Politics

మోడీని సైతం గడగడలాడిస్తున్న బెంగాల్ బెబ్బులి

glimpse of mamata banerjees life

రాజకీయ ప్రత్యర్థుల పాలిట ఆమె నిజంగా ‘బెంగాల్ టైగర్’.. అభిమాన జనం మాత్రం ఆమెను ‘దీదీ’ అని ఆప్యాయంగా పిలుస్తారు.. పదిహేనేళ్ల ప్రాయంలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకొన్న ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో కీలక పదవులను చేపట్టారు. ప్రజాసమస్యలపై అనునిత్యం పోరాటం చేయడమే ఆమె ఏకైక వ్యాపకం.. పశ్చిమ బెంగాల్‌కు ఎనిమిదవ ముఖ్యమంత్రిగా 2011లో బాధ్యతలు స్వీకరించిన మమతా బెనర్జీ ఇపుడు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర వహిస్తున్నారు. బెంగాల్‌లో 34 ఏళ్ల ‘కామ్రేడ్ల’ సుదీర్ఘ పాలనకు ఆమె చరమగీతం పాడి జాతీయ స్థాయిలో ఒక్కసారి సంచలనం సృష్టించారు. ముఖ్యమంత్రిగాను, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతూ ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ జత కట్టకుండా ఆమె ఒంటరి పోరాటం చేస్తున్నారు. ప్రధాని పదవికి తాను సైతం పోటీలో ఉన్నానని స్పష్టమైన సంకేతం ఇస్తున్నారు.
1955 జనవరి 5న కలకత్తాలో జన్మించిన ఆమె ఓ వైపు ఉన్నత చదువులు సాగిస్తూనే రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, బెంగాల్ ప్రాంత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్‌కు కార్యదర్శిగాను మమత పనిచేశారు. 1984లో జాదవ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎన్నికైన ఆమె 1991, 1996, 1998, 1999, 2004, 2009 ఎన్నికల్లోనూ ఎంపీగా విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీలోను, పలు పార్లమెంటరీ కమిటీల్లోనూ వివిధ పదవులను నిర్వహించారు. 1970 ప్రాంతంలో కాంగ్రెస్‌లో చేరి వివిధ పదవులను నిర్వహించిన ఆమె రాష్ట్ర ప్రయోజనాల కోసం సొంత పార్టీ నేతలతోనే విభేదించారు. ఎవరికీ తలవంచేది లేదని గర్వంగా చెప్పుకునే ఆమె సొంతంగా పార్టీని ఏర్పాటు చేసి సత్తా చాటుకున్నారు.
బెంగాల్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రిగాను, రైల్వేశాఖను చేపట్టిన తొలి మహిళగాను ఆమె రికార్డు సృష్టించారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో కేంద్ర మంత్రిగా వివిధ కీలక మంత్రిత్వశాఖలను చేపట్టారు. 1991లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా యువజన సర్వీసులు, క్రీడలు, మహిళా శిశు సంక్షేమం వంటి శాఖలను నిర్వహించారు. కాంగ్రెస్‌లో ఇమడలేక 1997లో సొంతంగా ‘తృణమూల్ కాంగ్రెస్’ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత భారతీయ జనతాపార్టీతో సన్నిహితంగా ఉంటూ 1999లో రైల్వేమంత్రిగా పనిచేశారు. 2004లో తిరిగి ఆమె కాంగ్రెస్‌కు మద్దతు పలికి బొగ్గు గనుల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2009లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో రెండోసారి రైల్వే మంత్రిత్వ శాఖ ఆమెను వరించింది.
