Movies

తలైవా లీక్స్

rajini 167 leaks

అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ కొత్త సినిమా లుక్‌ లీకైంది. ‘పేట’ తర్వాత తలైవా ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రజనీ 167వ సినిమాగా ఇది తెరకెక్కనుంది. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. పోలీసు అధికారిగా, సామాజికవేత్తగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని పాపులర్‌ స్టూడియోలో గురువారం ఈ సినిమాకు సంబంధించిన ఫొటోషూట్‌, లుక్‌ టెస్ట్‌ జరిగాయట. అయితే రజనీ పోలీసు అధికారి గెటప్‌లో ఉన్న ఫొటోలు లీక్‌ అయ్యాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అవి గురువారం జరిగిన ఫొటోషూట్‌లోనివని చెబుతున్నారు. దీంతో లీక్‌ అయిన ఫొటోల్ని షేర్‌ చేయొద్దని రజనీ ప్రతినిధి అభిమానుల్ని కోరారు. ‘లీకైన స్టిల్స్‌ను షేర్‌ చేయొద్దని తలైవా ఫ్యాన్స్‌ను కోరుతున్నాం. లుక్‌ అధికారికంగా విడుదల అయ్యే వరకూ ఎదురుచూడండి. దయచేసి మాకు సహాయం చేయండి’ అని ప్రతినిధి మీడియాతో పేర్కొన్నారు. ఏప్రిల్‌ 10 నుంచి ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కాబోతోందట. నయనతార ఇందులో కథానాయిక పాత్ర పోషించబోతున్నారు. ఈ సినిమాకు సంతోష్‌ శివన్‌ సినిమాటోగ్రఫీ అందించబోతున్నారు. అనిరుధ్‌ బాణీలు సమకూర్చనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయాలని యూనిట్‌ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రజనీ, నయన్‌ ఇప్పటికే ‘చంద్రముఖి’, ‘కథానాయకుడు’ సినిమాల కోసం కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే.