🕑 Published: October 04, 2026 at 06:00 PM CST
అర్వింగ్లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వద్ద గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. MGMNT వ్యవస్థాపక కార్యదర్శి రావు కల్వాల మాట్లాడుతూ గత 12 సంవత్సరాలగా గాంధీ జయంతి సందర్భంగా ఈ పార్క్ లో శాంతి నడక యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు.
మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “గాంధీ సిద్ధాంతాలు అన్ని కాలమానాలలోను, ప్రత్యేకంగా ప్రపంచం అంతా యుద్ధ వాతావరణం నెలకొనియున్న ఈ సమయంలో కూడా ఆచరణ యోగ్యమే అన్నారు. శాంతియుతమైన ప్రతిఘటన ద్వారా ఎంతటి శక్తిమంతమైన సామ్రాజ్యాన్నైనా ఎదిరించవచ్చని ప్రపంచానికి నిరూపించడం మహాత్మాగాంధీ సాధించిన మహోన్నత విజయం. అమెరికాలో పౌరహక్కుల ఉద్యమానికి నాయకత్వం వహించిన డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన నెల్సన్ మండేలా లాంటి ప్రపంచంలోని ఎందరో మహానాయకులు గాంధీజీ సిద్ధాంతాల నుంచి ప్రేరణ పొందారు. గాంధీజీ తాత్విక చింతనకు ఉన్న విశ్వవ్యాప్త ప్రాధాన్యాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి, గాంధీజీ జన్మదినమైన అక్టోబర్ 2వ తేదీని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించింది” అన్నారు.
ముఖ్యఅతిథిగా హాజరైన ఇర్వింగ్ డిప్యూటీ మేయర్ మార్క్ క్రోనన్వెట్ మాట్లాడుతూ ఈ ప్రాంతం అభివృద్ధిలో ప్రవాస భారతీయుల కృషి అభినందనీయం అన్నారు. అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ మెమోరియల్ ఇక్కడ నెలకొని ఉండడం నగరానికే గర్వకారణం అని గాంధీజీకి నివాళులర్పించారు. ప్రత్యేక అతిథిగా హాజరైన కాపెల్ సిటీ కౌన్సిల్ మెంబర్ రమేశ్ ప్రేమకుమార్ మాట్లాడుతూ బ్రిటన్ నుండి భారతదేశానికి విముక్తి కల్గించడంలో గాంధీజీ చేసిన కృషిని కొనియాడి పుష్పాంజలి ఘటించారు. డా. సూదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ రచించిన “ద పెరల్స్ ఆఫ్ గాంధీజీస్ విజ్డం” అనే గ్రంధాన్ని డిప్యూటీ మేయర్ మార్క్ క్రోనన్వెట్ ఆవిష్కరించారు. ఇండియా అసోసియషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఉపాధ్యక్షులు దీపక్ కాల్రా, బోర్డు సభ్యులు రావు కల్వాల, తయాబ్ కుండావాల, రాంకీ చేబ్రోలు, శైలేష్ షా, స్వాతీ షా, ముర్తుజ, కలై కృష్ణ, వినోద్ ఉప్పు, శాంటే చారి తదితరులు పాల్గొన్నారు.




