DailyDose

22 లక్షల ఉద్యోగాలిస్తా-తాజావార్తలు–04/06

rahul promises 22lakh jobs

*కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 22 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. శనివారం ఆయన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఇన్ని లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, వాటిని భర్తీ చేయకుండా ప్రధాని మోదీ ఇప్పటి వరకూ తాత్సారం చేశారని విమర్శించారు. సుపరిపాలన అంటే ఏమిటో తాము అధికారంలోకి వచ్చాక చేసి చూపిస్తామని తెలియజేశారు. భాజపా వ్యవస్థాపకుడు, పార్టీలో అత్యంత సీనియర్‌ నేత ఎల్‌.కే.ఆడ్వాణీని కావాలనే పక్కన పెట్టారంటూ మోదీపై మరో విమర్శనాస్త్రం సంధించారు. అసలైన నాయకునికి ఉండాల్సిన లక్షణాలను ఆడ్వాణీ నుంచి నేర్చుకోవాలని హితవు పలికారు.
*లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాన మంత్రి అభ్యర్థిని కాంగ్రెస్ ఎన్నడూ ప్రకటించలేదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం చెప్పారు. ఎన్నికలకు ముందే ప్రధాన మంత్రి అభ్యర్థిని ప్రకటించాలన్న నిబంధన ఏదీ లేదన్నారు.
*కాంగ్రెస్‌లో చేరిన లోక్‌సభ ఎంపీ శత్రుఘ్న సిన్హా.. పార్టీ మార్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో తనకు 25 ఏళ్ల అనుబంధం ఉందని.. అయితే తాను కాంగ్రెస్ పార్టీలో చేరాలని రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇప్పటి బీజేపీ ప్రభుత్వం ఏక వ్యక్తి పార్టీగా, ఇద్దరు వ్యక్తుల సైన్యంగా మారిపోయిందని ఎద్దేవా చేశారు.
*దేశంలో మళ్ళీ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వమే ఏర్పాటవుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈసారి కూడా బీజేపీకి సానుకూల పవనాలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయన్నారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 2014లో కన్నా 2019లో ఎక్కువ లోక్‌సభ స్థానాల్లో తమకు విజయం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి కూడా సంపూర్ణ ఆధిక్యతతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
*కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష సమావేశం నిర్వహించింది. వీడియో కాన్ఫిరెన్స్ లో తొలివిడత పోలింగ్ జరుగనున్న రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి సీఈవో రజత్‌కుమార్ఇతర అధికారులు పాల్గొన్నారు. పోలింగ్ రోజు దివ్యాంగ ఓటర్ల కోసం చేస్తున్న ఏర్పాట్లపై సమావేశంలో అధికారులను వివరాలు అడిగారు. రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను ఈసీఐకి అధికారులు వివరించారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పోలింగ్ ఏర్పాట్లపై సమీక్షించారు. నిజామాబాద్ పోలింగ్ ఏర్పాట్లుఈవీఎంల సన్నద్ధతను సీఈవో కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించారు.
*ఈశాన్య రాష్ట్రాలో సాయుధ బలగాల ప్రత్యేక చట్టాన్ని రద్దు చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. దేశ వ్యాప్తంగా ఆ నిర్ణయం ఎందుకు తీసుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో సాయుధ బలగాల ప్రత్యేక చట్టంపై పున:సమీక్షను బీజేపీ నేతలు తప్పు పట్టడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయుధ బలగాల చట్టాన్ని ఈశాన్యంలో ఉందుకు రద్దు చేశారో ప్రధానమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
*పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్‌లో రూపొందించిన ఎన్నికల ప్రచార రథాలను ఎంపీ వినోద్‌కుమార్ తన నివాసం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో డిజిటల్ తెరతో ఉన్న ప్రచార వాహనాలతో పాటు సైకిళ్లు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ వాహనాలు నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాయన్నారు.
*పశ్చిమగోదావరి జిల్లా తణుకు జనసేన అభ్యర్థి పసుపులేటి వెంకటరామారావు తరఫున నర్సాపురం ఎంపీ అభ్యర్థి నాగబాబు తనయుడు, సినీ హీరో వరుణ్‌ తేజ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అత్తిలి ప్రధాన రహదారితో పాటు రేలంగి, తణుకు తదితర ప్రాంతాల్లో శనివారం రోడ్‌షోలో పాల్గొన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా తన బాబాయ్‌ పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లోకి వచ్చారని, అంతా ఆయనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ రోడ్‌ షోలో జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
* అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఆదరించిన మైనార్టీలకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. కూకట్‌పల్లి రాజీవ్‌ గాంధీనగర్‌ మైదానంలో మైనార్టీల భారీ బహిరంగసభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు.
*వేసవి రద్దీ కారణంగా, ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే కాజీపేట మీదుగా నడపనుంది. హైదరాబాద్‌- శ్రీకాకుళం టౌన్‌ మధ్య ప్రత్యేక రైలు (07026) 10న హైదరాబాద్‌లో 23.00 గంటలకు బయలుదేరి, మరునాడు 12.50 గంటలకు గమ్యం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 11న శ్రీకాకుళం టౌన్‌ నుంచి 13.50 గంటలకు బయలుదేరి, మరురోజు హైదరాబాద్‌కు 05.15 గంటలకు చేరుకుంటుంది.
* ‘కలెక్టర్‌’ పేరు మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన చేయడం సరికాదని టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్‌ అన్నారు. ఆమె శుక్రవారం గాంధీభవన్‌లో మాట్లాడారు. ఇప్పటికే ఆంగ్లంలో కలెక్టర్‌ అని, తెలుగులో ‘పాలనాధికారి’ అనే వాడుకలో ఉన్నాయన్నారు. కేసీఆర్‌ ఆలోచన…ఆయన రాచరికపు పోకడకు నిదర్శనమని విమర్శించారు. నిజామాబాద్‌లో రైతులకు ఇంకా గుర్తులు కేటాయించకపోవడం దారుణమని..ఎన్నికల సంఘం తెరాసకు తొత్తుగా వ్యవహరిస్తోందన్నారు. కేసీఆర్‌ పాలనలో వివక్ష చూపుతున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్థన్‌రెడ్డి పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలనే కేసీఆర్‌ వ్యాఖ్యలు ఫ్యూడల్‌ మనస్తత్వానికి నిదర్శనమని టీపీసీసీ అధికార ప్రతినిధి సతీష్‌ మాదిగ విమర్శించారు.
*గ్రామ పంచాయతీల్లో మే 10లోగా ఓటర్ల తుది జాబితాలు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖను శుక్రవారం ఆదేశించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ సంచాలకుడి కార్యాలయం కోరింది.2019 జనవరి 1న అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రచురించిన ఓటర్ల తుది జాబితాల ఆధారంగా పంచాయతీ, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు అధికారులు సిద్ధం చేయాలి.