సియామ్‌ పేర్కొంది. ద్విచక్ర వాహన విడిభాగాల తయారీదార్లు సహా పరిశ్రమ మొత్తం ఈ విషయమై ఏకాభిప్రాయంతో ఉందని సియామ్‌ అధ్యక్షుడు రాజన్‌ వధేరా తెలిపారు.
* నీటి శుద్ధి సాంకేతిక పరిజ్ఞానంలో, వ్యర్థాల నియంత్రణలో క్రియాశీలకంగా ఉన్న సంస్థ అయిన అయాన్‌ ఎక్స్ఛేంజీ హైదరాబాద్‌ శివార్లలోని పటాన్‌చెరులో నూతన పరిశోధన-అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించింది.
* సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా జిక్సర్‌ 250 బైకును విపణిలోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ.1,59,800 (ఎక్స్‌- షోరూమ్‌ దిల్లీ)గా నిర్ణయించారు. జిక్సర్‌ 250 మోడల్‌లో ఫోర్‌-స్ట్రోక్‌ 249 సీసీ ఇంజిన్‌ను అమర్చారు. భారత విపణి కోసమే ప్రత్యేకంగా దీన్ని రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది.
* చైనా టెలికాం దిగ్గజం హువావె సొంత ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌) హార్మొని ని ఆవిష్కరించింది. అమెరికా, చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో, గూగుల్‌కు చెందిన ఆండ్రాయిడ్‌ వ్యవస్థలు హువావె ఫోన్లకు అందుబాటులోకి రావనే హెచ్చరికల నేపథ్యంలో, సంస్థ సొంతగా ఓఎస్‌ను అందుబాటులోకి తెచ్చింది.
* తెలంగాణా ట్యాక్స్‌ ప్రాక్టీషనర్ల సంఘం నూతన అధ్యక్షుడిగా నగేష్‌ రంగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఇక్కడ జరిగిన సమావేశంలో అధ్యక్ష ఎన్నికతో పాటు సంఘం పూర్తి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
* ఆదిత్య బిర్లా గ్రూపు సంస్థ హిందాల్కో ఇండస్ట్రీస్‌ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.1,062.89 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ ఆర్జించిన నికర లాభం రూ.1,474.69 కోట్లతో పోలిస్తే ఇది 27.9 శాతం తక్కువ.
* ప్రభుత్వ రంగ భెల్‌ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.218.93 కోట్ల ఏకీకృత నష్టాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ రూ.39.98 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
* తొలి త్రైమాసికంలో గెయిల్‌ ఇండియా రూ.1,503.67 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ ఆర్జించిన నికర లాభం రూ.1,443.02 కోట్లతో పోలిస్తే ఇది 4.2 శాతం అధికం.
* పన్ను సంబంధిత అంశాల్లో వేధింపులు ఎదురవుతుంటే, సత్వరం పరిష్కరిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భరోసా ఇచ్చారు. ఇందుకోసం వచ్చేవారం నుంచి దేశవ్యాప్తంగా పర్యటించి, పారిశ్రామిక వేత్తలు, వారి ప్రతినిధులతో సమావేశమవుతానని, వారు తెలిపిన పన్ను వేధింపు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తానని పేర్కొన్నారు.
*అమెరికాకు చెందిన జువెలరీ కంపెనీ టిఫానీ, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో దేశీయ విపణిలోకి ప్రవేశించనుంది. ఈ ఏడాదిలోనే దిల్లీలో తమ తొలి విక్రయశాల ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
*సూక్ష్మ, చిన్న మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హైదరాబాద్ రీజనల్ డైరెక్టర్ సుబ్రతా దాస్ అన్నారు.
*నవభారత్ వెంచర్స్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.800 కోట్ల ఆదాయాన్ని, రూ.122 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.742 కోట్లు, నికరలాభం రూ.115 కోట్లు ఉన్నాయి. విద్యుత్తు విభాగంలో ఆకర్షణీయ ఆదాయాలు సాధించినట్లు, తక్కువ పన్ను భారం వల్ల లాభాలు పెరిగినట్లు కంపెనీ పేర్కొంది.
