🕑 Published: October 21, 2026 at 01:39 PM CST
బతుకమ్మ పండుగను కెనడాలో తెలుగు అలయన్సెస్ ఆఫ్ కెనడా (తాకా) ఆధ్వర్యంలో శనివారం నాడు టొరంటో సమీపంలోని మిస్సిసాగాలోని లింకన్ జె. అలెగ్జాండర్ సెకండరీ స్కూల్లో వైభవంగా నిర్వహించారు. తెలంగాణ ప్రజల జీవన విధానంలో అంతర్భాగమైన బతుకమ్మ పండుగను వేలాది మైళ్ల దూరంలో కెనడాలో అదే సాంస్కృతిక స్ఫూర్తితో జరుపుకున్నారు. ప్రవాస తెలంగాణ ప్రజలు తమ మూలాలను స్మరించుకుంటూ, సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే సంకల్పంతో ఈ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
మహిళలు సంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు. అందంగా అలంకరించిన బతుకమ్మలతో వేడుక ప్రాంగణమం పండుగ శోభను సంతరించుకుంది. గాయని పారిజాత బర్దీపూర్ బతుకమ్మ పాటల ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో నమోదు చేసుకున్న ప్రతి మహిళకు తాకా తరఫున ప్రత్యేక బహుమతిని అందజేశారు. అందంగా అలంకరించిన బతుకమ్మల్లో మూడు బతుకమ్మలను ఎంపిక చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. వేడుకలకు విచ్చేసిన అతిథులకు విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. బతుకమ్మ నిమజ్జన కార్యక్రమాన్ని పర్యావరణహితంగా ఏర్పాటు చేశారు. తాకా అధ్యక్షుడు ప్రసన్న తిరుచిరాపల్లి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఉపాధ్యక్షురాలు వాణి జయంతి, ప్రధాన కార్యదర్శి మల్లిక్ చారి, కోశాధికారి ప్రదీప్ రెడ్డి, డైరెక్టర్లు అశ్విత, ప్రశాంతి, యశ్వంత్, కళ్యాణ్, వ్యవస్థాపక అధ్యక్షుడు చారి సామంతపూడి, ట్రస్టీ చైర్ కల్పన మోటూరి, ట్రస్టీలు అనిత సజ్జ, ప్రవీణ్ పెనుబాక, పవన్ కుమార్ బసాని, ఆదిత్య వర్మ, మాజీ అధ్యక్షుడు రమేష్ మునుకుంట్ల, వ్యవస్థాపక సభ్యుడు అరుణ్ కుమార్ లయం తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.






