WorldWonders

గుజరాత్ బరిలో భార్యా బాధితులు

harassed husbands in gujarat elections

భార్యల వేదింపులకు గురయ్యే భర్తల కోసం ఏర్పాటైన స్వచ్ఛంద సంస్థ ‘అఖిల భారతీయ పత్నీ అత్యాచార్‌ విరోధి సంఘ్‌’ అధ్యక్షుడు దశరథ్‌ దేవదా ఎన్నికల బరిలోకి దిగారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ తూర్పు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ మేరకు దశరథ్‌ మంగళవారం తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘భార్య, అత్తమామల వేధింపులకు గురవుతున్న భర్తల కోసం నేను పోరాడుతూనే ఉంటాను. ఎన్నికల్లో గెలిపిస్తే భార్యా బాధితుల అంశాన్ని పార్లమెంట్‌కు తీసుకెళ్తాను’ అని హామీ ఇచ్చారు. దశరథ్ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి కాదు. 2014 లోక్‌సభ ఎన్నికలు, 2017 గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓడిపోయారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు 2,300 ఓట్లు పోలవ్వగా.. అసెంబ్లీ ఎన్నికల్లో అయితే కేవలం 400 ఓట్లు మాత్రమే వచ్చాయి. ‘ఇతర అభ్యర్థుల మాదిరిగా ప్రచారం కోసం నేను డబ్బు ఖర్చు చేయను. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తాను. భార్యల వేధింపులకు గురయ్యే భర్తలకు న్యాయం చేస్తానని హామీ ఇస్తాను’ అని దశరథ్ చెబుతున్నారు. పురుషులకు కూడా జాతీయ కమిషన్‌ తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్న దశరథ్ వారి కోసం స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేశారు. ఈ సంస్థలో దాదాపు 69వేల మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. ‘మహిళలు, పురుషులు ఇద్దరికీ సమానహక్కులు ఉండాలని నేను విశ్వసిస్తాను. భార్యల వేధింపులతో ఏటా వందల మంది పురుషులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటిని ఆపాల్సిన అవసరం ఉంది’ అని దశరథ్‌ ఈ సందర్భంగా అన్నారు.