*బైక్లు, కార్లలో కలిసి వెళ్లేందుకు (కార్ పూలింగ్) తోడ్పడే మొబైల్ అప్లికేషన్ క్విక్రైడ్లో దేశ వ్యాప్తంగా 20లక్షల మంది నమోదయ్యారని సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ కేఎన్ఎం రావు తెలిపారు.
* కంపెనీ, అనుబంధ సంస్థల ఖాతాల పరిశీలనకు అంతర్జాతీయ అకౌంటింగ్ సంస్థ ఈవైను నియమించుకున్నట్లు కాఫీ డే ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. వీజీ సిద్ధార్థ రాసినట్లు భావిస్తున్న చివరి లేఖలో సంతకం ధ్రువీకరణ విషయాన్ని సైతం ఈవై పరిశోధించనున్నట్లు తెలిపింది.
*మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ కొత్త ప్రచారకర్తగా అనిల్ కపూర్ను నియమించుకుంది. బాలీవుడ్లో 40 ఏళ్ల పాటు సేవలు అందించిన అనిల్ కంపెనీ కొత్త ప్రచార చిత్రం ‘మలబార్ ప్రామిస్’లో తళుక్కుమంటారు.
*ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) దక్షిణ ప్రాంత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ప్రాంతీయ సేవలు)గా అరూప్ సిన్హా బాధ్యతలు స్వీకరించారు. తమిళనాడు, పుదుచ్ఛేరి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళలకు సంబంధించిన మానవ వనరులు, ఆర్థిక, ఉత్పత్తి రవాణా, కాంట్రాక్టులు, భద్రత, నాణ్యత నియంత్రణ వంటి పలు బాధ్యతలను ఆయన నిర్వర్తిస్తారు.
* ఆర్థిక వృద్ధి నెమ్మదిస్తున్నందున, తిరిగి గాడిలో పెట్టడానికి రూ.లక్ష కోట్ల ఉద్దీపన పథకం ప్రకటించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను పారిశ్రామిక సంఘాలు కోరాయి. పరిశ్రమ దిగ్గజాలతో మంత్రి గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
*ఏంజెల్ పన్ను విషయమై ఆందోళన చెందుతున్న అంకురాలకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. అంకురాలు అందుకునే పన్ను నోటీసులకు అవి ఇచ్చే సమాధానాలపై ఎటువంటి ప్రశ్నలూ అడగకుండానే అంగీకరించేలా చేస్తామని ప్రభుత్వం ఈ సందర్భంగా హామీనిచ్చింది.
*దేశీయంగా వాహన విక్రయాలు క్షీణిస్తుండటంతో వినియోగదారులను ఆకర్షించేందుకు అన్ని కంపెనీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. జర్మనీకి చెందిన విలాసవంత కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ కూడా తాజాగా ఆఫర్లు ప్రకటించింది.
*ఫేమ్ ఇండియా పథకం రెండో దశలో భాగంగా 64 నగరాలకు 5,595 విద్యుత్ బస్సులను ప్రభుత్వం మంజూరు చేసింది.
* మారుతీ సుజుకీ నుంచి బీఎస్-జుఖి ఉద్గార ప్రమాణాలతో కొత్తగా రూపొందిన మల్టీ పర్పస్ వాహనం ఎర్టిగా పెట్రోల్ వెర్షన్ విపణిలోకి వచ్చింది. దీని ధరను రూ.7,54,689 (ఎక్స్షోరూమ్, దిల్లీ)గా నిర్ణయించారు.
*పెద్ద తెర కలిగిన స్మార్ట్ఫోన్ (ఫ్యాబ్లెట్) గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్లను శామ్సంగ్ ఆవిష్కరించింది. నోట్ 10 ప్రారంభ ధర 950 డాలర్లు. నోట్ 10 అమ్మకాలు ఈ నెల 23న ప్రారంభమవ్వనున్నాయి.
* విద్యుత్ వైర్లు, స్విచ్లు ఉత్పత్తి చేసే గోల్డ్మెడల్ ఎలక్ట్రికల్స్ తెలంగాణలో రూ.125 కోట్ల పెట్టుబడితో ఫ్యాన్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ సమీపంలో ఈ కేంద్రాన్ని 3-4 ఎకరాల్లో నిర్మించబోతున్నామని, రెండేళ్లలో పూర్తి కావచ్చని సంస్థ డైరెక్టర్ కిషన్ జైన్ తెలిపారు.