DailyDose

నేరస్థులంతా వైకాపా నుంచి పోటీ:సాయిబాబు– రాజకీయ-04/01

నేరస్థులంతా వైకాపా నుంచి పోటీ:సాయిబాబు– రాజకీయ-04/01

*హత్యారోపణలు, వరకట్న వేధింపుల కేసులు ఉన్న వారు వైకాపా అభ్యర్థులని తెదేపా 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ సాయిబాబు విమర్శించారు. రాజమహేంద్రవరం వైకాపా అభ్యర్థి మారగాని భరత్‌పై వరకట్న వేధింపుల కేసు ఉందని ఆయన ఆరోపించారు. నేర చరిత్ర ఉండటమే వైకాపా అభ్యర్థిత్వానికి అర్హతా? అని ఆయన ప్రశ్నించారు. భరత్ మహిళను వేధింపులకు గురిచేయడం, ఇంట్లో వ్యక్తులను చంపడానికి చూసిన విషయం నిజం కాదా? అని సాయిబాబు నిలదీశారు. దువ్వాడ శ్రీనివాస్, భరత్ రామ్, మళ్ల విజయ్ ప్రసాద్‌పై ఉన్న కేసులపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.
*ఆ పార్టీలు రూ.4.5 లక్షల కోట్లు దోచుకున్నాయి
జనసేన పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల్లో మేధావులు, విద్యావంతులు ఉన్నారని ఆ పార్టీ అధినేత పవన్‌ స్పష్టం చేశారు. కుటుంబానికి 25 కేజీల బియ్యం కాకుండా.. పాతికేళ్ల భవిష్యత్తు ఇచ్చేందుకే ప్రజల ముందుకు వచ్చానని పవన్‌ గళమెత్తారు. ప్రస్తుత ప్రభుత్వాలు ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేశాయని ధ్వజమెత్తారు. తెదేపా, వైకాపా కలిసి రూ.4.5 లక్షల కోట్లు దోచుకున్నాయని ఆరోపించారు.
* పేదరిక నిర్మూలనకు 10 సూత్రాలు: చంద్రబాబు
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాబోయే ఎనిమిది రోజులు అవిశ్రాంతంగా పని చేయాలని తెదేపా నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. సంస్థాగత బలమే తెలుగుదేశం పార్టీ బలమని, ఈ ఎన్నికల్లో సాంకేతికత తెదేపాకి కలిసొచ్చే అంశమని అన్నారు. ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో.. బూత్ కన్వీనర్ కూడా అంతే ముఖ్యమని చంద్రబాబు అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గత ఐదేళ్లలో పేదల సంక్షేమం సంతృప్త స్థాయికి చేర్చామని, పారదర్శకంగా ప్రతి పైసా లబ్దిదారుడి ఖాతాలో వేస్తున్నామని తెలిపారు. పేదరికం నిర్మూలనకు 10 సూత్రాలు ప్రకటించామన్నారు.
*మంగళగిరిలో లోకేశ్‌ ప్రచారం
గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పట్టణంలోని 10వ వార్డులో అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లను అడిగారు. నేత కార్మికుడు వెంకటేశ్వరరావు తన ఇంటిలో అచ్చువేస్తున్న సమయంలో అక్కడికి చేరుకున్న ఆయన దాని పనితీరును అడిగి తెలుసుకున్నారు. చేనేత కార్మికుల కష్టాలు, వారికి ఉన్న ఇబ్బందులను లోకేశ్‌కు తెలియజేశారు. 50 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నా.. తమ జీవితాల్లో ఎలాంటి మార్పులూ రాలేదని తెలిపారు. త్వరలోనే నేత కార్మికుల కష్టాలు తీరేలా చర్యలు తీసుకుంటామని లోకేశ్‌ హామీ ఇచ్చారు.
*‘మోదీకి దక్షిణాది నుంచి గెలిచే సత్తా ఉందా?’
అమేఠీలో గెలుపుపై అనుమానంతోనే రాహుల్‌ మరో స్థానం నుంచి పోటీ చేస్తున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ ఘాటుగా స్పందించారు. రాహుల్‌కు అటు ఉత్తరాది ప్రజలతో పాటు నుంచి ఇటు దక్షిణాది నుంచి కూడా మద్దతు ఉందని నిరూపించుకోవడానికే ఆయన కేరళలోని వాయనాడ్‌ నుంచి పోటీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తదుపరి ప్రధానిగా రాహుల్‌కు దేశ ప్రజల ఆమోదం ఉందని.. ఇక్కడ పోటీ చేసి గెలవడం వల్ల స్పష్టమవుతుందన్నారు. దక్షిణాదిలో అసలు గెలిచే అవకాశమే లేని ప్రధాని నరేంద్ర మోదీకి ఇదొక సవాల్‌ అన్నారు.
*ప్రకాశ్‌‌రాజ్‌పై ఈసీకి ఫిర్యాదు
బెంగళూరు సెంట్రల్‌ స్వతంత్ర అభ్యర్థి, నటుడు ప్రకాశ్‌రాజ్‌పై ఎన్నికల కమిషన్‌కు కేఆర్‌పురం ప్రాంతానికి చెందిన గిరీశ్‌కుమార్‌ నాయుడు ఫిర్యాదు చేశారు. తమిళనాడులోని వెళ్ళానాచరిలో 2చోట్ల, తెలంగాణలోని సేరిలింగంపల్లిలలో ప్రకాశ్‌రాజ్‌ ఓటు హక్కు కలిగియున్నారన్నారు. ఈ మేరకు ఆదివారం ఎన్నికల కమిషన్‌కు గిరీశ్‌కుమార్‌నాయుడు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒక్కచోటు మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు. ప్రకాశ్‌రాజ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల కమిషన్‌కు చేసిన ఫిర్యాదుపై తమిళనాడులో రెండు చోట్ల ఓటు హక్కు ఉన్నందున అక్కడి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించినట్లు గిరీశ్‌ కుమార్‌, జగన్‌కుమార్‌లు తెలిపారు.
*ప్రజల్లో అవగాహన పెరిగింది: మాగంటి రూప
ప్రచారంలో దూసుకుపోతున్నారు రాజమండ్రి లోక్‌సభ అభ్యర్థి మాగంటి రూప. ఇప్పటికే తాను దాదాపు చాలా నియోజకవర్గాల్లో పర్యటించానని.. ఇక మిగిలిన 8 రోజులే తమకు చాలా కీలకమన్నారు. నేడు ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. 70 శాతం నియోజకవర్గాల్లో పర్యటించినట్టు తెలిపారు. ప్రజల నుంచి రెస్పాన్స్ చాలా బాగుందని.. ఎక్కడికెళ్లినా మంగళ హారతులతో ఆహ్వానిస్తున్నారని రూప తెలిపారు. ప్రజల్లో అవగాహన చాలా పెరిగిందని భావిస్తున్నానన్నారు. సైకిల్ గుర్తుకు తాము ఎందుకు ఓటు వేస్తామో తామే చెబుతున్నారని రూప తెలిపారు.
*దిల్లీలో ప్రకంపనలు సృష్టిస్తా
భాజపా సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తోంది. ప్రస్తుతం ఇస్తున్న పింఛనులో రూ.800 కేంద్రానివి అంట.. రూ.200 రాష్ట్రానివి అంట. అటుదిటు చేసి ఇంత పచ్చి అబద్ధం చెప్పొచ్చా? ఇప్పడు తెలంగాణలో 47,88,070 మందికి మేము పింఛన్లు ఇస్తుంటే కేంద్రం మాత్రం ఇక్కడ 6,66,538 మందికి మాత్రమే ఇస్తోంది. మేము పింఛన్ల కోసం రాష్ట్రంలో రూ.11,843 కోట్లు ఖర్చు పెడితే, కేంద్ర వాటా రూ.203 కోట్లు. దీనిపై భాజపా చర్చకు వస్తుందా? మాట్లాడ్డానికి దమ్ముందా? తెలంగాణ వ్యాప్తంగా భాజపా నాయకులను నిలదీయాలి.
