🕑 Published: July 15, 2026 at 05:44 AM CST
అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన మక్కెన ప్రసన్న (27) మృతి చెందారు. రైతు కుటుంబానికి చెందిన మక్కెన వెంకటేశ్వర్లు, గోవిందమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో పెద్ద కుమార్తె ప్రసన్న 2022లో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. అక్కడే ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు.
మంగళవారం ప్రసన్న తన ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసన్న అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె స్నేహితులకు గాయాలయ్యాయి. పెద్ద కుమార్తె మరణ వార్త విన్న వెంకటేశ్వర్లు కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. దీంతో ఉమ్మడివరం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు.. మృతురాలి తండ్రికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రసన్న భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకురావాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
