DailyDose

ఓటర్లకు పంచుతున్న ఏసీ మిషన్ల పట్టివేత–నేరవార్తలు–04/07

election ac machines caught in vijayawada

*రెండు లారీల్లో తరలిస్తున్న ఏసీలు, వాషింగ్ మిషన్లు విజయవాడ నగర పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి పట్టుకున్నారు. డీలర్లు ఎలాంటి ఆర్డర్ ఇవ్వకుండా గోదాముల్లో ఉన్న వాటిని తరలించడం అనుమానాలకు తావిస్తోంది. మంగళగిరి తెదేపా అభ్యర్ధి నారా లోకేష్ ఎన్నికలో గెలవడానికి అడ్డదారులు తొక్కుతున్నారని ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అధునాతన ఎయిర్ కండీషన్ర్లు పంపిణీ చేస్తున్న తెదేపా నేతలు నియోజకవర్గంలో ఓటర్లకు స్లిప్పులు ఇస్తూ విజయవాడలో డెలివరీ తీసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా పెద్ద సంఖ్యలో ఏసీలు వాషింగ్ మెషీన్లు పట్టుబడిన నేపద్యంలో వీటిని కూడా మంగళగిరి ఓటర్లు కోసమే తరలిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
*తెదేపా నేతలు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు సిద్దం చేసారని సమాచారం అందడంతో తహసిల్దారు అంజనాదేవి రాష్ట్ర ఎన్నికల తనిఖీ అధికారి చంద్రశేఖరన్ రెవెన్యు సిబ్బందితో శనివారం సాయంత్రం యాడికి మండల పరిధిలోని జేసీ దివాకర్ రెడ్డి జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. అయిగే గదులు తలలు వేసి ఉండటంతో వీఆర్వో పవిత్ర ప్రిన్సిపాల్ ను ఫోన్ లో సంప్రదించారు.
* ఆంబూరులో కంటైనర్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు ఇద్దరు మృతి చెందారు. వివరాలు.. వేలూరు జిల్లా తిరుపత్తూరు మాజీ ఎమ్మెల్యే సుందరవేల్‌(71) ఆయన భార్య విజయలక్ష్మి(65) శనివారం ఉదయం చెన్నైలోని ఆస్పత్రికి కారులో బయలుదేరారు. కారును అదే ప్రాంతానికి చెందిన వీరమణి నడుపుతున్నాడు. ఉదయం 6 గంటలకు ఆంబూరు సమీపంలోని విన్నమంగళం వద్ద వస్తున్న సమయంలో కంటైనర్‌ను ఓవర్‌ టేక్‌ చేయడానికి ప్రయత్నించారు. వాహనం అదుపు తప్పి కంటైనర్‌ వెనుకభాగం ఢీకొంది.
*వ్యానులో వస్త్రాలతో చుట్టిన మూటల్లో తరలిస్తున్న 149 కిలోల బంగారాన్ని ఎన్నికల తనిఖీ అధికారులు పట్టుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరు సింగానల్లూర్‌ నియోజకవర్గంలో అధికారులు పులియకుళంలో శుక్రవారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టారు.
*తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో జరిపిన వాహన తనిఖీల్లో రూ.4.60 కోట్ల నగదు, రూ.కోటి విలువైన వజ్రాలు, బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మహేశ్వరి రవికుమార్‌ తెలిపారు.
*తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి…హత్య చేసిన ఘటన విలేపార్లే ప్రాంతంలో జరిగింది. విలేపార్లేలోని నెహ్రూనగర్‌ ప్రాంతంలో ఉన్న పబ్లిక్‌ టాయిలెట్‌లో బాలికశవం పడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గురువారం సాయంత్రం నుంచి బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
*గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం ఉప్పలపాడు, జరుగులవారిపాలెం సమీపంలో శనివారం తెదేపా కార్యకర్తలపై వైకాపావారు చేయి చేసుకున్నారు.
*మధ్యప్రదేశ్‌ హోషంగాబాద్‌ జిల్లాలో సంభవించిన భారీ అగ్నిప్రమాదం 30 గ్రామాలను బుగ్గిపాలు చేసింది. ఎకరాలకొద్దీ పంట బూడిదైంది. మంటల ధాటికి ముగ్గురు మృతి చెందగా, 25 మంది గాయపడ్డారు.
*మహిళా హాస్టల్లోకి వెళ్లి మద్యం తాగేందుకు అనుమతించలేదన్న కోపంతో హాస్టల్‌ యజమాని, అతని సోదరులపై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన బెంగళూరులోని బండేపాళ్య పోలీసు ఠాణా పరిధిలో చోటు చేసుకుది.
*పెళ్లి బృందంతో వెళుతున్న వ్యాను, ఓ లారీ ఢీ కొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పశ్చిమ చంపారన్‌ జిల్లా రామ్‌నగర్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
*ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బి.దుర్గారావు (38) అనే బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ తన సర్వీసు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
*మంచిర్యాల జిల్లా సుందర్‌శాల సమీపంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న అన్నారం బ్యారేజి వద్ద చైన్‌ జేసీబీ మీద నుంచి తొక్కుకుంటూ వెళ్లడంతో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు.
*మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లాలో రెండు వేర్వేరు పులుల దాడుల్లో ఇద్దరు మృతి చెందారు. నవేగావ్‌ (ఖుర్ధు) గ్రామానికి చెందిన అనసూయ బన్‌కర్‌(60) తన సోదరితో పాటు మరి కొందరు మహిళలతో కలిసి గ్రామానికి దగ్గరలో ఉన్న అడవిలోకి ఇప్పపువ్వు కోసం శనివారం ఉదయాన్నే వెళ్లారు. ఇప్పపువ్వు సేకరిస్తున్న సమయంలో పొదల్లో మాటువేసిన పులి ఒక్కసారిగా అనసూయ బన్‌కర్‌పై దాడి చేసింది.
*కారులో తరలిస్తున్న రూ.కోటి నగదును విశాఖ జిల్లా అనకాపల్లి పోలీసులు శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి జాతీయ రహదారి తోటాడ కూడలి సమీపంలో కారులో నగదు తరలిస్తున్నారని పోలీసులకు అందిన సమాచారం మేరకు తనిఖీలు చేశారు. డబ్బు గురించి వాహనంలో ఉన్న కె.రమణ, ఈశ్వరరావులను పోలీసులు ప్రశ్నించగా.. గాజువాకలో ఒక వ్యక్తి ఈ అట్టపెట్టెను అనకాపల్లిలో ఒకరు వచ్చి తీసుకుంటారని చెప్పాడని తెలిపారు. పెట్టెలో నగదు ఉన్నట్లు తమకు తెలియదని చెప్పారు. నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు.
*పరీక్షలు బాగా రాయలేదన్న మనస్తాపంతో ఇంటి నుంచి పారిపోయి వచ్చిన సికింద్రాబాద్‌కు చెందిన ఇద్దరు బాలికలు శనివారం రాజమహేంద్రవరంలోని రోడ్డు-రైలు వంతెనపై నుంచి గోదావరిలో దూకారు. వారిలో ఒకరు మృతి చెందగా..మరో బాలికను మత్స్యకారులు రక్షించి ఒడ్డుకు చేర్చారు.
*హైదరాబాద్‌లో వేర్వేరు చోట్ల నిర్వహించిన తనిఖీల్లో పోలీసులు శనివారం రూ.1.34 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. డబ్బుకు సంబంధించిన లెక్కలు చూపించకపోవడంతో నగదును జప్తు చేసి, నిందితులను విచారిస్తున్నారు.
*అబుదాబిలో ఈ నెల 4న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వరంగల్‌కు చెందిన డాక్టర్‌ ముప్పా జగదీశ్‌(44) మృతిచెందారు.
*రాత్రి షిఫ్ట్‌లో విధులు నిర్వర్తించుకుని ఉదయాన్నే తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిని లారీ రూపంలో మృత్యువు కబళించింది.
*మెదక్ జిల్లాలోని తూప్రాన్ మండలం గుండ్రేటిపల్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు చెట్టును ఢీకొని బోల్తాపడటంతో జరిగిన ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
* సోపోర్ పరిధి వార్‌పొర వద్ద ఉగ్రవాదులు చెక్‌పోస్టుపై దాడికి పాల్పడ్డారు. అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న జవాను ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందాడు. మృతుడు మహ్మద్ రఫీగా గుర్తించారు. భద్రతా దళాలకు – ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.
*జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ జిల్లా ఇమామ్ సాహిబ్ వద్ద భద్రతా దళాలకు – ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. భద్రతా బలగాలు ఇమామ్ సాహిబ్ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఘటనా స్థలం వద్ద భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
*చిత్తూరు జిల్లా మదనపల్లె పోలీసు సర్కిల్ ఇన్స్ పెక్టర్ పీ.సురేష్ కుమార్ ను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. రాజంపేట అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడు జీఎస్ నవీన్ కుమార్ ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాదికారి గోపాలకృష్ణ దివ్వేది చర్యలు తీసుకున్నారు.