Kids

గురువుగారి కళ్లు తెరిపించిన శిష్యుడు

teacher student story telugu tnilive kids

సిరిపురం అనే గ్రామంలో రామశాస్త్రి అనే గురువు ఉండేవారు. ఆయన దగ్గరకు విద్యాభ్యాసం కోసం ఆ ఊరి పిల్లలు వచ్చేవారు. వారి తల్లిదండ్రులు విద్య నేర్పుతున్న గురువుకు తగిన పారితోషికం చెల్లించేవారు. రామశాస్త్రి గారి భార్య సీతమ్మ విద్యను అభ్యసించడానికి వచ్చే విద్యార్థులందరికీ పాలు కాచి గ్లాసులో పోసి రోజూ ఇచ్చేది. భార్య అలా డబ్బు తగలెయ్యడం రామశాస్త్రి గారికి నచ్చేది కాదు. రామశాస్త్రి శిష్యుల్లో సుందరుడు ఒకడు. తను గురువు గారికి ఇవ్వాల్సిన డబ్బు బాకీ పడ్డాడు. రామశాస్త్రి సుందరుడిని విసుక్కుంటూ లోలోపలే తిట్టుకునేవారు. ఓ రోజు గురువు రామశాస్త్రి ఇంటికి సుందరుడు ఆవుతో వచ్చాడు. గురువుకది అర్థం కాలేదు. ‘గురువర్యా! మీరు మాకు అమూల్యమైన జ్ఞానాన్ని అందించారు. అందుకు మీకు ఎంత డబ్బు ఇచ్చినా తక్కువే. మా గురుపత్ని సీతమ్మ గారు రోజూ విద్యార్థులకు పాలు ఇచ్చేవారు. చదివిన చదువు మాకు అందుకే అబ్బింది. మా నాన్నగారితో చెప్పి ఆవు కొని మీకు ఇమ్మన్నాను. ఈ ఆవు మీకు మన విద్యార్థులకూ పనికి వస్తుంది.’ అని సుందరుడు అన్నాడు. ఆ మాటలు విని, శిష్యుడిని అపార్థం చేసుకున్నందుకు తనని తానే నిందించుకున్నాడు రామశాస్త్రి.
ఇంతలోనే సుందరుడి తండ్రి వచ్చి ‘గురువుగారూ నమస్కారం! మీకు ఆవు ఇద్దామనుకున్నాం. కానీ మరి దానికి కావాల్సిన గడ్డి మీకెలా వస్తుంది? అని ఆలోచించా. అందుకే పక్కనున్న ఈ పొలం మీ ఆవు కోసం మీకోసం ఇస్తున్నాం.’ అని అనగానే గురువుగారితో పాటు ఆయన భార్య కూడా ఆశ్చర్యపోయింది. ఈలోగా అక్కడికి సుందరుడి తల్లి వచ్చింది. ఆమె గురువు గారితో ‘అయ్యా! ఈ వ్యవసాయ పనులు, ఆవును మేపడం మీకు తెలియవు. కనుక ఇవన్నీ కాపలా కాసేందుకు ఓ కాపలాదారుడిని నియమించుకోండి. అందుకు అయ్యే ఖర్చు మేం భరిస్తాం’ అంది. గురువు రామశాస్త్రికి మతిపోయినంత పనయ్యింది. సుందరుడే గొప్ప పని చేశాడనుకుంటే అతని తల్లిదండ్రులు తీసుకున్న ఈ నిర్ణయాలు నేనెవరి దగ్గరా విద్య నేర్పడానికి చేయి చాపాల్సిన పనిలేకుండా చేశాయి. తల్లిదండ్రుల్ని బట్టే పిల్లలు కదా! అయినా ఎన్నోసార్లు భార్య సీతమ్మని పిల్లలందరికీ పాలు పంచి పెడుతున్నందుకు తిట్టిన రోజులు అతనికి గుర్తుకువచ్చాయి. తన భార్య ఓ మంచి పని చేయబట్టే కదా! ఇన్ని ప్రయోజనాలు తనకు చేకూరాయి. శిష్యుడిగా సుందరుడు తన బాధ్యత నెరవేర్చాడు. గురువుగా నా బాధ్యత గుర్తుచేశాడు. శిష్యుడిగా తన నుంచి ఏమి నేర్చుకున్నాడో గానీ సుందరుడి నుంచి మాత్రం నేను చాలా నేర్చుకున్నా అనుకుని తన బుద్ధిని మార్చుకుని ఏ ప్రతిఫలమూ ఆశించకుండా విద్యాదానం చేయసాగాడు రామశాస్త్రి.