*నిజామాబాద్‌లో ఈవీఎంలే
అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలిచి.. దేశం దృష్టిని ఆకర్షిస్తున్న నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్‌ నిర్వహణపై స్పష్టత వచ్చింది. ఇక్కడ ఈవీఎంలతోనే పోలింగ్‌ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం స్పష్టం చేసింది. దీంతో ఇందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. మద్దతు ధర కల్పించాలని కోరుతూ పసుపు, ఎర్రజొన్న రైతులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
*కేరళ నుంచీ రాహుల్‌ పోటీ
కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ లోక్‌సభకు రెండో స్థానం నుంచి కూడా పోటీ చేయనున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిని మెరుగుపరచుకోవాలన్న ఉద్దేశంతో కేరళలోని వయనాడ్‌ను ఎంచుకున్నారు. కుటుంబానికి కంచుకోటలాంటి ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీలో కూడా యథావిధిగా రంగంలో ఉండనున్నారు. వయనాడ్‌ నుంచి రాహుల్‌ గాంధీ పోటీ చేయనున్న విషయాన్ని కేరళకు చెందిన సీనియర్‌ నేత, రక్షణ శాఖ మాజీ మంత్రి ఎ.కె.ఆంటోని ఆదివారం ఇక్కడ ప్రకటించారు. రాష్ట్ర శాఖ చేసిన విజ్ఞప్తి మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
*తెరాసకు 57.45 శాతం ఓట్లు
తెలంగాణ రాష్ట్ర సమితికి లోక్‌సభ ఎన్నికల్లో 57.45 శాతం మేరకు ఓట్లు వస్తాయని ఆ పార్టీ తరఫున అంతర్గత సర్వే నిర్వహించిన సంస్థ పేర్కొంది. 16 స్థానాల్లోనూ పార్టీ విజయం సాధిస్తుందని పేర్కొంది. కాంగ్రెస్‌కు 28 శాతం, భాజపాకి 11.85 శాతం, వామపక్షాలకు 1.45 శాతం, ఇతరపార్టీలకు 1.25 శాతం ఓట్లు వస్తాయని వివరించింది. ఓటర్ల నాడి తెలుసుకునేందుకు మూడు నెలలుగా తెరాస అంతర్గత సర్వేలను చేయిస్తోంది. ఈ నెల 25 నుంచి 30 వరకు హైదరాబాద్‌ మినహా మిగిలిన 16 నియోజకవర్గాల్లో సర్వే చేయించింది.
*రెండ్రోజుల్లో రైతు రుణమాఫీ
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకొస్తే రెండు రోజుల్లో రైతుల రుణాలను మాఫీ చేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటించారు. కేంద్రంలో అధికారంలోకొచ్చిన వెంటనే… ప్రత్యేక హోదా సహా విభజన చట్టం ప్రకారం ఏపీకి చెందాల్సినవన్నీ ఇచ్చి తీరతామని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన విజయవాడలో ఏర్పాటు చేసిన ‘కాంగ్రెస్‌ భరోసా సభ’, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహించిన ప్రచార సభలలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… ఏపీని దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లోని రైతాంగం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇక్కడ కాంగ్రెస్‌ బలోపేతం అయితే అన్ని వర్గాల వారికీ సమాన అవకాశాలు దక్కుతాయి. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో అధికారంలోకొస్తే 10 రోజుల్లోపు రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించాం.’’ అని రాహుల్‌ పేర్కొన్నారు.
*రాజకీయం గతి తప్పుతోంది
భారతదేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఆందోళన కలుగుతోందని, రాజకీయాలు గతి తప్పుతున్నాయని, అసహ్యకరంగా ఉన్నాయని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఆయనకు కోస్టారికాలోని ఐక్యరాజ్యసమితి శాంతి విశ్వవిద్యాలయం ‘గౌరవ డాక్టరేట్‌’ను ఇచ్చిన నేపథ్యంలో విశాఖలోని ఆయన మిత్రులు ఆదివారం నగర శివారులోని ఓ హోటల్లో ‘ఆత్మీయ సత్కారం’ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
*మోదీ పబ్లిసిటీ మినిస్టర్‌!
ప్రధాని మోదీ 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. మోదీలో దిగులు, ఆందోళన కనిపిస్తున్నాయన్నారు. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్‌ గాంధీ వివిధ అంశాలపై మాట్లాడారు. ‘‘మోదీ ‘ప్రైమ్‌ మినిస్టర్‌’గా కంటే ‘పబ్లిసిటీ మినిస్టర్‌’గానే ఎక్కువగా పని చేస్తున్నారు. దర్పంతో, అధికార దాహంతో, తన గురించి తాను గొప్పగా చెప్పుకోవడానికి పడే తపనతో ప్రధాని వ్యవహరిస్తున్నారు. అందులో కూడా అన్నీ అబద్ధాలే చెబుతున్నారు.
