Politics

బంగారు తెలంగాణ సాధనకు మీ దీవెనలు కావాలి

బంగారు తెలంగాణ సాధనకు మీ దీవెనలు కావాలి

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపడుతున్నామని తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. పాలమూరు జిల్లా తెరాస అధికారంలోకి రాకముందు, వచ్చాక ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని సూచించారు. విద్యుత్‌, పింఛన్లు, రైతుబంధు, మిషన్‌ భగీరథ తదితర అనేక కార్యక్రమాలను చేపడుతూ సంక్షేమంలో ముందుకెళ్తున్నామన్నారు. ఆదివారం సాయంత్రం వనపర్తిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెరాస పాలనలో రైతులకు ధీమా వచ్చిందని, గత పాలనలో యాదవులను ఎవరూ పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. ఇటీవల దేశ ప్రధాని పాలమూరుకు వచ్చి ఓట్ల కోసం పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్వాంత్ర్యం వచ్చాక దేశాన్ని ఎక్కువకాలం పాటు పాలించింది కాంగ్రెస్‌, భాజపానే అన్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆ రెండు పార్టీల దుకాణాలు బంద్‌ అవుతాయని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వస్తామని భాజపా పగటి కలలు కంటోందన్నారు. భాజపాకు 150, కాంగ్రెస్‌కు 100 సీట్లు దాటవని సర్వేలు చెబుతున్నాయని చెప్పారు. నూటికి నూరు శాతం ప్రాంతీయ పార్టీలే దేశ రాజకీయాలను శాసిస్తాయని విశ్వాసం వ్యక్తంచేశారు. ‘‘యాదవులకు లక్షల సంఖ్యలో గొర్రెలను పంచుతున్నాం. రాష్ట్రంలో వానాకాల చదువులకు స్వస్తి చెప్పేందుకు 550 గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేశాం. వీటి ద్వారా ఒక్కో విద్యార్థిపై రూ.1.20లక్షల చొప్పున ఖర్చు చేస్తున్నాం. ప్రజల ఆశీర్వాదం తోడుంటే మరింత ఉత్సాహంతో ముందుకెళ్తాం. మిషన్‌ భగీరథను కలలో కూడా ఊహించలేదు. అది త్వరలోనే పూర్తయిపోతోంది. రాబోయే కొద్ది రోజుల్లో పాలమూరు ప్రాజెక్టు పూర్తిచేసి మరో 10లక్షల ఎకరాలకు నీరిచ్చే బాధ్యత నాది. గట్టు ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి నీరందిస్తాం. అసెంబ్లీ ఎన్నికల్లో పాత పాలమూరు జిల్లాలో 14 సీట్లకు గాను 13 స్థానాల్లో తెరాసను గెలిపించి గొప్ప విజయం అందించినందుకు అందరికీ కృతజ్ఞతలు. మీరిచ్చిన బలం వృథా కానీయం. ఎంత మొండిపట్టుతో తెలంగాణ తెచ్చుకున్నామో అంతే స్ఫూర్తితో పనిచేస్తాం. 20లక్షల ఎకరాలలో పాలుగారే పచ్చని పాలమూరును చూడాలి. ఎన్నికల తర్వాత ఒక్కో జిల్లాలో మూడేసి రోజులు ఉంటా. ప్రజాదర్భార్‌లు పెడతాం. ప్రజలకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం. లోక్‌సభ ఎన్నికల్లో తెరాసకు 16 ఎంపీలను ఇవ్వండి. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నేరవేరుస్తూ ముందుకెళ్దాం. బంగారు తెలంగాణ సాధనకు మీ దీవెనలు కావాలి’’ అని కేసీఆర్‌ అన్నారు.