Politics

రాష్ట్రాన్ని ఏలిన కర్నూలు బిడ్డలు

politicians from kurnool

రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అత్యున్నత పదవులు పొందిన నేతలకు కర్నూలు జిల్లా ఐదు దశాబ్దాలుగా ముఖద్వారంగా ఉంది. రాష్ట్రపతి పదవిని పొందిన ఏకైక తెలుగు తేజం నీలం సంజీవరెడ్డి నంద్యాల నుంచి ఎంపీగా ఎన్నికైన తర్వాత లోక్‌సభ స్పీకర్‌గా, ఆ తర్వాత రాష్ట్రపతిగా విధులు నిర్వర్తించారు. ఆయన తర్వాత ప్రధానమంత్రి పదవి చేపట్టిన ఏకైక తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు కూడా నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఒకే లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండు అత్యున్నత స్థాయి పదవులు పొందిన వ్యక్తులు ఉండటం దేశ చరిత్రలోనే ప్రథమం.
*నీలం సంజీవరెడ్డి :
ఈయన 1977లో నంద్యాల నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో 41 స్థానాల్లో కాంగ్రెస్‌ ప్రభంజనం సృష్టించగా ఒక్క నంద్యాల లోక్‌సభ నుంచే జనతా పార్టీ అభ్యర్థిగా విజయదుందుభి మోగించారు నీలం సంజీవరెడ్డి. అదే ఏడాది మార్చి 26 నుంచి జులై 13 వరకు లోక్‌సభ స్పీకరుగా కొనసాగారు. వెనువెంటనే దేశ అత్యున్నత పదవైన రాష్ట్రపతిగా 1977 జులై 25 నుంచి 1982 జులై 25 వరకు సేవలందించారు.
*పీవీ నరసింహారావు :
దేశానికి తొలి తెలుగు ప్రధానిగా 1991 జూన్‌లో పదవీ బాధ్యతలు చేపట్టిన పీవీ నరసింహారావు నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి బంగారు లక్ష్మణ్‌పై అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. తిరిగి ప్రధాని హోదాలోనే 1996లో జరిగిన సాధారణ లోక్‌సభ ఎన్నికల్లో నంద్యాల నుంచే ఆయన విజయం సాధించారు. పీవీ నరసింహారావు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 1971 నుంచి 1973 వరకు సేవలందించారు.
*కోట్ల విజయభాస్కర్‌రెడ్డి :
కోడుమూరు నియోజకవర్గంలోని లద్దగిరికి చెందిన కోట్ల విజయభాస్కర్‌రెడ్డి రెండు పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కోట్ల విజయభాస్కర్‌రెడ్డి శాసనసభకు ఎన్నికయ్యేందుకు 1993లో పాణ్యం నుంచి జరిగిన ఉపఎన్నికల్లో విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా రెండో పర్యాయం కొనసాగారు.
*దామోదరం సంజీవయ్య:
రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1960 జనవరి నుంచి 1962 మార్చి వరకు ఉన్న దామోదరం సంజీవయ్య జిల్లాకు చెందిన పెద్దపాడు గ్రామానికి చెందిన నేత. 1952లో కర్నూలు ద్విసభ్య నియోజకవర్గం నుంచి, 1955లో ఎమ్మిగనూరు నుంచి, 1962లో కోడుమూరు నుంచి ఆయన శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు.
*పెండేకంటి వెంకటసుబ్బయ్య:
జిల్లాకు చెందిన పెండేకంటి వెంకటసుబ్బయ్య నంద్యాల పార్లమెంట్‌ స్థానం నుంచి 4సార్లు ఎన్నికయ్యారు. ఆయన కేంద్రంలో హోం శాఖ మంత్రిగా పని చేశారు. బిహార్‌ గవర్నరుగా 1985 మార్చి నుంచి 1988 ఫిబ్రవరి వరకు, కర్ణాటక గవర్నరుగా 1988 ఫిబ్రవరి నుంచి 1990 ఫిబ్రవరి వరకు కొనసాగారు.
జిల్లాకు చెందిన బీవీ సుబ్బారెడ్డి కోవెలకుంట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పలుసార్లు ఎన్నికయ్యారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడుసార్లు శాసన సభాపతిగా వ్యవహరించారు.
నంద్యాల నుంచి శాసనసభకు ఎన్నికైన ఎన్‌ఎండీ ఫరూక్‌ శాసనసభ ఉప సభాపతిగా 1995 జనవరి నుంచి 1999 అక్టోబరు వరకు ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం శాసన మండలి అధ్యక్షునిగా 2017 నవంబరు నుంచి 2018 నవంబరు వరకు సేవలందించారు.
జిల్లాకు చెందిన నివర్తి వెంకటసుబ్బయ్య, చక్రపాణి యాదవ్‌ కూడా శాసన మండలి నుంచి ఎన్నికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసన మండలి అధ్యక్షులుగా పని చేసి ఉన్నత పదవులు పొందినవారి వరసలో ఉన్నారు.