🕑 Published: October 18, 2026 at 12:08 PM CST
మలేషియాలో ఫెడరేషన్ ఆఫ్ ఎన్నారై కమ్యూనిటీ అసోసియేషన్స్ (FNCA) ఆధ్వర్యంలో కౌలాలంపూర్లోని బ్రిక్ఫీల్డ్స్ కందయ్య హాల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పూల పరిమళాలతో, బతుకమ్మ అట పాటలతో, జానపద గీతాలతో, కోలాటాల సందడితో ఆహ్లాదభరితంగా సాగాయి. విదేశీ గడ్డపై తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు వెల్లివిరియగా, ప్రవాస భారతీయులంతా ఒక్కచోట చేరి ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. మహిళలు, చిన్నారులు సంప్రదాయ వస్త్రధారణలో ముస్తాబై, రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను తీసుకొచ్చారు. బతుకమ్మ పాటలు పాడుతూ, చప్పట్లతో, ఆటపాటలతో వేడుకలకు మరింత శోభను చేకూర్చారు. ప్రవాస తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగు ప్రజలతో పాటు, గత ఐదు దశాబ్దాలుగా మలేషియాలో స్థిరపడిన తెలుగు కుటుంబాలు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం. తరతరాలుగా తెలుగు సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్న ప్రవాసుల ఐక్యతకు ఈ వేడుకలు అద్దం పట్టాయి.
ముఖ్య అతిథులుగా పెరాక్ రాష్ట్ర శాసనసభ సభ్యురాలు వాసంతి సిన్ని సామి, ఇండియన్ లేబర్ వింగ్ అటాచ్ వినయ్ ఆనంద్ హాజరయ్యారు. తెలుగు ఎక్స్పాట్స్ అసోసియేషన్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ చందు, ప్రధాన కార్యదర్శి ఇంద్రనీల్, మలేషియా ఆంధ్రా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరామ్, భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా అధ్యక్షుడు సత్య, ఉపాధ్యక్షుడు రవితేజ, భారత్ రాష్ట్ర సమితి మలేషియా అధ్యక్షుడు మారుతి కుర్మా, మలేషియా తెలుగు ఫౌండేషన్ అధ్యక్షుడు దాతో కాంతారావు, మలేషియా తెలుగు వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి, తెలుగు ఇంటెలెక్చువల్ సొసైటీ ఆఫ్ మలేషియా అధ్యక్షుడు కొణతాల ప్రకాశ్రావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. వాసంతి సిన్ని సామి మాట్లాడుతూ, మలేషియాలో భారతీయ వారసత్వాన్ని, సాంస్కృతిక విలువలను సజీవంగా ఉంచేందుకు FNCA చేస్తున్న కృషిని అభినందించారు.
అందంగా అలంకరించిన బతుకమ్మకు ప్రత్యేక బహుమతిగా రెండు బంగారు నాణేలను అందజేశారు. బతుకమ్మలను తీసుకొచ్చిన ప్రతి మహిళకు వెండి నాణేలను బహుమతిగా అందించారు. వేడుకల్లో పాల్గొన్న ప్రతి మహిళకు సైతం వెండి నాణేలను అందించి నిర్వాహకులు ప్రోత్సహించారు. లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచిన వారికి బంగారు, వెండి నాణేలను బహుమతులుగా అందజేశారు. చిన్నారులు పాల్గొన్న కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. FNCA మలేషియా అధ్యక్షుడు కృష్ణ ముత్తినేని స్వాగత ప్రసంగంలో బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించారు. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు తమ సంప్రదాయాలను భావితరాలకు అందించడంతో పాటు, భారతీయ ప్రవాసుల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణతో పాటు, మలేషియాలో నివసిస్తున్న లేదా పనిచేస్తున్న భారతీయులు ఇబ్బందుల్లో చిక్కుకున్నప్పుడు వారికి సహాయం అందించడం FNCA ప్రధాన లక్ష్యాల్లో ఒకటని ఆయన తెలిపారు. మలేషియా ప్రభుత్వం అమలు చేస్తున్న మైగ్రెంట్ రిపాట్రియేషన్ ప్రోగ్రామ్(PRM) 2.0 గురించి కూడా FNCA ప్రతినిధులు అవగాహన కల్పించారు.
FNCA మలేషియా కార్యనిర్వాహక అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రవి వర్మ కనుమూరి, ప్రధాన కార్యదర్శి శివ సానిక, సంయుక్త కార్యదర్శి భాస్కర్ రావు ఉప్పుగంటి, కోశాధికారి రాజశేఖర్ రావు గునుగంటి, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు సాయి కృష్ణ జులూరి, యువజన విభాగం అధ్యక్షుడు ఫణీంద్ర కనుగంటి, యువజన విభాగం ఉపాధ్యక్షుడు సతీష్ కుమార్ ఆదిమూలం, మహిళా విభాగం అధ్యక్షురాలు శిరీష ఉప్పుగంటి, మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు దుర్గా ప్రవళిక రాణి కనుమూరి పాల్గొన్నారు. కార్యనిర్వాహక సభ్యులు నాగరాజు కాలేరు, నాగార్జున దేవవరపు, సురేష్ రెడ్డి మందడి, విజయ్ కుమార్ మాడిశెట్టి, మంగపతి గోరుముచు, సతీష్ రావు కథేరగండ్ల, సందీప్ కుమార్ మర్రు, రూప్ కుమార్ కంచర్ల, సతీష్, గుండ్లకుంట మహేష్ బాబు, సత్య, హరీష్, శరత్, సూర్యకుమారి, మౌనిక కథేరగండ్ల, సుజాత చెన్నుపాటి, వనిత ముత్తినేని, శిరీష కొత్తమాసు, భార్గవి ఆదిమూలం తదితరులు పాల్గొని వేడుకల విజయవంతానికి తమ వంతు సహకారం అందించారు.
మొత్తంగా, మలేషియాలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు కేవలం పండుగ సంబరాలకే పరిమితం కాకుండా, తెలుగు ప్రజల ఐక్యతకు, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు, సామాజిక సేవా స్ఫూర్తికి ప్రతీకగా నిలిచాయి. పూల పండుగ అందించిన ఆనందం, ఆత్మీయత, సంప్రదాయాల పరిమళం ప్రవాస తెలుగు కుటుంబాల్లో చిరస్మరణీయ అనుభూతిని నింపాయి. విదేశీ గడ్డపై తెలుగు సంస్కృతిని భావితరాలకు చేరవేయాలన్న సంకల్పంతో Fణ్ఛా నిర్వహించిన ఈ వేడుకలు అందరి ప్రశంసలు అందుకున్నాయి.









