Business

ఐటీ ఉద్యోగులకు తీపివార్త తెలిపిన సుప్రీంకోర్టు

Your Pension Money Increases Now. Here is how....

ప్రైవేటు రంగ ఉద్యోగులకు అధిక మొత్తంలో పెన్షన్‌ ఇచ్చేలా కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు తెలుపుతూ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో పదవీ విరమణ అనంతరం ప్రైవేటు ఉద్యోగులు అధిక మొత్తంలో పెన్షన్‌ అందుకునేందుకు గానూ మార్గం సుగమమైంది. ఉద్యోగులు పదవీ విరమణ చెందే సమయంలో పొందిన పూర్తి స్థాయి వేతనం ఆధారంగానే పెన్షను ఇవ్వాలని, నెలకు రూ.15,000 ప్రాతిపదికన గణాంకాలు వేసుకుని పెన్షన్‌ ఇచ్చే పద్ధతికి స్వస్తి చెప్పాలని ఇటీవల కేరళ హైకోర్టు ఆదేశించింది. దీనిపై ఈపీఎఫ్‌వో వేసిన పిటిషన్‌ను సుప్రీం తోసిపుచ్చింది. ‘ఈ పిటిషన్‌ను స్వీకరించడానికి సరైన కారణాలు కనపడట్లేదు. దీంతో దీన్ని తిరస్కరిస్తున్నాం’ అని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. అయితే అదనపు సహకారం (ఎక్స్‌ట్రా కంట్రిబ్యూషన్‌) పీఎఫ్‌కు కాకుండా ఉద్యోగుల పెన్షన్‌ పథకం (ఈపీఎఫ్‌) వస్తుంది. సంఘటిత రంగ ఉద్యోగుల కోసం ఈపీఎఫ్‌ 1995లో ప్రారంభమైంది. దీని ప్రకారం యాజమాన్య సంస్థలు .. తమ ఉద్యోగుల వేతనంలోని 8.33 శాతాన్ని పెన్షన్‌ పథకంలో జమ చేయాల్సి ఉండేది. అప్పట్లో ఇది రూ.6,500కు 8.33 శాతానికి (నెలకు రూ.541) మాత్రమే పరిమితమై ఉండేది. మార్చి, 1996లో ఇందులో సవరణలు తీసుకొచ్చారు. ఉద్యోగికి వచ్చే వాస్తవ వేతనం ఆధారంగా ఈ శాతాన్ని గణించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు తీసుకొచ్చింది. అనంతరం సెప్టెంబరు 1, 2014న నెలకు రూ.15,000లో 8.33 శాతం (రూ.1,250)గా లెక్కగట్టాలని ఈపీఎఫ్‌వో నిబంధనలను సవరించింది. అయితే, అదే సమయంలో పూర్తి స్థాయి వేతనం ఆధారంగా ఈపీఎఫ్‌ పొందాలనుకునే వారికి.. వారు గత ఐదేళ్లుగా పొందిన వేతన సగటు ఆధారంగా ఈ ప్రయోజనాలు పొందుతారని తెలిపింది. ఏడాదిగా పొందిన వేతన సగటు ఆధారంగా ప్రయోజనాలు పొందలేరని స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగులు కేరళ హైకోర్టును ఆశ్రయించడంతో ఈపీఎఫ్‌వో ప్రతిపాదనలను తోసిపుచ్చుతూ పాత పద్ధతినే అవలంభించాలని, ఉద్యోగులు ఏడాదిగా పొందిన వేతన సగటు ఆధారంగా ప్రయోజనాలను అందించాలని ఆదేశించింది. అయితే, కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై అప్పట్లోనే ఈపీఎఫ్‌వో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయినప్పటికీ, ఉద్యోగుల విన్నతిని నెరవేర్చాలని, పూర్తి స్థాయి వేతనం ఆధారంగానే పెన్షన్‌ ఇవ్వాలని అక్టోబర్‌ 2016న సుప్రీంకోర్టు ఈపీఎఫ్‌వోకు సూచించింది. అయితే, పలు సంస్థలకు ఇందులోంచి మినహాయించాలని ఈపీఎఫ్‌వో భావించింది. దీనిపై అభ్యంతరాలు వచ్చాయి. కేరళ, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌, మద్రాస్‌తో పాటు పలు హైకోర్టులు కూడా ఉద్యోగులకు సానుకూలంగా ఆదేశాలు ఇచ్చాయి. దీంతో ఈపీఎఫ్‌వో తిరిగి సుప్రీంకోర్టు వెళ్లినా లాభం లేకుండా పోయింది. దీంతో సెప్టెంబరు 1, 2014 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి కూడా పూర్తి స్థాయి వేతనం ఆధారంగానే పెన్షన్‌ ప్రయోజనాలు పొందవచ్చు. ఇక వాస్తవిక వేతనంపైనే పెన్షన్‌ పొందొచ్చు.. దీంతో పెన్షన్‌ భారీగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగి, యజమాని ఎప్పుడైనా ఆప్షన్‌ ఇవ్వొచ్చు. 2014 ముందు పదవీ విరమణ చేసిన వారితో సమానంగా అన్ని సంస్థల్లోని ఉద్యోగులు ఈ ప్రయోజనాలు అందుకోవచ్చు.