Devotional

తిరుమల వీఐపీ దర్శనాలపై హైకోర్టులో వ్యాజ్యం

case in andhra high court on ttd vip break

తిరుమల శ్రీవారి దర్శనానికి వీఐపీ బ్రేక్‌కు అనుమతివ్వడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. వీఐపీ దర్శనాలను నిలువరించాలని అభ్యర్థిస్తూ ప్రకాశం జిల్లా కోరిశపాడు మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన జాగర్లమూడి వెంకటసుబ్బారావు ప్రజాహిత వ్యాజ్యాన్ని వేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఉమేష్‌చంద్ర వాదనలు వినిపిస్తూ.. ఆరాధన హక్కు అందరికి సమానమంటూ గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం అందుకు సంబంధించిన ఉత్తర్వులను తమ ముందుంచాలని పేర్కొంది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం మంగళవారం ఈమేరకు ఆదేశించింది. అంతకుముందు పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘భక్తుల మధ్య అసమానతలు పెంచేలా తితిదే.. వీఐపీ బ్రేక్‌ దర్శనాలను అనుమతినిస్తోంది. ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 దర్శనాలంటూ భక్తులను విభజిస్తున్నారు. దీంతో సాధారణ భక్తులు శ్రీవారిని దర్శించుకునే హక్కు కోల్పోతున్నారు. ఏ ఆధారం చేసుకొని వీఐపీల దర్శనం అనుమతిస్తున్నారని సమాచార హక్కు చట్టం కింద కోరితే తాము స.హ.చట్టం పరిధిలోకి రామని తితిదే వివరాలు ఇవ్వడం లేదు’ అని పేర్కొన్నారు.