WorldWonders

కేవలం కోతుల కోసం 40హెక్టార్లలో 5లక్షల పండ్ల మొక్కలు

exclusive monkey fruit farm in orissa

మానవ తప్పిదాల వల్ల, అత్యాశ వల్ల అభయారణ్యాలు నానాటికీ కనుమరుగైపోతున్నాయి. వాటిపైనే ఆధారపడి జీవించే అనేక ప్రాణుల్లో కోతులు కూడా ఉన్నాయి. అలాంటి అడవులు నరికివేస్తుంటే ఉండడానికి నీడ, తినడానికి తిండి దొరకక అవన్నీ ఎక్కడికెళ్తున్నాయి అని ఆలోచించారా? అవి మానవులతో యుద్ధం చేస్తున్నాయి. మానవుడు నివసిస్తున్న గ్రామాల్లో, పట్టణాల్లో వారి మధ్యే అవీ తిరుగుతూ వాళ్లని భయభ్రాంతులకు గురిచేస్తూ అవి కూడా అనుక్షణం భయం భయంగా మనుగడ సాగిస్తున్నాయి. ‘‘కోతుల గురించి ఎవరూ పట్టించుకోవద్దు! వాటిని అలానే వదిలేయండి..అవి కూడా మనల్ని వదిలేస్తాయి. మనం మాత్రం ఏమీ చేయవద్దు. అవి ఆకలితో అలమటిస్తూ అరుస్తున్నా వాటివైపు చూడకండి’’ ఇవి కోతులకు-మానవులకు జరుగుతున్న యుద్ధం గురించి పార్లమెంట్‌లో ప్రస్తావనకు వచ్చిన విషయాలు. ఈ దుస్థితి నుంచి కోతులను కాపాడేందుకు ముందుకొచ్చిన ఒడిశా ప్రభుత్వం ఎంచుకున్న మార్గాన్ని తెలుసుకుంటే ఔరా అనక తప్పదు. ఒడిశాలో భవానీపట్న-లాంజిగర్‌ రహదారిలో వాహన రద్దీ ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో వేలాది వానరసైన్యం రోడ్ల మీదే అటూఇటూ తిరుగుతూ కనిపిస్తుంది. అలా రోడ్డు దాటేటప్పుడు వాహనాల కింద పడి అవి మృత్యువాత పడిన ఘటనలెన్నో ఉన్నాయి. దీనికి పరిష్కారం కోసం ఆలోచించిన ఒడిశా అటవీ శాఖ అధికారులు, అవి ఎందుకు జనావాసాల్లోకి, గ్రామాల దగ్గరకు, రోడ్ల మీదకు వస్తున్నాయని పరిశీలించారు. వారికి కనిపించిన ఒకే కారణం అడవుల విస్తీర్ణం తగ్గిపోతుండడమే. ఉన్న కొద్దిపాటి అడవుల్లోనూ వాటికి ఆహారం లభించడం లేదు. బిస్వంత్‌పూర్‌కి దగ్గరలో నాలుగు సంవత్సరాల క్రితం 40 హెక్టార్లలో అటవీశాఖ పండ్ల మొక్కలు నాటించింది. ఆ చెట్లకు కాసిన కాయలు, పండ్లు ఆ చుట్టుపక్కల గ్రామాలు, రోడ్లపై తిరుగుతున్న కోతులను ఆకర్షించాయి. నాటి నుంచీ ఈ చెట్లే ఆ కోతులన్నిటికీ ఆవాసాలుగా మారాయి. ఈ విధానం మంచి ఫలితాలివ్వడంతో ఈ కార్యక్రమాన్ని పెద్దయెత్తున చేపట్టేందుకు అటవీ శాఖ సిద్ధమైంది. 350 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 5 లక్షల మొక్కలను నాటించేందుకు కార్యచరణ మొదలుపెట్టింది. వీటిలో 1.5 లక్షల పండ్ల మొక్కలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. రానున్న మూడు, నాలుగు సంవత్సరాల్లో ఈ చెట్లన్నీ కోతులకు నివాసం, ఆహారం అందించేందుకు సిద్ధమవుతాయి. రాజధాని నగరం దిల్లీలో కూడా రమారమి 25,000 కోతులు జనావాసాల్లో సంచరిస్తున్నట్లు టైమ్స్ ఆఫ్‌ ఇండియా వార్తా సంస్థ చేపట్టిన సర్వేలో వెల్లడైంది. వీటన్నిటినీ అడవుల్లోకి తరలించడమంటే అది ఊహకు కూడా అందని విషయం. పట్టణంలో నానాటికీ పెరిగిపోతున్న వీటి వృద్ధిని అరికట్టడానికి రూ.23 కోట్లు వెచ్చించి వాటి ప్రత్యుత్పత్తి శక్తి మందగించేలా చర్యలు తీసుకునేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. ఇలా చేయడం వల్ల కోతులు మరింత ప్రమాదకరంగా మారుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటన్నింటి నడుమా ఒడిశా ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలే అన్ని విధాలా సురక్షితమైనవిగా కనిపిస్తున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఈ విధానాన్ని అనుసరిస్తే కోతులు జనావాసాల్లోకి రాకుండా, వాటి సంఖ్య తగ్గకుండా ఉండేందుకు ఆస్కారం ఉంది.