*ముఖ్య నేతలంతా సొంత స్థానాల్లో బిజీ బిజీ
కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారం కీలక లోక్‌సభ నియోజకవర్గాల్లో జోరందుకుంది. ముఖ్య నేతలు బరిలో ఉన్న స్థానాల్లో పోటాపోటీగా సాగుతోంది. కొన్ని స్థానాల్లో మాత్రం ఇంకా క్షేత్రస్థాయికి చేరలేదు. అభ్యర్థులే చెమటోడుస్తున్నారు. మొదటి విడతగా పార్టీ 8 మంది అభ్యర్థులను, మలివిడతగా మరో 8మందిని, చివరన ఖమ్మం అభ్యర్థిగా రేణుకాచౌదరిని ప్రకటించింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నల్గొండ నుంచి బరిలో దిగడంతో ఆయన పూర్తిగా ఆ నియోజకవర్గంపైనే దృష్టిసారించారు.
*ఆడబిడ్డకు భరోసా.. మహాలక్ష్మి
ఆడబిడ్డంటే ఇంటికి వెలుగని, అటువంటి వారికి పూర్తి భరోసా ఇచ్చేలా మహాలక్ష్మి పథకాన్ని జనసేన ప్రభుత్వం అమల్లోకి తెస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో ఆదివారం రాత్రి ఏర్పాటుచేసిన ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడారు. పదో తరగతి విద్యార్హత కలిగిన వధువుకు వివాహ కానుకగా రూ.లక్ష నగదు సహాయం అందజేస్తానన్నారు. అందులో రూ.50వేలు వడ్డీలేని రుణమని పేర్కొన్నారు. పెళ్లయ్యాక సారె నిమిత్తం రూ.10,116 నగదు అందిస్తామన్నారు. 25 కేజీల బియ్యం, రూ.2,000 భృతి కాకుండా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే జనసేన అజెండా అన్నారు. అధికారంలోకి వచ్చిన ఆర్నెల్ల కాలంలోనే 3 లక్షల ఉద్యోగాలను భర్తీచేసి తీరుతామన్నారు.
*కేసీఆర్‌ లాంటి ఇమాన్‌దారులు కావాలి
దేశం అభివృద్ధి దిశగా పయనించాలంటే చౌకీదారులు కాదు, కేసీఆర్‌ వంటి ఇమాన్‌దారుల నాయకత్వం అవసరమని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పేర్కొన్నారు. మోదీ చౌకీదార్‌ అంటున్నారు. మా తాతలు, నాయనమ్మ దేశాన్ని పాలించారు. నేను పాలిస్తానని రాహుల్‌ అంటున్నారు. చెవులో పువ్వు, మొండిచెయ్యి చూపించే పార్టీలకు మన దెబ్బ చూపించాలని ఆయన పిలుపునిచ్చారు.
*భాజపా గూటికి పొంగులేటి సుధాకర్‌రెడ్డి
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి భాజపాలో చేరారు. ఆదివారం ఉదయం ఆయన దిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. రాత్రి ఆపార్టీ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో భాజపా కండువా కప్పుకున్నారు. ఆయన వెంట పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ తదితరులు ఉన్నారు. అంతకుముందు కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి లేఖ రాశారు.
*జగన్‌, మమత, నవీన్‌ ఎన్డీయేవైపే: దత్తాత్రేయ
లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో తెరాస, తెదేపా, ఇతర ప్రాంతీయ పార్టీలకు దిమ్మతిరిగే తీర్పు వస్తుందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. కేటీఆర్‌ చెబుతున్న మమత బెనర్జీ, నవీన్‌ పట్నాయక్‌, మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌ వంటి నేతల్లో అత్యధికులు మోదీ ప్రధానిగా ఏర్పడే ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఎన్డీయే కూటమిని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు సైతం మద్దతు ఇవ్వడానికి ముందుకొస్తారన్నారు.
*ఆ నాలుగింటికీ ఉపఎన్నికలు నిర్వహించాలి
తమిళనాట 18 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇంకా ఖాళీగా ఉన్న మరో 4 స్థానాలకు నిర్వహించాలని డీఎంకే డిమాండ్‌ చేసింది. సీనియర్‌ నేత ఆర్‌ఎస్‌.భారతి ఆదివారం చెన్నై సచివాలయంలో తమిళనాడు ఎన్నికల ప్రధాన అధికారి సత్యప్రద సాహును కలిశారు. ఆమె విలేకర్లతో మాట్లాడుతూ 4 స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహిస్తామని సుప్రీంకోర్టులో ఈసీ పేర్కొన్నట్లు తెలిసిందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి మరోసారి విజ్ఞప్తి చేశామన్నారు. ఉప ఎన్నికలు నిర్వహించే విషయమై ఈసీ సకాలంలో నిర్ణయం తీసుకుంటుందని ఎన్నికల ప్రధాన అధికారి సాహు తెలిపారు.