**ఉద్యమ నేపథ్యం..
రాజకీయంగా ఏ పార్టీకి సన్నిహితంగా మెలిగినా పశ్చిమ బెంగాల్ ప్రయోజనాల కోసం మమత బెనర్జీ తరచూ నిరసన గళం విప్పి పోరాడేవారు. సీపీఎం ప్రభుత్వ హయాంలో పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటు చేయతలపెట్టిన ‘ప్రత్యేక ఆర్థిక మండలి’ ప్రతిపాదనలు ఆమె తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. బడా పారిశ్రామికవేత్తల కోసం పేదరైతుల భూములను సేకరిస్తే సహించేది లేదని సమరశంఖం పూరించారు. నందిగ్రామ్ ప్రజలపై అరాచకాలకు నిరసనగాను, టాటా నానో కార్ల ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన సింగూర్ రైతుల కోసం ఆమె భారీ ఉద్యమం నడిపారు. ఈ పోరాటలతో బెంగాల్ ప్రజలు ఆమెను అక్కున చేర్చుకొన్నారు. రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా, జాతీయ రాజకీయాలకు ఆమె దూరం కాలేదు. రాష్ట్రంలో సీపీఎం ప్రాభవం మసకబారడంలో మమత అలుపెరుగని పోరాటం చేశారు. కాంగ్రెస్ విధానాలు, ఆ పార్టీ నేతల పనితీరు నచ్చక పోవడంతో ఆమె బాహాటంగా విభేదించారు.
**సాదాసీదా వనితగా..
పార్టీ అధినేత్రిగా, ఓ పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ మమతా బెనర్జీ సాధారణ మహిళగా కనపడేందుకే ఇష్టపడతారు. ఉపాధ్యాయుడి కుమార్తె అయిన ఆమె చిన్నప్పటి నుంచీ ఆర్భాటాలకు దూరంగా ఉంటూ- సొంత వ్యక్తిత్వం కన్నా మించినది ఏదీ ఉండదని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాసరే నేత చీరలు, రబ్బరు చెప్పులనే ఆమె వాడతారు. ప్రత్యర్థులపై నిప్పులు కురిపిస్తూ రాజకీయాల్లో ఎంత తీరిక లేకుండా ఉన్నా- మమతకు కవిత్వం అన్నా, చిత్రలేఖనం అన్నా ఎంతో ప్రాణం. సొంతంగా చిత్రాలు గీయడం, చిత్రకళా ప్రదర్శనలకు వెళ్లడం ఆమెకు హాబీ. తన రాజకీయ జీవితం నేపథ్యంలో ఆమె రాసిన మూడు పుస్తకాలు విమర్శకుల ప్రశంసలు పొందాయి.
**మహిళలకు స్ఫూర్తి..
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన బిల్లుకు కాలదోషం పట్టడంతో తన పార్టీ తరఫున అతివలకు మమత రిజర్వేషన్లను ప్రకటించి స్ఫూర్తిదాతగా నిలిచారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో తన పార్టీ తరఫున మహిళలకు 40 శాతం సీట్లను కేటాయించి ఆమె జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించారు. మహిళలకు టిక్కెట్లు ఇచ్చేందుకు ప్రధాన పార్టీలు విముఖత చూపుతుండగా, ‘తృణమూల్ కాంగ్రెస్’ ఇలా 40 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్లు ఆమె తీసుకున్న నిర్ణయం విపక్షాలను విస్మయానికి గురిచేసింది. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఎంలతో ఎలాంటి పొత్తులేకుండా భాజపాకు ఒక్కసీటు కూడా దక్కకుండా చేస్తానని ఆమె భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఎన్నికల ప్రసంగాల్లో ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న ఆమె ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణగా మారింది. ఎన్నికల్లో లబ్ధి కోసం భాజపా మరోసారి రామమందిరాన్ని ప్రచారాస్త్రంగా వాడుకొంటోందని మోదీపై ఈ ‘బెంగాల్ బెబ్బులి’ దాడి చేస్తోంది. అయిదేళ్ల పదవీ కాలంలో ప్రధాని మోదీ ఒక్కసారి కూడా పాత్రికేయులతో సమావేశం కాలేదని ఆమె ఆరోపించడం చర్చనీయాంశమైంది. మోదీకి దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉండాలని మమత సవాల్ చేశారు. పెద్దనోట్ల రద్దుతో ఉగ్రవాదం తగ్గిందని మోదీ గొప్పలు చెప్పుకుంటున్నారని, అయితే ఆయన ప్రభుత్వ హయాంలోనే ఎన్నడూ లేనంతగా దేశంలో ఉగ్రవాదం పురివిప్పిందన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో భాజపాయేతర ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటే ఆమె కీలక భూమిక పోషిస్తారన్న అంచనాలున్నాయి.